హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి ఆయువుపట్టు, ఊపిరి లాంటి ప్రాంతమైన గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని విక్రయించాలని అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తెలివి తక్కువ నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ఆ భూమిలో ఎలాంటి జీవాలు లేవంటూ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ ఆ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వివరాలు సేకరించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్లో 700 రకాల పుష్పించే మొకలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతం 10 రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు, 200 జాతులకు చెందిన పక్షులకు నిలయంగా ఉన్నదని వివరించారు. అంతేకాకుండా ఒక బిలియన్ సంవత్సరాల క్రితం నాటి రాతి నిర్మాణాలు అక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. అత్యాధునిక భవనాలు, కొనుగోలు కేంద్రాలు నిర్మించేందుకు అభివృద్ధి చెందుతున్న సహజసిద్ధమైన ప్రాంతాన్ని నాశనం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత బాధాకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.