హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో దాదాపు అన్నీ అమలు చేశామని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భగ్గుమన్నారు. భట్టి విక్రమారకు, ఆయన సహచర మంత్రులకు దమ్ముంటే ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పాలని, ఆ గ్రామం నుంచి వీళ్లను ప్రజలు తరిమి కొట్టకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ మోసాన్ని, ప్రాపగండాను చూసి ఆ పార్టీ నేతలను గ్రామాల నుంచి ప్రజలు తన్నితరిమేస్తున్నారని తెలిపారు. ‘ఎన్నికల ముందు భట్టి విక్రమార లాంటి కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీ కార్డులను దాచుకోండి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తామంటూ ప్రజలను మభ్యపెట్టిన విషయాన్ని కేటీఆర్ బుధవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. ఇప్పుడు వంద రోజులు కాదు, రెండేండ్లు కావస్తున్నా ఒక హామీని కూడా అమలు చేయని ప్రభుత్వం, దాదాపు అన్నీ చేశామని చెప్పడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం, ప్రాపగండాను చూసి ప్రజలు అసలు నిజం అర్థం చేసుకున్నారని, అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తరిమేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెప్తున్న అబద్ధాలకు, ప్రాపగండాకు ప్రతి గ్రామంలో ప్రజలే సమాధానం చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు.
ఎకో పార్క్ ఎప్పుడు ప్రారంభిస్తారు?
రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల సేవ కంటే రాజకీయాలు, ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. కొత్వాల్‌గూడ ఎకో పార్ ప్రారంభం ఆలస్యం కావడంపై బుధవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 13 నెలల క్రితమే పార్క్ ప్రారంభోత్సవం ఆలస్యం కావడాన్ని గుర్తించిన తాను ప్రభుత్వానికి పలు సూచనలు చేసినట్టు గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రెండేండ్ల క్రితమే మెజార్టీ భాగం పనులను పూర్తిచేసిందని తెలిపారు. అయినా నేటికీ పార్ ప్రారంభం కాలేదని విమర్శించారు. హైదరాబాదీల కోసం నిర్మించిన అంతర్జాతీయ స్థాయి పార్ ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా ప్రారంభానికి నోచుకోకుండా పోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అసమర్థత, నిర్లక్ష్యం ప్రధాన లక్షణాలుగా మారాయని ధ్వజమెత్తారు. ప్రజల సౌకర్యాలు, అభివృద్ధి పనులు పకనపెట్టి ప్రచార యాత్రలకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచే ఈ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అనాసక్తి కారణంగా నిలిచిపోయిందని తెలిపారు. ఇది నిస్సహాయ ప్రభుత్వం, నిస్సహాయ పాలన అంటూ కేటీఆర్ ఫైరయ్యారు.