రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే ఎక్కడిక్కడ కొనుగోలు సెంటర్లను ముట్టడిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొన్న ధాన్యానికి మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. వడ్లు కొనేలా, బోనస్ వచ్చేలా రైతుల తరఫున ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని స్పష్టంచేశారు. రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బద్దెనపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం రోడ్లు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతుబంధు సరిగా ఇవ్వలేదని, నెలనెలా కిస్తీల లెక్క వేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఎకరానికి రైతుబంధు ఇచ్చి పేపర్లలో పెద్ద పెద్ద అడ్వైర్టెజ్మెంట్లు ఇచ్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు 11సార్లు రైతుబంధు వేశామని, అప్పుడు అడ్వైర్టెజ్మెంట్లు వేసుకోలేదని, కిస్తీల లెక్క, ఎకరాల చొప్పున రైతుబంధు వేయలేదని, పబ్లిక్ మీటింగ్ పెట్టి డప్పు కొట్టుకోలేదని గుర్తుచేశారు. 11 సార్లు రైతుబంధు సాయం రూ.73వేల కోట్లు రైతుల ఖాతాల్లో టింగ్ టింగ్ మంటూ పడుతుండేవని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేరని అందుకే రైతుబంధు లేదని, వడ్లు కోనేటోళ్లు లేరని, ఆఖరికి కరెంట్ కూడా సక్కగ ఇచ్చేటోళ్లు లేరని మండిపడ్డారు. ఇప్పుడే సభలో కరెంట్ కూడా పోయిందని కాంగ్రెస్ సర్కార్‌కు చురకలంటించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానని చెప్పుడే ఏమీ చేయలేదన్నారు. అత్తకు రూ.4 వేలు, కోడలుకు రూ.2,500, తులం బంగారం, కేసీఆర్‌కిట్, వస్తున్నయా? అని ఈ సందర్భంగా మహిళలను అడిగారు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏదైనా చేశారా? అని అడగడంతో హామీలు ఏమీ అమలు కాలేదని వారు బదులిచ్చారు. అందుకే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతో వచ్చిన ఓటు హక్కును వినియోగించుకొని, ఆలోచించి పాలకులను ఎన్నుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మొన్న మానకొండూర్‌కు వెళ్లినపుడు ఓ రైతు తనతో రైతుబంధు పడుతలేదని అవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ముండ్ల చెట్టుకు నీళ్లువోసి.. పండ్లు రావాలంటే వస్తాయా? మరి కాంగ్రెస్‌కు ఓటేసి మంచి కావాలంటే అయితదా? దయచేసి ఎన్నికలు రాగానే ఆగం కావద్దని సూచించారు. అంబేద్కర్ చెప్పినట్లుగా విద్యతోనే వికాసం వస్తదని, ఓటుతోనే మీరు కావాలనుకున్నోళ్లు పాలకులు, మంచి చేసేటోళ్లు వస్తరని, అలోచించి మెదగాలని సూచించారు.
రైతులకు నష్టం జరుగనివ్వం
బద్దెనపల్లిలోని ఐకేపీ సెంటర్‌ను కేటీఆర్ పరిశీలించి రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు రైతుబంధు రావడం లేదని, వడ్లు కొంటలేరని, నెల రోజుల నుంచి బీట్‌లోనే వడ్లు అరబెట్టుకున్నామని, వర్షానికి తడుస్తున్నా, ఎండుతున్నా సర్కార్, అధికారులు పట్టించుకోవడం లేదని కేటీఆర్‌కు తమ గోడు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఈ రోజు వెయ్యి టన్నులు కొనలేదని అధికారులు చెబుతున్నారని, ప్రభుత్వమేమో రైతు ప్రభుత్వం అని పోజులు కొడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ విస్మరించిందని ధ్వజమెత్తారు. రైతు యజమానితో సమానంగా కౌలు రైతుకు కూడా రైతుబంధు ఇస్తామని మాట ఇచ్చారని విరుచుకుపడ్డారు. రైతు కూలీలకు కూడా నెలకు రూ వెయ్యి ఇస్తామని, పంటలకు మద్దతు ధర, బోనస్ ఇస్తామని, ఇవన్నీ ఇవ్వకపోగా కనీసం రైతులు పండించిన ధాన్యం కొనడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే కొనుగోలు సెంటర్లో కాంటాలు పెట్టి కొనుగోళ్లు ప్రారంభించాలని, మిల్లులు అలాట్ చేసి రైతులకు మీరు చెప్పినట్టు రూ.500 బోనస్‌తో సహా రూ.2,359 కనీస మద్దతు ధర చెప్పినట్టుగా రైతులకు అందివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రోడ్డెక్కుతామని, అన్ని మండలాల్లో, అన్ని సెంటర్లలో రైతులతో పాటు రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మళ్లీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వమేనని రైతులందరికీ కంటికిరెప్పలా ఆయనే కాపాడుకుంటారని పేర్కొన్నారు. ఇక్కడికి ఒక ఎమ్మెల్యేగా తాను వస్తున్నట్టు సమాచారం ఇచ్చినా ఒక్క అధికారికి పట్టిలేదని, కనీసం అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలపై ఎంత చిత్తశుద్ధి ఉన్నదో దీని బట్టి అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగితే తాము ఊరుకోబోమని, ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీసి న్యాయం చేసేలా కొట్లాడుతామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగెల మానస, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజుయాదవ్, గుగ్గిళ్ల అంజయ్యగౌడ్, సిలివేరి చిరంజీవి, అత్మకూరి రంగయ్య, అత్మకూరి జ్యోతి, కోలాపూరి ప్రవీణ్, సిలివేరి సుమన్, తదితరులు ఉన్నారు.
అంబేద్కర్ అందరివాడు..
బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహూజనులకే కాదు.. అందరివాడని, ప్రపంచ మేధావి అని కేటీఆర్ కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణ సాధ్యమైందని, అందుకే కేసీఆర్ సారథ్యంలో హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని గొప్పగా ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. ఈ నెల 14న రామన్నపల్లెలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ రావాల్సి ఉండేదని చెప్పారు. అయితే, హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ తెరువకుండా గొలుసులు పెట్టి తాళం వేసిందని, దీంతో ఈ సారి జయంతికి తెరువకపోతే వేలాది మందితో తామే తాళాలు బద్దలు కొడుతామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగొచ్చి తాళాలు తీసిందని తెలిపారు. అక్కడి వేడుకల్లో పాల్గొనడంతో రాలేకపోయానని చెప్పారు. అంబేద్కర్‌కు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని ధ్వజమెత్తారు. 1952, 1954లో అంబేద్కర్‌ను పార్లమెంట్‌కు రానీయకుండా కుట్ర చేసి ఓడించిందని, 55 ఏండ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకు భారతరత్న ఇవ్వలేదని మండిపడ్డారు.
అంబేద్కర్ నమ్మారు.. కేసీఆర్ ఆచరించారు
అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, దళితబంధు, బీసీబంధుతోపాటు కులవృత్తులకు ప్రోత్సాహమందించారని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ నమ్మింది, కేసీఆర్ ఆచరించింది పేదలను బాగు చేయడం ఒకటేనని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, 6.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు.
రాష్ట్రస్థాయిలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ
కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 27 బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వరకు జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించి, ఇక్కడ ఎంపికైన జట్లకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. క్రికెట్‌తో పాటు దసరా సమయంలో జిల్లాస్థాయిలో వాలీబాల్, కబడ్డీ పోటీలను సైతం బ్రహ్మాండంగా నిర్వహిస్తామని వివరించారు. శనివారం సిరిసిల్లలోని మొదటి బైపాస్ రోడ్డులో జిల్లాస్థాయిలో కేసీఆర్ కప్ ఫైనల్ మ్యాచ్, కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలకు హాజరై విజేతగా నిలిచిన జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. నెల రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహణకు కృషిచేసిన బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కొండూరు సంకేత్రావును ప్రత్యేకంగా అభినందించారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే అంతర్జాతీయ స్థాయిలో మైదానాలను ఏర్పాటు చేస్తామని, సిరిసిల్ల, వేములవాడ వైపు దేశం మొత్తం తిరిగి చూసేలా చేసి చూపేట్టే బాధ్యత తనదని కేటీఆర్ స్పష్టంచేశారు.
ఆసక్తి ఉంటే మహిళలకు వారు కోరిన క్రీడా పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. క్రీడా మైదానం అందించిన రంగినేని మోహన్‌రావు, వారి ట్రస్ట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్కప్ విజేతగా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్, రన్నరప్‌గా నిలిచిన వేములవాడ జట్టుకు, కేసీఆర్ కప్‌లో పాల్గొన్న ప్రతిజట్టుకూ, క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఎకరానికి రైతుబంధు ఇచ్చి పేపర్లలో పెద్ద పెద్ద అడ్వైర్టెజ్మెంట్లు ఇచ్చుకుంట గొప్పలు చెప్పుకుంటున్నడు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు 11సార్లు రైతుబంధు వేశాం కానీ ఎప్పుడు ఇలా అడ్వైర్టెజ్మెంట్లు వేసుకోలేదు. కిస్తీల లెక్క, ఎకరాల లెక్క వేయలేదు. పబ్లిక్ మీటింగ్ పెట్టి డప్పు కొట్టుకోలే. 11 సార్లు రూ.73వేల కోట్లు రైతుల ఖాతాల్లో టింగ్ టింగ్ మంటూ పడేటియి.
– కేటీఆర్