హైదరాబాద్: మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. హైదరాబాద్‌లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఇండ్లు కూల్చుతరోనని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసీరామ్ నగర్లో మూసీ ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారన్నారు. గరీబోళ్లంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నరని, వాళ్ల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. మూసీమే లూఠో.. దిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదమని విమర్శించారు. మీ ఇండ్ల మీదకు బుల్డోజర్ వస్తే కంటె అడ్డుపెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కాదు.. ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేరన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో సగం డబ్బులతో మూసీ ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కడతామంటూ కూల్చుతున్నారని చెప్పారు. పేదల ఇళ్లు కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడపలుక్కున్నారా? అని అడిగారు. పేదలకు కష్టం వస్తే అండగా ఉండేవాడే దేవుడని అన్నారు. రేవంత్ రెడ్డి నీవు మొగోడివైతే నీవు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బ్రోకర్లు విడగెట్టే ప్రయత్నం చేస్తారని, మన హక్కులను లాక్కునే హక్కు ఎవరికీ లేదన్నారు. మీకోసం బీఆర్ఎస్ తరఫున కోర్టులో కొట్లాడుతామని భరోసానిచ్చారు. కేటీఆర్
‘తెలంగాణల పెద్ద పండుగ అంటే దసరా. కానీ హైదరాబాద్‌లో లక్షలాది మంది పేదలకు నిద్రలేకుండా చేసిండ్రు. ఎప్పుడు ఇండ్లు కూలగొడుతరో, ఎప్పుడు తమ ఇంటి మీదికి బుల్డోజర్ పంపుతరో అన్నట్టు భయపడుతున్నరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో పేదలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు.. ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్లు మనమీదికి రాదు. రేవంత్ రెడ్డి అడ్డుమారిగుడ్డిగా ముఖ్యమంత్రి అయి పది నెలలు అయింది. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎవరూ ఓట్లు వేయలే. అందుకే ఇక్కడి ప్రజలపై పగబట్టిండు. పదినెళ్ల ముందట ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తున్నాడని, తాను ముఖ్యమంత్రికాంగనే ముసలవ్వ, ముసలయ్యకు ఇద్దరికీ పెన్షన్ ఇస్తానని చెప్పిండు. కేసీఆర్ రూ.2 ఇస్తున్నడు, నేను రూ.4 వేలు ఇస్తా అన్నడు. అత్తకేమే రూ.4 వేలు, కోడలుంటే రూ.2500 ఇస్తానన్నడు. ఆరు గ్యారంటీలు అన్నడు. మరి ఒక్కరికన్న వచ్చినయా రూ.2500, రూ.4వేలు వచ్చినయా?. ఆడపడుచు పెండ్లికి రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తానడు.. కానీ తులం ఇనుమన్నా వచ్చిందా?. బంగారం రాదు. ఇనుము రాదు. మన్ను కూడా రాదు. ఇట్లా ఎన్ని కథలు చెప్పిండు.
రైతులకు రూ.15 వేలు ఇస్తానన్నడు. ఇచ్చిండా. ఆరు గ్యారంటీలు.. నూరు రోజులు అన్నడు. మూడొందల రోజులైంది. ఒక్కరికన్నా బుడ్డ పైసా అన్న వచ్చిందా. హామీలకు సంబంధి ఒక్క పైసా ఇవ్వలేదు. మూసీని రూ.లక్షా 50 వేల కోట్లతో సుందరీకరించి లండన్ లెక్క చేస్తాడట. ఇక్కడున్న పేదలను అడవిల పడేస్తాడట. మనమంతా చూస్తూ ఊరుకుందామా. ఇక్కడ 38 ఇండ్లకు ఆర్బీ ఎక్స్ అని రంగులు వేసిపోయిండ్రట. పక్కింటికి రంగేసి పోతే నాకేంటని ఊకోవద్దు. ఇండ్ల మీదికి జేసీబీ వచ్చిన, బుల్డోజర్ వచ్చినా కంచె అడ్డం పెట్టండి. 40, 50 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. ఇండ్లు ఎలా కూలగొడుతరని ఆ బుల్డోజర్ డ్రైవర్‌ను అడగండి.
ఇందిరమ్మ రాజ్యం అన్నరు. ఇందిరమ్మ చెప్పిందా.. సోనియమ్మ చెప్పిందా ఇండ్లు కూలగొట్టమని?. ఇందిరమ్మ ఇండ్లు కడతమన్నరు. ఇప్పుడు ఇండ్లు కూలగొతమంటున్నరు. ఇక్కడున్న ఇండ్లను కూలగొట్టి హోటల్ కడుతా, పార్కులు కడతా అంటే ఎవరికోసం?. గవర్నమెంట్లకు రాకముందు నల్లబిల్లులు కడుతా, కరెంటు బిల్లులు కడుతా అన్నడు. ఎప్పుడన్నా చెప్పిండా ఇండ్లు కూలగొడుతా అని. ఇండ్లు కూలగొడుతా అంటే ఓట్లు పడుతుండెనా?. మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడున్నడు. మరీ మీరు గెలిపించిన ఎంపీ ఎక్కడపోయిండు. కిషన్ రెడ్డి ఏడపోయిండు. గరీబోళ్లను లేపేయమని కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడ బలుకున్నారా?. మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు మీతో ఉంటరో ఒక్కసారి అర్ధం చేసుకోండి. ఎవరి నియ్యత్ ఏందో ఆలోచించండి. దేవుని పేరుచెప్పి ఓట్లేయించుకునుడు కాదు.. పేద ప్రజలే దేవుండ్లనుకుంటే వాళ్లకు కష్టం వచ్చినప్పుడు వాళ్లకోసం నిలబడేటోడు నాయకుడు. అంతేతప్ప దేవుని పేరుచెప్పుకుని ఓట్లేయించుకుని పదవులళ్ల కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుని తిరిగోటోడు నాయకుడు ఎట్లయితడని కిషన్ రెడ్డిని అడుగుతున్న.
ఇయ్యాల ఒక్క అంబర్‌పేట నియోజకవర్గంలోనే 16 వందల కుటుంబాలను రోడ్లపై పడేస్తున్నరు. కానీ బయటికి చెప్పే లెక్కలు వేరున్నయ్. లోపల అలగున్నయ్. సుమారు 40 వేల కుటుంబాలను అంటే లక్షన్నర మందిని రోడ్లమీద పడేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. ఎవడడిగిండు అసలు ఈ మూసీ ప్రెజెక్టును. గరీబోళ్లకు రూ.2500 ఇస్తాన్నవ్ అది ఇవ్వు. బతుకమ్మ చీరలు రెండిస్తా అన్నవ్. ఒక్కటీకూడా లేదు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఒక్కటి కూడా ఉండవ్. గరీబోళ్లకు పనిచేయమని గద్దెనెక్కిస్తే.. ఇవాళ పేదోళ్ల ఇండ్లు కూలగొడుతా.. రోడ్డుమీద పడేస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊకునేటోళ్లు ఎవ్వరు లేరు. భుజం భుజం కలిపి మీతో కలిసి కొట్లాడుతం. 2400 కిలోమీటర్ల నమామీ గంగ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చుపెడితే.. 55 కిలోమీటర్ల మూసీ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడ్తడట. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.4 వేల కోట్లతోని మూసీ శుద్ధి చేసేందుకు ఎస్టీపీ ప్రాజెక్టులు ప్రారంభించాం. అదేవిధంగా మూసీపై 540 కోట్లతో 15 బ్రిడ్జిలు మంజూరు చేసినం.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు అవుతాయని లెక్కగట్టాం. కానీ ఒకేసారి పది రెట్లు ఎలా పెరిగింది? దీనికి సమాధానం చెప్పేటోడు లేడు. ఇండ్లు కూలగొడతామంటే తాము ఊరుకునేది లేదు. శంకర్‌నగర్‌లో ఇండ్లు కూలగొడుతున్నరట. రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గుంటే.. నిన్ననే హైకోర్టు చెప్పింది. ఇండ్లు కూలగొట్టదని. రేవంత్ రెడ్డి నువ్వు మొగోనివైతే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయ్. ఆడపిల్లలకు ఇస్తానన్న నెలకు రూ.2500 ఇవ్వు. ముసలోళ్లకు రూ.4 వేలు ఇవ్వు. రైతులకు రుణమాఫీ చెయ్. రైతుబందు రూ.15 వేల ఇవ్వు. ఆటో డ్రైవర్లకు బోర్డు పెడతా అన్నవ్ ముందు అది చెయ్. పేదవాళ్లను ఆదుకో. దమ్ముంటే గరీబోళ్లకు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టు. కానీ ఉన్న ఇంట్ల నుంచి తీసుకెళ్లి బయట పడేస్తామంటే ఊరుకునే లేదు. కాంగ్రెస్ళ్లు నలుగురు బ్రోకర్‌గాళ్లు వస్తరు.. మిమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తరు. ఏ బ్రోకర్‌ను నమ్మొద్దు. మీ ఇళ్లును కాపాడుకోవాలంటే ఐక్యమత్యంతో ఉండాలి. మిమ్మల్ని ఎవరు ముడుతడో తామంతా చూస్తామని.. ఒక్క కాల్ కొడితే తామంతా ఒస్తాం. మీరు ఎంత గట్టిగ నిలబడితే.. మీ ఇండ్లు అంతే గట్టిగ నిలబడుతయ్. మున్సిపల్ ఎన్నికలప్పుడు ఓటుతో జాడిచ్చి కొట్టాలి. మీ హక్కులు మీ దగ్గర గుంజుకునే హక్కు ఎవరికీ లేదు. కేసీఆర్ మీకు అండగా ఉన్నడు. మీ ఇండ్లు పోకుండా చూసుకునే బాధ్యతా మాది. ఆర్బీఎక్స్ అని ఉంటే దానిని తుడిపేసి కేసీఆర్ అని రాయండి. రేవంత్ రెడ్డి లాంటోడు మంచి మాటకు వినడు.’ అని కేటీఆర్ అన్నారు.
Live : అంబర్ పేట్ నియోజకవర్గం, గోల్నాక డివిజన్ లోని మూసి పరివాహక ప్రాంత హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS @KaleruVenkatesh https://t.co/pS4dXAMVEd
— BRS Party (@BRSparty) October 1, 2024