KTR | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టు మూటల లెకలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలోని తన బాస్‌లతో మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగూరిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం పది నెలల్లోనే 24 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం, రాష్ట్ర ప్రజలకు ఏ మేరకు లబ్ధిచేకూర్చారో? చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డి అత్యధికసార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిం చే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవాచేశారు.
గులాంగిరీ తప్పదని ముందే చెప్పినం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీకి గులాంగిరీ తప్పదని తాము ఎన్నికలకు ముందే చెప్పామని, ఇప్పుడు అదే జరుగుతున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. ఢిల్లీ బాసులకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ముఖ్యమంత్రి జీ హుజూర్ అంటూ హస్తినకు వెళ్తున్నారని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడమేనంటూ నిప్పులు చెరిగారు. మొదట్లో సీఎం ఢిల్లీ పర్యటనలపై విమర్శలు రావటంతో ఇప్పుడు తెలివిగా కేంద్ర పెద్దలను కలిసి రాష్ర్టానికి నిధులు తెచ్చేందుకని నమ్మబలుకుతున్నారని మండిపడ్డారు. ఎంత మంది కేంద్రం పెద్దలను కలిసి రాష్ర్టానికి ఎన్నివేల కోట్లు తెచ్చారో చెప్పాలని, రేవంత్ బడే భాయ్ మోదీని ఒప్పించి ఎన్ని వేల కోట్లు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫోర్ బ్రదర్స్ కోసమే ఫోకస్
రేవంత్‌రెడ్డి తన ఫోర్ బ్రదర్స్ కోసమే ఫోర్త్‌సిటీపై ఫోకస్ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గిపోవటానికి ఫోర్త్‌సిటీ పేరుతో కృత్రిమ బూమ్‌ను సృష్టించడమే కారణమని ఆయన ఎక్స్‌వేదికగా ధ్వజమెత్తారు. హైడ్రా హైరానాతో రెండు నెలల్లోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని, తద్వారా రిజిస్ట్రేషన్లు పడిపోయిన వైనాన్ని ఆయన ఏకరువు పెట్టారు. ఫోర్ బ్రదర్స్ సిటీపైనే ఫోకస్ చేసి, కృతిమ రియల్ బూమ్ కోసం ఆలోచిస్తున్నాడని, సామాన్యుల కొనుగోళ్లు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతది? అని ప్రశ్నించారు. ‘ప్రతి పథకానికి డబ్బుల్లేవని తెల్లారి లేస్తే అరిచే రేవంత్‌రెడ్డి తీరు మింగమెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉన్నది’ అని విమర్శించారు.
సీఎం సీటుకు ఢోకా రావద్దనే..
ప్రజల అవసరాలను పకనబెట్టి చీటికి మాటికి సీఎం ఢిల్లీకి వెళ్తుండటం చూస్తుంటే ప్రజలకు మంచి చేయటం కన్నా ఢిల్లీ బాసులకు జై కొడితే తన సీటుకు ఢోకా ఉండదని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. పది నెలల పాలనలో తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని చెప్పారు. ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్‌రెడ్డి పాలనపై సంతోషంగా లేనందునే పదేపదే పిలుస్తూ ఆయనకు చీవాట్లు పెడుతున్నట్టు ఉందని ఎద్దేవాచేశారు. పది నెలల్లోనే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తే ఏదైళ్లలో మరో 125 సార్లు వెళ్తాడు కావచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజలు అధికారమిచ్చింది ఢిల్లీకి గులాంగిరీ చేసేందుకు కాదని ప్రజలకు మంచి చేసేందుకనే విషయాన్ని సీఎం గుర్తించాలని హితవుపలికారు.
మూసీలో కొల్లగొట్టే వేలకోట్ల
రూపాయల లెక చెప్పేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారు. పేదల గూడు కూల్చేందుకు రాహుల్ గాంధీ, అధిష్ఠానంతో రేవంత్ చర్చలు జరుపుతున్నారు.. ప్రజలకు మంచి చేయటం కన్నాఢిల్లీ బాసులకు జై కొడితే తన సీటుకు ఎలాంటి ఢోకా ఉండదనే చక్కర్లు కొడుతున్నారు. – కేటీఆర్