హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట సమత కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ ను కలవడానికి యువత భారీగా తరలివచ్చింది. ఇంటింటికి బాకీ కార్డులు పంచిన కేటీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
‘కేసీఆర్ ప్రభుత్వంలో పారిశుధ్య పనులు రోజూ జరిగేవి అయితే ఇప్పుడు చెత్త తీసేవారే కరువయ్యారు. మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి, ఇన్వర్టర్లు కొనుక్కుంటున్నాం’ అని పలువురు మహిళలు, పెద్దలు కేటీఆర్‌తో తమ ఆవేదన పంచుకున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘మాకు కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పనితీరు మీద పూర్తి నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్లోనే కాదు, రాబోయే ఎన్నికల్లోనూ మీరే విజయం సాధిస్తారు’ అని పెద్దలు కేటీఆర్‌ను ఆశీర్వదించారు. పలువురు ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అద్భుత అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు. ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కులమతాలకు అతీతంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు, కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో అసలు అభివృద్ధే జరగడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాసం రాస్తే, తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు వంద కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాశారని చెప్పారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులే అన్న కేటీఆర్, ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయబ్ అవుతారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే అని స్పష్టం చేశారు. ‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సిఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
Live: Congress Dues Cards Distribution Program 📍Shaikpet, Jubilee Hills Constituency@KTRBRS https://t.co/ZRXPlUjiuN
— BRS Party (@BRSparty) September 28, 2025