KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. గత ఐదారు సంవత్సరాలుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి తెలిపారు. డ్రగ్స్ కేసు, హీరోయిన్లతో సంబంధాలు అంటూ అనేక అంశాల్లో ఇరికించాలని చూశారని పేర్కొన్నారు. నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా మానసిక క్షోభకు గురిచేశారని చెప్పారు.
గత 20 ఏళ్లుగా నా రాష్ట్రం కోసం పని చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు చేసిన కుట్రలను అన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాపై కుట్రలు చేయడం కొత్త కాదని అన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత ఈ ప్రాంతం కోసం ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా నిబద్ధతతో పని చేశామన్నారు. టైమ్ పాస్ రాజకీయాలు చేయలేదని తెలిపారు. ప్రత్యర్థులను, ప్రతిపక్ష నేతలను, వారి కుటుంబాలను ఏనాడు రాజకీయాల్లోకి లాగలేదు, అక్రమ కేసులు పెట్టి వేధించలేదని స్పష్టం చేశారు. కానీ గత ఐదారు సంవత్సరాలుగా నాపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో హీరోయిన్లతో సంబంధాలు అంటూ నన్ను అనేక అంశాల్లో ఇరికించాలని చూశారన్నారు.
నన్నే కాకుండా, నా కుటుంబాన్ని, నా పిల్లలను కూడా మానసిక క్షోభకు గురిచేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నేను ఎవరికీ భయపడలేదని తెలిపారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ ఎవరి కుట్రలకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు, నేను వెళ్తాను, నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నానని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ఒక డైలీ సీరియల్ మాదిరి లీకులు ఇస్తూ నా వ్యక్తిత్వ హననం చేస్తున్న వాటికి ఒక్క సాక్ష్యం అయినా ఉన్నదా? కేవలం మీడియా లీకులే తప్పించి ఒక్క అధికారిక సాక్ష్యం లేకుండా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అని అడుగుతానని తెలిపారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని ఒక్క పోలీసు అధికారి అయినా చెబుతారా అని అడుగుతానని అన్నారు. రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? సజ్జనార్ ముందుకు వస్తాడా? ఇంటెలిజెన్స్ ఐజీ ముందుకు వస్తాడా? అని అడుగుతానని చెప్పారు.
కేవలం బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టిన సింగరేణి బొగ్గు స్కామ్ నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ డ్రామాను రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు.. ఆయన బామ్మర్ది కేంద్రంగా వేల కోట్ల రూపాయల బొగ్గు గనుల స్కామ్ జరిగిందని తెలిపారు. దీనిపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదన్నారు. ఎవరికీ భయపడకుండా తలవంచకుండా నికార్సైన తెలంగాణ బిడ్డలుగా కొట్లాడుతామని తెలిపారు. కేసీఆర్ సైనికులుగా కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేసే దాకా కలిసికట్టుగా పని చేస్తామని స్పష్టం చేశారు. సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై, రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటామన్నారు. అటెన్షన్ డైవర్షన్ గేమ్ లు ఆడినా.. అర్జునుడి కన్ను మాదిరి రేవంత్ రెడ్డి అవినీతిపై, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు పైనే మా పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.