KTR | దేశంలో వలస కార్మికులకు ఉపాధి కల్పించే ప్రధాన వ్యవసాయ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరువుతో,ఉపాధి లేక తెలంగాణ నుంచి ప్రజలు వలస వెళ్లారని.. కానీ అదే తెలంగాణ ఈరోజు దేశం నలుమూలల నుంచి వచ్చే వలసలను ఆదుకుంటున్నదని అన్నారు. ఈ మార్పు యాదృచ్ఛికం కాదు.. ఇది కేసీఆర్ వ్యవసాయ విప్లవమని కొనియాడారు.
నీళ్లు లేక పొలాలు ఎండిపోయిన రోజుల్లో వ్యవసాయం అంటే నష్టం అనే భావన ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ కేసీఆర్ నీళ్లే జీవనాడి అని గుర్తించి కాళేశ్వరం వంటి చారిత్రక ప్రాజెక్టులతో రైతు పొలానికి శాశ్వత భరోసా ఇచ్చారని తెలిపారు. నీళ్లు వచ్చాయి.. పంట వచ్చిందన్నారు. ఒక పంట కాదు – రెండు, మూడు పంటల సాగు జరుగుతుందని. సాగు విస్తరించిందని.. భూమి పని కోరింది. పంట పెరిగితే పని వచ్చిందని తెలిపారు. పని పెరిగితే వ్యవసాయ కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి లభించిందని తెలిపారు. అందుకే ఈరోజు తెలంగాణ బిహార్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు ఉపాధి కల్పించే దేశంలోని ప్రధాన వ్యవసాయ కేంద్రంగా మారిందని వివరించారు.
రైతుబంధు ద్వారా రైతుకు ముందే పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. అదే పెట్టుబడి సాగును పెంచిందని అన్నారు. సాగు పెరిగితే రైతు నిలబడ్డాడు.. రైతు నిలబడితే కార్మికుడు బతికాడు.. గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడిందని అన్నారు. రైతుకు భరోసా ఇచ్చిన నాయకుడే, కార్మికుడికి ఉపాధి ఇచ్చిన నాయకుడు.. అతనే కేసీఆర్ అని అన్నారు. ఇది పార్టీ మాట కాదు.. ఇది పత్రికలు రాస్తున్న నిజమని స్పష్టం చేశారు. పొలాల్లో పండుతున్న పంటలు.. పనిలో ఉన్న వలస కార్మికులే సాక్ష్యమని అన్నారు. వ్యవసాయం నిలబడితేనే గ్రామం నిలబడుతుందని, గ్రామం నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుందని కేసీఆర్ మాటలతో కాదు భూమి మీద ఫలితాలతో నిరూపించారని అన్నారు.