కాంగ్రెస్ను అడ్డుకోకపోతే అ పార్టీ మరింత రెచ్చిపోయి ప్రజలను పీడిస్తుంది. ఇప్పటికే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో ఆ పార్టీ మసకబారింది. సిరిసిల్లలో కేటీఆర్ గెలిచిండని నా మీద కోపంతో జిల్లాను రద్దు చేస్తానని అంటున్నది. కాంగ్రెస్కు ఓటేస్తే కొత్త జిల్లాల ఉనికికే ప్రమాదం.
-కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ : కాంగ్రెస్ పాలన ఉన్నన్నాళ్లూ ప్రజలకు కన్నీళ్లు తప్పవని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రెండేండ్లలో రేవంత్ సర్కార్ రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు. బీజేపీ కూడా చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రెండూ ఢిల్లీ పార్టీలేనని, తెలంగాణకు ఏమీ చేయవని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే ఈ రెండు పార్టీల నాయకులకు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. ‘మీరు వేసే ఓటుతో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలి’ అని ఆకాంక్షించారు. ‘పదేండ్లలో చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందు ఉన్నది.. ఢిల్లీ పార్టీలకు ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు’ అని కోరారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శుక్రవారం ఆయన వేములవాడ, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. సోనియా గాంధీ మీద ఒట్టేసి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ఇస్తామని రేవంత్ చెప్పి 26 నెలలవుతున్నా అమలు కావడం లేదని విమర్శించారు. ‘ఇప్పటికి 800 రోజులైనా పింఛన్లు పెంచి ఇయ్యలే, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, యువతకు స్కూటీలు, మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మీ, తులం బంగారం, ఇవ్వలే’ అని తూర్పారబట్టారు.
ఇస్తామన్న ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒకదాన్నైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ‘ఇన్ని మోసాల తర్వాత కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలకు మేం చేస్తున్నదే సరైందని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. హామీల అమలుపై భవిష్యత్తులో దృష్టి పెట్టే అవకాశమే ఉండదు’ అని హెచ్చరించారు. అందుకే ఇంటికి వచ్చే ఆ పార్టీ నాయకులను ముందుగా 26 నెలలుగా బాకీపడిన పెన్షన్ లక్ష రూపాయలు, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 బాకీ రూ.65 వేలు. కల్యాణలక్ష్మీ చెకుతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధిచెప్పినప్పుడే తాము చేస్తున్న మోసాలపై ప్రజలు కోపంగా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు తెలుసుకుంటారని చెప్పారు.
కేసీఆర్ చిన్నతనంలో దుబ్బాకలో చేనేత కార్మికుడి ఇంట్లో ఉండి చదువుకున్నడు. ఆసమయంలో ఆడబిడ్డలు బీడీలు చేసి అనారోగ్యం బారిన పడడాన్ని చూసి చలించిపోయిండు. తెలంగాణ ఉద్యమంలో నేతన్నలు, బీడీ కార్మికుల దయనీయ పరిస్థితి చూసిండు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నేతన్నలు, బీడీ కార్మికులను ఆదుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రి కాగానే బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చి ఆదుకున్నడు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న రేవంత్రెడ్డి మోసం చేసిండు.
-కేటీఆర్

ఊపిరితిత్తులు పాడవుతున్నా లెక్క చేయకుండా కుటుంబం కోసం బీడీలు చుడుతున్న మహిళలకు కేసీఆర్ అడుగకుండానే రెండు వేల రూపాయల పెన్షన్ అందించాడని, రాష్ట్రంలోని నాలుగున్నర లక్షల మందికి అమలు చేశాడని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకొని చూసిన నాయకుడు కేసీఆరేనని అభివర్ణించారు. రాష్ట్రంలో 70లక్షల మంది రైతులకు 11సార్లు 73వేల కోట్ల రూపాయల రైతుబంధు వేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
అభివృద్ధి చేయక దేవుడి పేర్లు చెప్పి బీజేపీ ఓట్లడుగుతున్నది. బీజేపీకి ఓటు వేయడమంటే మీ ఓటును మోరీలో వేసుకున్నట్టే. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధిచెప్పాలి. జిల్లా ఉండాలన్నా.. రేవంత్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావాలన్నా.. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.
-కేటీఆర్
దేశాన్ని ఏలుతున్నామని చెప్పే బీజేపీ నాయకులు వేములవాడ రాజన్న ఆలయానికి గానీ, వేములవాడ పట్టణానికి గానీ రూపాయి అయినా తెచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చేసిందేమీ లేదని, తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఎలాంటి లబ్ధి చేయలేదని మండిపడ్డారు. దేశంలోని ప్రతి నిరుపేద ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని మోసం చేయడమే కాకుండా, దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుకునే దికుమాలిన పార్టీ బీజేపీ అని నిప్పులు చెరిగారు. ఈ సారి కూడా బీజేపీ దొంగ మాటలకు మోసపోవద్దని సూచించారు. కేవలం పేదోళ్ల కడుపులు నింపి తండ్రి లెక చూసుకొని తెలంగాణ తెచ్చిన వారెవరో గుర్తుంచుకొని బీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
‘సిరిసిల్ల నేతన్నలను బతుకమ్మ చీరలు ఇచ్చి, చేతినిండా పని కల్పించి అత్మగౌరవంతో బతికేలా చేసిన కేసీఆర్ను ఆశీర్వదించాలి. మీరు వేసే ఒక్కొక్క ఓటు కేసీఆర్ను మళ్లా సీఎంను చేస్తుంది’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పదేండ్లు ఆత్మగౌరవంతో బతికిన సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరలు బంద్ చేసి వాళ్ల ఉపాధిపై దెబ్బకొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మాకు ఓటెయ్యకుంటే పనులు ఇయ్యమని కాంగ్రెస్సోళ్లు బెదిరింపులకు దిగుతున్నరు. మీకు నేనున్నా.. వారి బెదిరింపులకు భయపడొద్దు’ అని ధైర్యం చెప్పారు. ‘అవసరమయితే సీఎంతో కొట్లాడి అయినా మన పని మనకు తెస్తా’ అని భరోసానిచ్చారు.
‘ఒక్కసారి మోసపోతే మోసం చేసినోనిది తప్పయితది. రెండో సారి కూడా మోసపోతే ఓట్లేసిన మనది తప్పవుతది. ఈ ఎన్నికల్లో రెండో సారి బలికావద్దు’ అని కేటీఆర్ హెచ్చరించారు. రెండేండ్లలో చారాణా పని చేయనోళ్లు మళ్లీ ఓట్లు వేయాలని వస్తున్నారని, అలాంటోళ్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 12 ఏండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభు త్వం 15 లక్షలు ఇస్తా అన్నాడు కానీ కనీసం 15 పైస లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. మళ్లీ సిగ్గులేకుం డా ఓట్లు అడుగుతున్నారని మండి పడ్డారు. కుల, మ త భేదాలు లేకుండా ఓట్లు వేయాలని సూచించారు.
ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చినదానికి డబుల్ ఇస్తామని మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్రెడ్డి గద్దెనెక్కారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పుడు హామీలపై ఎవరన్నా అడిగితే రేవంత్ రెడ్డి.. ‘లాగుల తొండలు సొర్రగొడుతా’, ‘కండ్లు పీకుతా’ అంటూ బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ‘ఉచిత బస్సు మాత్రం ఇచ్చామని చెప్తారు. దాని వల్ల ఏం లాభం ఉన్నది? మీకు ఉచితంగా ఇచ్చి మగవాళ్లకు డబుల్ చార్జీలు వసూలు చేస్తుండ్రు. ఉచిత బస్సు ఏమో గానీ, ఆడబిడ్డలు అవసరం ఉండి చెయ్యెత్తి ఆపితే బస్సు ఆగే పరిస్థితి లేకుండా పోయింది’ అని వాపోయారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలపై ఇప్పుడు నిలదీయాలని, లేదంటే మరో మూడేండ్ల దాకా దొరకరని చెప్పారు.
‘మున్సిపల్ ఎన్నికలు కాగానే రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్రెడ్డి అంటున్నడు. మరి ఇప్పుడు వేస్తే ఎవరు అడ్డుకుంటున్నరు’ అని ప్రశ్నించారు. రైతు బంధు రెండు సార్లు, పింఛన్లు రెండు నెలలు ఎగ్గొట్టారని, ఎన్నికలు ఉన్నాయని మాయమాటలు చెప్తున్నారని మండిపడ్డారు. ‘ఓట్లకోసం వచ్చి రూ.వెయ్యి, రూ.2 వేలు ఇస్తరు.. అవి తీసుకొని మీకు బాకీ పడ్డ డబ్బులు ఎవరిస్తారని నిలదీయాలి’ అని సూచించారు.
ఆయాచోట్ల ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జులు తుల ఉమ, గూడూరు ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.