హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులపై అడ్డగోలు వ్యాఖ్యలు, కక్షసాధింపు చర్యల తీరు సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వార్డు మెంబర్ కూడా కాని రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు.. పోలీసులు ఎసార్ట్ ఇవ్వొచ్చు..తిరుపతిరెడ్డి కల్యాణలక్ష్మి చెకులు పంచొచ్చు.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయొచ్చు.. పాఠశాల విద్యార్థులను ఎర్రటి ఎండలో నిలబెట్టి వారితో పూలుచల్లించి స్వాగతం పలకొచ్చు.. వారితో అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించవచ్చు. ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్‌ను వెనకు నెట్టి వేదికను పంచుకోవచ్చు. పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార సతీమణికి ఎసార్ట్ సదుపాయం కల్పించవచ్చు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 14 ఏండ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా? కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్‌నగర్ పాఠశాల హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేస్తారా? కేసీఆర్ పుట్టిన రోజున హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు కడితే చింపివేస్తరా?’ అని మంగళవారం ఎక్స్‌వేదికగా నిప్పులు చెరిగారు.‘సీఎం రేవంత్‌రెడ్డికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే గౌరవం లేదు. సహచర మంత్రుల మీద నమ్మకం లేదు. అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా? సిగ్గు సిగ్గు’ అని ఫైరయ్యారు.
వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి18: మాజీఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహించడంతో పాటు, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించారంటూ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్వహించిన వేడుకలకు బందోబస్తు నిర్వహించిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
దేవరుప్పుల, ఫిబ్రవరి 18 : ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారంటూ జనగామ జిల్లా దేవరుప్పుల కాంగ్రెస్ నాయకులు మంగళవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యకర్తలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.