తిమ్మాపూర్,మార్చి23 : విగ్రహాల ఆవిష్కరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని మహనీయుల విగ్రహాలను సైతం రాజకీయం చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పర్యటనకు వెళ్తున్న మార్గమధ్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు. జేఏసీ నాయకులతో మాట్లాడారు.
ఈ విగ్రహాల ఆవిష్కరణ గురించి తాను అసెంబ్లీలో మాట్లాడుతానని జేఏసీ కన్వీనర్లు నాయకులకు హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక శ్రద్ధతో విగ్రహాలను ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తే నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసి నిలుపుదల చేయించారని, ఇప్పటివరకు ఆవిష్కరణకు నోచుకోకుండా చేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. తమ హయాంలో మహనీయుల విగ్రహాలను ఎన్నో ప్రతిష్టించామని, హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని గుర్తు చేశారు. తిమ్మాపూర్‌లోని విగ్రహాలను సైతం ప్రభుత్వం ఆవిష్కరించడమో.. లేదంటే తామే ఆవిష్కరిస్తామని అన్నారు.