KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర ప్రచారం చేస్తున్నందుకు రేవంత్‌తో సహా కాంగ్రెస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన సోమవారం పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. కాళేశ్వరంతో ఇప్పటిదాకా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగిందని.. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందన్నారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకపోలేదు నిక్షేపంలా ఉందని.. మీరేమో (కాంగ్రెస్) కూలిపోయిందని అబద్దాలు చెపుతున్నారని మొన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఎత్తిచూపారని.. 20 నెలలుగా బ్యారేజీలు ఎందుకు రిపేరు చేయడం లేదని కూడా అక్బరుద్దీన్ ప్రశ్నించారని గుర్తు చేశారు. మొదటినుంచి లక్ష కోట్ల అవినీతి అని కాళేశ్వరంపై కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరూ తప్పుడు ప్రచారం చేశారన్నారు.
రూ.94 వేల కోట్ల ఖర్చు చేసిన ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది? కేటీఆర్ నిలదీశారు. ఇదంతా రాజకీయ ఆరోపణ అని రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి కొట్టిపారేసినా ఇంకా ముఖ్యమంత్రికి బుద్ధి రావడం లేదన్నారు. రూ.4000 కోట్ల నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో భూసేకరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అయిన వ్యయాన్ని తీసేస్తే 85 పిల్లర్లు ఉన్న బ్యారేజీ సిమెంట్ స్ట్రక్చర్ నిర్మాణానికే సుమారు రూ.2000 కోట్లు ఖర్చు అయ్యాయని.. కుంగిన మూడు పిల్లర్లు, ఏడవ బ్లాక్‌ను మాత్రం పునర్నిర్మాణం చేస్తే సరిపోతుందని.. ఈ విషయం ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌లో కూడా స్పష్టంగా ఉందన్నారు. ఆ ఒక్క ఏడవ బ్లాకు నిర్మాణానికి రూ.250 నుంచి రూ.300 కోట్లు ఖర్చయ్యిందని.. ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా తామే సొంతంగా ఆ బ్లాకును పునర్నిర్మిస్తామని ఎల్ అండ్ టీ కంపెనీ చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇందులో ప్రజాధనం ఎక్కడ వృథా అయ్యిందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు కోసమే మేడిగడ్డ బరాజ్ ను రిపేర్ చేయించకుండా నీళ్లను కిందికి వృథాగా వదులుతున్నారని ఆరోపించారు.
రూ.94వేల కోట్ల ప్రాజెక్టులో 250 కోట్లు నష్టం జరిగితే, ఆ డబ్బుల్ని కూడా తామే సొంతంగా పెట్టుకుంటామని ఏజెన్సీ ముందుకు వస్తే పట్టించుకోకుండా లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 17 మే 2023 నాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రూ.1100 కోట్ల ఖర్చుతో గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చే పథకానికి రూపకల్పన చేశారని.. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉంటే, 560 మీటర్ల ఎత్తులో మల్లన్న సాగర్ ఉంటుందని.. 540 మీటర్లు ఎత్తులో గండిపేట చెరువు ఉంటుందన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు గోదావరి జలాలను గ్రావిటీ ద్వారానే తేవొచ్చని.. అయితే గోదావరి, మూసీ అనుసంధానికి కొండపోచమ్మ సాగర్ సోర్స్ ని ఎందుకు తీసేసారో తెలియదు? లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక అన్నారు. రూ.1100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును ఇవాళ రూ.7390 కోట్లకు పెంచారు అంటే దాదాపు ఏడు రేట్లు పెంచారు. ఎవరికోసం? ఎందుకోసం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జిల్లాలను తీసుకొచ్చి రావల్ కోల్ చెరువును నింపి అక్కడి నుంచి గండిపేటకు గ్రావిటీ ద్వారా తీసుకురావొచ్చని.. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు పేరు చెప్పి మూడు నీటి శుద్ది కేంద్రాలు, ఐదు పంప్ హౌస్‌లను కడుతుందని నిలదీశారు. ఎవరి లాభం కోసం కడుతున్నారు? కమీషన్లు దండుకోవడానికా? కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఖజానాలో పైసలు లేక పథకాలు అమలు చేయడం లేదని చెప్తున్న రేవంత్ రెడ్డి మరోవైపు ప్రజాధనాన్ని దండుకుంటున్నాడని.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు రెండు లక్షల కోట్లు అని మొన్న పార్లమెంట్‌లోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా.. సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు రూ.8లక్షల కోట్లు, రూ.7లక్షల కోట్ల అప్పు అని నోటికి వచ్చినట్లు వాగారన్నారు. సంక్షేమ పథకాలు అమలుకు పైసలు లేవని చెప్తున్న ప్రభుత్వం రూ.7400 కోట్ల ప్రాజెక్టుకు అర్జెంటుగా శంకుస్థాపన ఎందుకు చేస్తుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనకు కారణమైన కాంట్రాక్ట్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయండి అని హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ రిపోర్ట్ ఇచ్చిందని.. అదే కంపెనీ నిర్మిస్తున్న ఎన్ హెచ్ 66 రహదారిలో స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కూలడంతో నేషనల్ హైవే అథారిటీ ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసిందని.. ఈ రెండు ప్రమాదాలకు కారణమైన కాంట్రాక్ట్ కంపెనీకి రూ.7000 కోట్ల పనులు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు.