హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ 15 నెలల పాలనలో అనేక రంగాలు ధ్వంసమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటున్నారని ఎద్దేవాచేశారు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరితో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్ల కూలుస్తున్నారని, హైడ్రా, మూసీ చర్యల కారణంగా రిజిస్ట్రేషన్లు పడిపోయారని, ఆదాయం లేక ఖజానా ఖాళీ అయిందని మండిపడ్డారు. ఏడాది పాలనలో లక్షన్నర కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని, 420 హామీలు మాత్రం అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిర్వాకం మూలంగా రియల్టర్లు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సరారు గారడీలో సామాన్యులే సమిధలవుతున్నారని, జాగో తెలంగాణ జాగో అని శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఐటీ చట్టం వల్ల పౌరుల డిజిటల్ గోప్యతకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాలను పరిశీలించేందుకు ఐటీ అధికారులకు అనుమతివ్వటం పౌరుల గోప్యతకు భంగకరమని పేర్కొన్నారు. ఇది అధికార దుర్వినియోగం కింది దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. పౌరుల ఆర్థిక సమాచారం ఇప్పటికే అనేక వేదికల్ల్లో నిక్షిప్తమై ఉన్నదని, ఐటీ అధికారుల అక్రమ చొరబాటుకు అవకాశం కల్పించటం పౌరుల ప్రాథమిక హక్కులకు, డిజిటల్ గోప్యతకు భంగం కలిగించడమేనని విమర్శించారు. ‘ఏదైనా దుర్వినియోగం జరిగితే ఎవరు జవాబుదారీగా నిలబడతారు? ప్రధాన మంత్రా? లేక కేంద్ర ఆర్థికమంత్రా?’ అని నిలదీశారు.
తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్తున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘కేన్స్ గుజరాత్‌కు వెళ్లింది. కార్నింగ్ తమిళనాడుకు వెళ్లింది. ఇప్పుడు సోలార్ ఉత్పత్తి చేసే కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ ఏపీకి వెళ్లిపోతున్నది. మల్టీ నేషనల్ కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలుతున్నాయి’ అని వాపోయారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులను కూడా కాంగ్రెస్ పాలకులు పట్టుకోలేకపోతున్నరు. ఏం దురదృష్టం రాహుల్ గాంధీజీ’ అని ఎక్స్‌వేదికగా ఎద్దేవా చేశారు.
‘కొన్ని కథలు చాలా ప్రత్యేకంగా ఉంటా యి. కిటెక్స్ కంపెనీని తెలంగాణకు తెచ్చాం. రూ.3,000 కోట్ల కంటే ఎకువ పెట్టుబడులు పెట్టించాం. మా ప్రభుత్వంలో జరిగిన ప్రయత్నాలపై బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ కథనాన్ని ఇచ్చిన బిజినెస్ స్టాండర్డ్‌కు ధన్యవాదాలు’ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
నల్లగొండలో రూ.1.66 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రం నిరుపయోగంగా ఉన్నదని, దాన్ని తిరిగి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆ జిల్లా కలెక్టర్‌ను కేటీఆర్ కోరారు. జిల్లా ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని 2023 అక్టోబర్‌లోనే ప్రారంభించినట్టు తెలిపారు. ఓ నెటిజన్ ఈ సమస్యపై ట్వీట్చేయగా, కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
శ్రీ‘విద్య’కు కేటీఆర్ భరోసా
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన భరోసాతో చిన్నారి శ్రీవిద్య మళ్లీ సూలు గడప తొకింది. ఆమె కలలకు కేటీఆర్ రెకలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది. సరైన పత్రాలు లేవని హైదరాబాద్ సనత్‌నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన మల్లెల శ్రీవిద్య అడ్మిషన్‌ను ప్రైవేట్ సూల్ యాజమాన్యం రద్దు చేసింది. బాగా చదువుకోవాలని ఆశపడ్డ శ్రీవిద్యకు ఆధార్‌కార్డు రూపంలో ఎదురైన సమస్య గురించి పత్రికలో వచ్చిన వార్తపై కేటీఆర్ స్పందించారు. తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్ ఇప్పించడంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
శ్రీవిద్య తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్.. ఆమె చదువు ఆగిపోవద్దనే ఉద్దేశంతో రెండేండ్ల సూల్ ఫీజును చెల్లించారు. భవిష్యత్తులో శ్రీవిద్య చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ చొరవతో సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి అవసరమైన సర్టిఫికెట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్య గురించి తెలుసుకుని శ్రీవిద్య జీవితానికి కొత్త వెలుగు అందించిన కేటీఆర్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.