KTR | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ముంచుకొస్తున్న ముప్పు గురించి ముందే హెచ్చరించినా.. కాంగ్రెస్ సర్కారు తలకెకలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్నా.. విషం తప్ప విషయం లేని ముఖ్యమంత్రి వినిపించుకోలేదని మండిపడ్డారు. కండ్ల ముందే పచ్చని పంటలు ఎండుతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు.
ఓవైపు రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక అన్నదాత అల్లాడుతున్న సమయంలో గోరుచుట్టుపై రోకలిపోటులా పంటలు ఎండటంతో అన్నదాతల బతుకు ఆగమైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు కాబట్టి రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదేనని స్పష్టంచేశారు. ఎండిన ప్రతి ఎకరానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వెంటనే రూ.25 వేల నష్ట పరిహారం ప్రకటించాలని మంగళవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే రైతులతో కలిసి కాంగ్రెస్ సరారు భరతం పడతామని హెచ్చరించారు.
హైడ్రా పేరుతో వసూళ్ల దందాకు తెరలేపి మూసీ పేరుతో పేదల ఇండ్లపై సర్కారు పగబట్టిందని కేటీఆర్ విమర్శించారు. ఫార్మాసిటీ పేరుతో భూములు చెరబడుతూ, ఫోర్త్‌సిటీ పేరుతో సీఎం కుటుంబం రియల్ వ్యాపారం చేస్తున్నదని మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూములను ఆక్రమిస్తూ, పేదలపై ప్రతాపం చూపి పెద్దలతో ఒప్పందం చేసుకుంటున్నారని విమర్శించారు. నాడు మద్యం వద్దనోళ్లే నేడు మద్యం ముద్దంటున్నారని, ధరల సవరణ పేరుతో కొత్త బ్రాండ్లతో అక్రమ ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. ‘రైతుభరోసా రాదు. రుణమాఫీ కాదు. పంటలు కొనుగోలు చేయరు. ధాన్యానికి బోనస్ బోగస్. తులం బంగారం ఇయ్యరు. ఉద్యోగాలు వేయరు. ఉద్యోగులకు పీఆర్సీ రాదు. డీఏలు ఇవ్వరు. సత్యం వధ ధర్మం చెర. పదేండ్ల్లే కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెలల కాంగ్రెస్ పాలనలో అథః పాతాళానికి తీసుకెళ్లారు. ఆర్థికశక్తిగా ఎదిగిన తెలంగాణను ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారు. ఇది పాలన కాదు పీడన. ఇది సరారు కాదు సరస్ కంపెనీ. జాగో తెలంగాణ జాగో’ అని హెచ్చరించారు.
తెలంగాణలో తయారైన ఎయిర్ పాడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి కావడం దేశానికి గర్వకారమని కేటీఆర్ తెలిపారు. నాడు కేసీఆర్ ప్రభుత్వ కార్యకలాపాలు, సులభతర విధానాల కారణంగా ఫాక్స్‌కాన్ కంపెనీ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నదని గుర్తుచేశారు. వచ్చేనెలలో ఆ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో తయారైన ఎయిర్ ప్యాడ్స్ విదేశాలకు ఎగుమతవుతాయని పేర్కొన్నారు. ఇదంతా కేసీఆర్ నాయకత్వ పటిమ, ముందుచూపునకు నిదర్శమని తెలిపారు.