హైదరాబాద్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేటలో కాంగ్రెస్ గూండాగిరీపై (Congress Goons) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కన్నెర్రజేశారు. సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) గెలిచిన అధికార పార్టీ నేత.. బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజు, ఆయన కుటుంబసభ్యులపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్యాయత్నం చేయడం దుర్మార్గమని ఖండించారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన కేటీఆర్.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసి, పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
గాయపడ్డ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం కామారెడ్డి ఎస్పీతో మాట్లాడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార పార్టీ నేతల గూండాగిరి రోజురోజుకూ పెరిగిపోతున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సోమార్పేటలో కాంగ్రెస్ నేతల భౌతిక దాడులను పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.
కాంగ్రెస్ నేతలు అరాచకాలకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కామారెడ్డి ఎస్పీకి స్వయంగా ఆయన ఫోన్ చేసి సోమార్పేట ఘటనను వివరించి బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే కొనసాగితే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని తేల్చిచెప్పారు. కార్యకర్తలు తిరగబడే రోజూ దగ్గరలోనే ఉన్నదని హెచ్చరించారు.
అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అప్పుడు అధికారపార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంచేశారు. చట్టం తన పని తాను చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాడితప్పిన కాంగ్రెస్ నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నదని పునరుద్ఘాటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి చిన్నాన్నే ఈ ఘాతుకానికి పాల్పడడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.