హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు (Saudi Bus Accident) ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. అలాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సర్కారు అండగా నిలవాలన్నారు.