KTR | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): ఫార్ములా-ఈ రేస్‌లో అక్రమాలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని, అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై తప్పుడు కేసు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 360 రోజులు అధికారం వెలగబెట్టి ఆరు గ్యారెంటీల్లో కనీసం అర గ్యారెంటీని కూడా అమలు చేయని ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని ఎద్దేవాచేశారు. ‘అవినీతి జరిగిందంటూ ఏసీబీని ఉసిగొల్పుతున్నరు..ఈడీని తెచ్చి భయపెట్టాలని చూస్తున్నరు..బడే భాయ్..చోటే భాయ్ ఏకమై కక్ష సాధిస్తున్నరు. ఎంతగా భయపెట్టాలని చూసినా బెదిరేదిలేదు.. తప్పుడు కేసులకు భయపడేది లేదు..న్యాయం కోసం కోర్టుల్లోనే కొట్లాడుతాం’ అని తేల్చిచెప్పారు.
అక్రమాలకు పాల్పడ్డానని తనపై కేసులు బనాయించిన ప్రభుత్వం, మరి ఫార్ములా ఈ కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. ఫార్ములా ఈ-రేస్‌లో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్నారని గుర్తుచేశారు. ఇదే విషయమై ముఖ్యమంత్రిని అసెంబ్లీ లాబీలో మీడియా ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. విలేకరులు అడిగిన ప్రతిప్రశ్నకు సావధానంగా సమాధానాలు ఇచ్చారు.
ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే ఫార్ములా ఈ సంస్థకు నగదు చెల్లించామని కేటీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని సదరు సంస్థ కూడా ఒప్పుకొన్నదని గుర్తుచేశారు. ఇందులో ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని స్పష్టంచేశారు. కానీ, ఇందులో ఏదో మతలబు ఉన్నది.. క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? అంటూ ముఖ్య మంత్రి మాట్లాడటం విడ్డూరమని చెప్పారు. మరీ అదానీకి సంబంధించి రూ.100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇచ్చినప్పుడు, ఫార్ములా ఈ-రేస్‌ను రద్దు చేసినప్పుడు క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. రేస్‌ను రద్దుచేసిన ప్రభుత్వం, సంబంధిత సంస్థతో కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేసుకోలేదో చెప్పాలని నిలదీశారు. అవినీతి జరిగిందని ఏసీబీతో విచారణ చేయిస్తున్న ముఖ్యమంత్రి, అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు.
ఫార్ములా ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసినందునే తనకు ఈడీ నోటీసులు పంపిందని కేటీఆర్ చెప్పారు. తాను ఈ కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. ఒకవేళ కోర్టు కేసు కొట్టేస్తే ఈడీ కూడా విచారించేదేమీ ఉండదని స్పష్టం చేశారు. అయినా రేవంత్ సర్కారు ఆధారాలు చూపకుండా అనుమానాలపై కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. ఏదేమైనా ఈ విషయంపై స్పష్టత రావాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందేనని చెప్పారు. గతంలో అమృత్ కుంభకోణంలో చర్యలు తీసుకోవాలని ఆధారాలతో ఫిర్యాదు చేసినా స్పందించని ఈడీ, ఇప్పుడు దూకుడు ప్రదర్శించడంలోని ఔచిత్యమేమిటో అర్థం కావడంలేదని, పొంగులేటి ఇంటిపై దాడులు చేసి నాలుగునెలలు కావస్తున్నా కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగిన గురుకులాల గౌరవం, ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎందుకు పడిపోయింది? ఉద్దేశపూర్వకంగానే గురుకులాలలను పక్కనబెట్టే ప్రయత్నం చేస్తున్నదా? మండలానికి ఒక్క స్కూల్‌ను పరిమితం చేసేందుకు కుట్రలు చేస్తున్నదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే గురుకుల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నదని విమర్శించారు. ఏడాదిలో 50 మందికిపైగా పిల్లలు మరణించినా పట్టించుకోవడం లేదెందుకని సోమవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంటూ కామన్ డైట్‌పై హడావుడి చేసిన సీఎం, మంత్రులు ఇప్పుడు అమలుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
పసలేని కేసులు.. పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ ఏడాది పాలన సాగింది. మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. మోసాలతోనే ఏడాది ముగించింది. కొత్త సంవత్సరంలోనూ రైతు భరోసా ఎగ్గొట్టేందుకు, ఆరు గ్యారెంటీలను అటకెక్కించేందుకు కుట్రలు చేస్తున్నది.
-కేటీఆర్
ఔటర్ రింగ్‌రోడ్డు లీజు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని సీఎం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. ‘అవినీతి జరిగింది.. విచారణ చేపట్టి నిగ్గుతేలుసం అని నిక్కచ్చిగా చెప్తున్న ఆయన, మరి లీజును ఎందుకు రద్దు చేయడం లేదు? అంటే ఇందులో అనుమానాలు తప్ప అవినీతి లేదనే విషయం ఆయన మాటల్లోనే స్పష్టమవుతున్నది’ అని వ్యాఖ్యానించారు. ‘రేవంత్‌రెడ్డి ఏడాది నుంచి నాపై కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నరు.. ఆయన ఉడత బెదిరింపులు.. పిచ్చి ప్రేలాపలనలకు భయపడబోం.. కాంగ్రెస్ సర్కార్ దురాగతాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటం’అని తేల్చిచెప్పారు. సీఎం చెప్తున్న తప్పుడు మాటలను కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం మెప్పు కోసం పాకులాడుతున్నారని ఆక్షేపించారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెచ్చిన అప్పులపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తప్పుడు లెక్కలు చెప్పారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.7 లక్షల కోట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూ 7.40 లక్షల కోట్లు అని రేవంత్‌రెడ్డి, రూ.8 లక్షల కోట్లు అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలా ఒక్కొక్కరు తలాతోకా లేకుండా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కానీ అంకెలు, లెక్కలతో హరీశ్‌రావు వారి అబద్ధాలను ఎండగట్టారని గుర్తుచేశారు. కేవలం ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రుణాలు తీసుకున్న విషయాన్ని తేల్చివేశారని చెప్పారు. కాంగ్రెస్ ఏడాదిలో 1.39 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఉద్ధరించిందేమిటో అర్థంకావ డంలేదని, కనీసం ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా కట్టలేదని, ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీని కూడా సరిగ్గా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ‘ఢిల్లీకి మూటలు పంపిందో.. దిగమింగిందో తెలియడంలేదు’ అని ఎద్దేవాచేశారు.
బీఆర్ఎస్ నిరుడు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నదని కేటీఆర్ చెప్పారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరాజయం మూటగట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సఫలమయ్యామని చెప్పారు. తమ పార్టీపై ప్రజలకు, క్యాడర్‌కు నమ్మకం పెరిగిందని, అందుకే నిత్యం వందలాది మంది బాధితులు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని తెలిపారు. క్యాడర్‌లోనూ ఆత్మైస్థెర్యాన్ని పెంచగలిగామని స్పష్టం చేశారు. ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నదని పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-రేస్‌ను రద్దుచేయడం ద్వారా 600 కోట్లను కాపాడానని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తప్పులు చెప్పారు. అదే నిజమైతే నిరుడు డిసెంబర్ 13న కంపెనీ ప్రతినిధులతో కలిసిన ఫొటోలను ఎందుకు బయటపెట్టలేదు? ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులు ఫొటోలను బయటపెడితే ఎందుకు గగ్గోలు పెడుతున్నరు? ఫొటో ఎలా బయటకు పోయిందంటూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నరు?
-కేటీఆర్
నిరుడు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీస్కెళ్లినట్టే వచ్చే ఏడాదిలో కూడా ఇదే పంథాలో ముందుకెళ్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృషి ్టపెడతామని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసి 25 ఏండ్లవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటామని వివరించారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటూనే నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుంటామని స్పష్టంచేశారు. వచ్చే స్థానిక ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని పునరుద్ఘాటించారు.
ఉర్సు సందర్భంగా అజ్మీర్ దర్గాకు కేటీఆర్ చాదర్ సమర్పించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ హోమంత్రి మహమూద్‌అలీ ఆధ్వర్యంలో మతపెద్దల సమక్షంలో ప్రార్థనలు చేశారు. అనంతరం వారికి చాదర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏటా అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించడం ఆనందంగా ఉన్నదని తెలిపారు.
కాంగ్రెస్ గతేడాది ప్రజలను మోసం చేసినట్టుగానే కొత్త ఏడాదిలోనూ అదే తరహా పాలనను ప్రారంభించబోతున్నదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పటికే రుణమాఫీలో విఫలమైన సర్కారు, రైతు భరోసాకు పరిమితులు పెట్టి అన్నదాతలను నట్టేట ముంచేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. అందుకే సబ్ కమిటీలు వేస్తూ రైతుభరోసాకు కొర్రీలు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న కోటాను ఎగ్గొట్టేందుకు కుతంత్రాలకు దిగుతున్నదని ఆరోపించారు. వారి నాయకుల చేత కేసులు వేయించి స్థానిక ఎన్నికల్లో కోటా కేటాయించకుండా కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. వచ్చే ఏడాదిని కాంగ్రెస్ ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుందని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం చేసిన పాపాలే ఇప్పుడు ఆ పార్టీకి చుట్టుకోనున్నాయని, పథకాల అమలులో విఫలంకావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నైరాశ్యం అలుముకున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ నిధులు, నీళ్లు, నియామకాలతో పదేండ్లు పాలిస్తే, కాంగ్రెస్ డిస్ట్రక్షన్ (విధ్వంసం), డిస్ట్రాక్షన్ (కప్పిపుచ్చడం), డైవర్షన్ (మళ్లింపు) అనే త్రీడీ ఫార్ములాతో సాగిస్తున్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. హైడ్రా, మూసీ కూల్చివేతలతో తీరని విధ్వంసం సృష్టించి పేద, మధ్య తరగతి బతుకులను చిధ్రం చేసిందని నిప్పులు చెరిగారు. ఢిల్లీ పెద్దలకు డబ్బులు పంపేందుకు మూసీ ప్రాజెక్టును తలకెత్తుకున్నదని విమర్శించారు. గురుకులాల్లో 48 మంది పిల్లలు మరణిస్తే పట్టించుకోని రేవంత్‌రెడ్డి, రాజకీయ లబ్ధి కోసం సినిమా నాటకాన్ని తెరపైకి తెచ్చారని ఫైర్ అయ్యారు. ‘రేవతి కుటుంబానికి ప్రతీక్ ఫౌండేషన్ రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వడం సంతోషకరం.. మరి విషాహారం తిని, ఎలుకలు కరిచి మరణించిన నిరుపేద గురుకుల పిల్లలకు, కాంగ్రెస్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్లకు, బలవన్మరణాలకు పాల్పడ్డ అన్నదాతలకు పరిహారం ఎందుకు ఇవ్వలేదు? నిరుపేద కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?’ అంటూ నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ స్వాగతించిందని కేటీఆర్ చెప్పారు. ఆయనకు ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు లెవనెత్తిన అంశానికి మద్దతిచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని సమర్థించామని గుర్తుచేశారు. అదే తరహాలో తెలంగాణ ముద్దుబిడ్డ, తెలుగు రాష్ర్టాలకు చెందిన తొలి ప్రధానిగా కీర్తినందుకున్న పీవీ నర్సింహారావుకు సముచిత గౌరవం ఇవ్వాలని కోరారు. వెంటనే ఢిల్లీలో ఆయన స్మారక చిహ్నం నెలకొల్పాలని, స్మృతివనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా రేవంత్ సర్కారు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.
ఫార్ములా ఈ-రేస్ కంపెనీకి నగదు చెల్లింపుపై నేను మాటమార్చిన అని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నరు. ఇది దుర్మార్గం. ప్రభుత్వ అనుమతి మేరకే మంత్రిగా నిర్ణయం తీసుకున్న.. మొదటి నుంచీ చెప్తున్న మాటకే నేను కట్టుబడి ఉన్న.
-కేటీఆర్