హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించరని, అధికారమే పరమావధిగా రైతు భరోసా పేరుతో హామీలిచ్చి రైతులను, కౌలు రైతులను వెన్నుపోటు పొడుస్తున్న రేవంత్రెడ్డి సర్కార్కు గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని నిసిగ్గుగా చెప్పిన కాంగ్రెస్ సర్కారుకు పుట్టగతులుండవని మండిపడ్డారు. రైతు భరోసా విషయంలో రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొనటాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మొన్న రుణమాఫీ పేరిట మోసం, నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా? కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? 420 హామీల్లో సీఎం ఒకో వాగ్దానాన్ని పాతరేస్తున్నారు’ అంటూ దుయ్యబట్టారు.
చేతకానప్పుడు హామీలివ్వడమెందుకు ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నయవంచనకు పరాకాష్ట అని విమర్శించారు. అధికారం కోసం నోటికొచ్చిన వాగ్దానాలు చేసి గద్దెనెకాక గొంతుకోసిన వారిని రైతులు అస్సలు వదిలిపెట్టరని, ఈ వెన్నుపోటుకు సీఎం మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.