ఉద్యమం నుంచి వచ్చిన..రాహుల్‌గాంధీ ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిండు? శ్రీధర్‌బాబు, రాజనర్సింహ, కోమటిరెడ్డి, భట్టి.. వీళ్లంతా ఎట్ల వచ్చిండ్రు? చుట్టూ వీళ్లను పెట్టుకొని రేవంత్ మాట్లాడటం గొంగట్లో వెంట్రుకలు ఏరినట్టు ఉన్నది. బరాబార్ నేను ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన. నీ లెక్క ఆంధ్రోళ్ల బూట్లు నాకి, దొంగ సంచులు మోసి రాలె. ఐదుసార్లు గెలిచిన. రాంగ్ రూట్లో రాలె. చవట పనులు చేసి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు మారి రాలె. యస్.. మా అయ్య కేసీఆర్. తెలంగాణ బాపు కేసీఆర్.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR | నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులపై ప్రేమ ఉంటే.. బోనస్ మాట బోగస్ కాకపోతే.. ఎలక్షన్ కోడ్ రాకముందే రూ.500 అమలుకు జీవో జారీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొని పార్లమెంటు ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ‘ఆడబిడ్డలకు రేవంత్‌రెడ్డి ఏం చెప్పిండు? కల్యాణలక్ష్మికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నడు. ఇచ్చిండా? అంటే అదే లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్నడు. వంద రోజులు నిండినంకా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది ఆడబిడ్డలే. మార్చి 15కు వందరోజుల సినిమా పూర్తవుతుంది. శిశుపాలుడు వంద తప్పులు చేసేదాకా ఆగినట్టు కాంగ్రెస్ వంద రోజుల పాలన వరకు ఆగుదాం. ఆ తర్వాత భరతం పడదాం’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోడ్ పేరుతో తప్పించుకునే కుయుక్తులు చేస్తున్నదని దుయ్యబట్టారు. రైతులు కష్టాల్లో ఉన్నారని, పంటలు ఎండిపోతున్న రైతులకు నష్టపరిహారం కింద ఎకరానికి రూ.10 వేలు అందించాలని డిమాండ్ చేశారు. రూ.2లక్షల రుణమాఫీని తక్షణం వర్తింపజేయాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాండవిస్తున్న కరువు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు.
రైతులు బాధపడుతున్నరు
‘మొన్న గంగుల కమలాకర్‌తో కలిసి కరీంనగర్లో పంటలు ఎండిపోతే పరిశీలనకు వెళ్లిన. నలుగురైదుగురు రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటే గుండె తరుక్కుపోయింది. పంటలు ఎండుకపోయి రైతుల ముఖాల్లో జీవం పోయింది. అర్ధరాత్రి బాయి కాడికి పోయే రోజులు మళ్లా వచ్చాయని ఆ రైతులు చెబుతుంటే బాధనిపించింది. అంతా గందరగోళంగా ఉన్నది. బతుకులు ఆగమయ్యే పరిస్థితులున్నాయని వారంతా వివరించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు యాభై వేలు వచ్చేదని, ఏడాదికి లక్ష వచ్చేదని పది ఎకరాల ఆసామి చెప్పిండు. ఇప్పుడు ఆ పైసల్ రాకపోగా బోరు రిపేర్లకు ఉల్టా లక్ష అయ్యిందని బాధపడ్డడు. తినే పల్లెంలో మట్టి పోసుకుంటిమి అని సామాన్య జనాల్లో బాధ కనిపిస్తున్నది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే. కొద్దిగా ధైర్యం, ఓపికతో ఎదురుదెబ్బను పక్కనపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో జైత్రయాత్రను మొదలుపెడదాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నిజాయితీగల్ల మోసగాడు రేవంత్‌రెడ్డి
‘ఎలక్షన్లలో అనేక టీవీల్లో రేవంత్‌రెడ్డి ఖుల్లా ఒకటే చెప్పిండు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారని, ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారని నిజాయితీగా చెప్పిండు. నిజాయితీగల్లా మోసగాడు రేవంత్‌రెడ్డి. తప్పు ప్రజలది కాదు. మనం చక్కగా రేవంత్ రెడ్డి గురించి చెప్పలేకపోయాం. పొంకనాల పోతిరెడ్డి లెక్క ఎన్నో మాటలు చెప్పిండు. రైతులంతా లోన్లు తెచ్చుకోవాలని రెచ్చగొట్టిండు. డిసెంబర్ 9న రద్దు చేస్తానని చెప్పిండు. అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా అతీగతీ లేదు’ అని కేటీఆర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో సీఎం పిచ్చిపిచ్చిగా మాట్లాడారని, పేగులు మెడలో వేసుకుంటానని అన్నారని, ఆయనేమైనా బోటీ కొట్టేటోడా? అని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి పోయి ఏ ఎండకు ఆ గొడుగుపట్టే పొంకనాల పోతిరెడ్డి అని విమర్శించారు. ‘ఎటు గాలి ఉంటే అటు పోతడు తప్ప ఆయనకో నీతి లేదు. సిద్ధాంతం లేదు. రేపు పార్లమెంటు ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీకి వెన్నుపోటు పొడిచి పక్కాగా బీజేపీలో చేరుతడు. అలాంటి పార్టీకి ఓట్లు వేసి పరోక్షంగా బీజేపీకి లాభం చేయవద్దు’ అని తెలిపారు. రాష్ట్రంలో సగం కాంగ్రెస్, సగం బీజేపీ ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు.
అలాంటోళ్లను పార్టీలో చేర్చుకోం
పార్టీని వీడిపోతున్న వారిని తిరిగి చేర్చుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని, బెల్లం చుట్టూ ఈగలు ముసురుకున్నట్టు మళ్లీ వస్తారని, అలాంటోళ్లను పార్టీలో తీసుకోబోమని తేల్చి చెప్పారు. ఈ నెల 12న కరీంనగర్లో జరిగే కదనభేరి సభను భగ్నం చేయాలని రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. సభ రోజే మహిళలతో హైదరాబాద్‌లో మీటింగ్ ఏర్పాటుచేసి, బస్సులు దొరకనీయకుండా విషం గక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌కు గుదిబండలా మారారని, బీఆర్ఎస్కు ఓటు వేసి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. సమావేశాల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, రాజన్నసిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు రాజారాం తదితరులు పాల్గొన్నారు.
గంప గోవర్ధన్ భావోద్వేగం
సమావేశంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భావోద్వేగానికి గురయ్యారు. సభలో గద్గదస్వరంతో ఆయన ప్రసంగం మొదలైంది. మొదటగా కేసీఆర్ ఓటమికి క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టడంతో గులాబీ శ్రేణులంతా గంభీర వాతావరణంలో మునిగిపోయారు.
పదిరోజులైనా పత్తా లేడు
సిరిసిల్లలో నేను, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి రాజీనామాలు చేసి గెలుద్దామని సవాల్ విసిరితే పది రోజులైనా పత్తాలేడు. ఇప్పటి వరకు మాటెత్తడం లేదు. దిక్కుమాలిన డైలాగులు బంద్ చేసి బుడ్డరఖాన్లా ఒర్రుడు మానుకుని ముఖ్యమంత్రిలా బిహేవ్ చెయ్. మగాడివైతే రైతులకు ఇస్తానని చెప్పిన బోనస్ ఇవ్వు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి కింద రూ.2,500 అందివ్వు. రూ.4వేలు ఫించన్లు ఇవ్వు. దమ్ముంటే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించు.
– కేటీఆర్
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమే ఉంటే మేడిగడ్డను రిపేర్ చేయించి సాగుకు నీళ్లివ్వాలి. మూడు పిల్లర్లు రిపేర్ చేయించే తెలివి సీఎంకు లేదు. తప్పు జరిగితే శిక్షించాలి. చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయింది. వరంగల్‌లో గుండ్ల వాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం, ధవళేశ్వరం ప్రాజెక్టుల్లోనూ సమస్యలు వచ్చాయి.
– కేటీఆర్
కేటీఆర్ రేవంత్.. ఈ హామీలెక్కడ