హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిత్యం అరెస్టులపర్వమే కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నివర్గాలపై నిర్బందకాండ కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల దాకా ఎవరికి వారు పోటీపడి పాలనను గాలికి వదిలి ఊరేగుతున్నారని విమర్శించారు.
అన్ని వర్గాలను పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, ఏ అణచివేతలూ ప్రజా ఆకాంక్షలను నిలువరించలేవనే సత్యాన్ని గుర్తించాలని హెచ్చరించారు. మాజీ సర్పంచుల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా ? శాంతియుత నిరసనకు పిలుపునిస్తే మాజీ సర్పంచులను చేస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటే అని ఆయన ప్రశ్నించారు.
బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ చిన్నచిన్న పనులు చేసిన మాజీ సర్పంచులను మాత్రం అరెస్టులు చేస్తారా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సరార్ మాజీ సర్పంచ్‌లను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లలో బంధించడం హేయమైన చర్య అన్నారు. సర్పంచ్‌లకు డబ్బులు లేవు కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాజీ సర్పంచ్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి సర్కార్ శాంతియుత కార్యక్రమానికి పిలుపునిస్తే అరెస్టు చేయటాన్ని ఏమనాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని దాదాపు ఏడాది నుంచి అడుగుతున్నా కాంగ్రెస్ సర్కార్‌కు చేతులు రావటంలేదని విమర్శించారు. కక్షసాధింపు చర్యలను మానుకోవాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేసి పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మాజీ సర్పంచ్‌లను అరెస్టులు చేయటం సరికాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు గడిచినా మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వారిని అరెస్టులు చేయటం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికం అన్నారు.
ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా? అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆయన మండిపడ్డారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లుల కోసం పది నెలలుగా శాంతియుతంగా పోరాడుతున్న మాజీ సర్పంచ్ల అరెస్ట్ దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఖండించారు. వారి సొంత గ్రామాల్లో అర్ధరాత్రి నిర్బంధంగా అదుపులోకి తీసుకోవడం హేయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం ధర్మపోరాటం చేస్తున్న వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.