(గుండాల కృష్ణ /మ్యాకం రవికుమార్) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): ‘కృష్ణాజలాల్లో 500 టీఎంసీలు.. గోదావరిలో వెయ్యి టీఎంసీలు ఇవ్వండి చాలు.. మిగిలిన ఎన్ని నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఆశామాషీగా అన్నది కాదని, దాని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా-గోదావరిలో తెలంగాణను కేవలం 1500 టీఎంసీలకు పరిమితం చేయాలనే కుతంత్రం చాపకింద నీరులా అమలవుతున్నదని తేల్చిచెప్తున్నారు. అసలు కృష్ణాజలాల్లో తెలంగాణకు మరోసారి చారిత్రక ద్రోహం చేసేందుకే కాళేశ్వరాన్ని ఎండబెట్టి బనకచర్లకు జై కొట్టినట్టుగా అనుమానిస్తున్నారు.
అందులో భాగంగానే బీజేపీ-బాబుతో కలిసి రేవంత్ రచించిన కపట ప్రణాళిక పర్యవసానమే కృష్ణాలో 500.. గోదావరిలో 1000 టీఎంసీల ప్రకటనగా అభివర్ణిస్తున్నారు. మరి నదీ పరీవాహక ప్రాంతం, ప్రాజెక్టులు, వినియోగం అంతకుమించి సాగు భూములను బేరీజు వేస్తే ఏ చట్టాల ప్రకారమైనా తెలంగాణకు హక్కుభుక్తంగా రెండు నదుల్లో 3000 టీఎంసీలకు పైగా వాటా వస్తుంది. అయినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం అందులో సగం చాలని అనడం వెనుక అసలు కుట్ర దాగి ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన 3 వేలకు పైగా టీఎంసీల్లో 1500 టీఎంసీలు మాత్రమే చాలంటే మిగిలిన నదీ జలాలను పొరుగు రాష్ర్టాలకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధమైందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో కలిసి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. కాళేశ్వరంను బద్నాం చేస్తూ మేడిగడ్డను ఎండబెట్టి బనకచర్లకు మార్గం సుగమం చేయడం.. తమ్మిడిహట్టి రూపంలో ప్రాణహిత-చేవెళ్లను తెరపైకి తెచ్చి కృష్ణాజలాల్లో మన వాటాకే గండికొట్టడం.. చివరగా ఆల్మట్టి ఎత్తు పెంపుతో కర్ణాటక, తుంగభద్ర-ఆర్డీఎస్ కుడి కాల్వలతో ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణాలో వాటా పెంచడం.. ఇలా పద్ధతి ప్రకారం తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు గోదావరి జలాల్లో జరిగిన ప్రధాన అన్యాయం ఏమిటంటే నీళ్లున్న చోట ప్రాజెక్టులు లేవు, ప్రాజెక్టులున్న చోట నీళ్లు లేవు! ఇందుకు కారణం.. నీళ్లున్న ప్రాణహిత మీద ప్రాజెక్టులు కడితే కింద ఉన్న ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు రావు. అందులో భాగంగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నీళ్లులేని తమ్మిడిహట్టి దగ్గర రూపొందిస్తే కేసీఆర్ నీళ్లున్న మేడిగడ్డ దగ్గరకు మార్చారు. మిగిలిన ప్రాజెక్టు అంతా గతంలోనిదే. కాకపోతే సమైక్య పాలకులు 16.4 టీఎంసీల నీటి నిల్వకు రిజర్వాయర్లు కడితే కేసీఆర్ 141 టీఎంసీల నిల్వ కోసం రిజర్వాయర్లు నిర్మించారు. దీని ద్వారా పుష్కల నీటిలభ్యత ఉన్న ప్రాణహిత జలాలను వినియోగించుకోవచ్చు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సరిగ్గా ఎక్కడైతే అన్యాయాన్ని సవరించారో.. దాన్నే తప్పుపట్టి తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టుగానే తయారు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే దాన్ని సాకుగా చూపి గత రెండు సీజన్ల నుంచి ప్రాణహిత జలాలను కింద ఉన్న ఏపీకి వదిలిపెడుతున్నారు.
రౌతు మెత్తనైతే.. గుర్రం మూడు కాళ్ల మీద నడిచిందట! తెలంగాణ ముఖ్యమంత్రే మేడిగడ్డను ఎండబెట్టి ప్రాణహిత జలాలను కిందకు వదులుతుండటం ఏపీ సీఎం చంద్రబాబుకు కలిసొచ్చింది. అందుకే పోలవరం కాకుండా అదనంగా మరో 500-600 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునేందుకు 200 టీఎంసీల ప్రాతిపదికన బనకచర్ల ప్రాజెక్టును రూపొందించారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు బనకచర్లను ఆపుతానని ప్రకటించిన రేవంత్.. ఢిల్లీకి వెళ్లి సంతకం చేసివచ్చారు. కమిటీ ప్రతిపాదన నామమాత్రంగానే ఉన్నా తెలంగాణ అంగీకరించిందని చంద్రబాబే చెప్తున్నారు. ఇలా గోదావరిలో రాష్ర్టానికి తీరని ద్రోహం జరిగింది.
బనకచర్లతో కేవలం గోదావరిలోనే కాదు.. కృష్ణాజలాల్లోనూ తెలంగాణకు భారీ నష్టం వాటిల్లనున్నది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుకాగానే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల్లో అదనంగా 35 టీఎంసీల వాటా పెరిగింది. మిగిలిన 45 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉన్నా ఇప్పటికీ కేంద్రం, ఏపీ ఇవ్వడం లేదు. రేపు 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టు పనులు మొదలుకాగానే పోలవరంలాగానే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు కృష్ణా నీటిలో అదనంగా మరో 87.5 టీఎంసీల వాటా ఇవ్వాల్సి ఉంటుంది. 200 టీఎంసీల్లో అది పోను మిగిలిన 112.5 టీఎంసీల వాటాను గతంలో మాదిరిగానే ఎటూ తేల్చరు. ఏపీ కృష్ణా, పెన్నా బేసిన్‌కు ఎలాగూ అదనంగా గోదావరి జలాలను తరలించి అవసరాలు తీర్చుకుంటుంది. తెలంగాణ ఎటూ కొరగాకుండాపోతుంది. ఇలా మనకు అన్యాయమై ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు లబ్ధి కలుగుతుంది.
గోదావరిలో తెలంగాణను దెబ్బకొట్టి ఇతర రాష్ర్టాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కాంగ్రెస్ సర్కారు పరోక్షంగా సహకరిస్తుండగా, ఇప్పుడు కృష్ణా జలాల్లో నేరుగా తెలంగాణకు నష్టం చేకూర్చి ఎడారిగా మార్చే మరో కుట్రకు బీజేపీ-బాబు వ్యూహం పన్నారు. అదేమంటే 75 శాతం విశ్వసనీయతపై (100 ఏళ్లలో 75 ఏళ్లపాటు నదిలో వచ్చిన నీటిని లెక్కగడతారు) బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-1) 2,130 టీఎంసీల కృష్ణాజలాలను బేసిన్‌లోని మూడు రాష్ర్టాలకు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-811 టీఎంసీలు, మహారాష్ట్ర-585 టీఎంసీలు, కర్ణాటక-734 టీఎంసీలు) రాష్ర్టాల మధ్య పంపిణీ చేసింది. 1976లో ఇది అమలులోకి వచ్చింది.
ఆ తర్వాత కృష్ణా బేసిన్లో 65 శాతం విశ్వసనీయతపై జలాలను పంపిణీ చేసేందుకు కేంద్రం 2004లో బ్రిజేశ్‌కుమార్ (కేడబ్ల్యూడీటీ-2) ట్రిబ్యునల్ వేసింది. ఆ ట్రిబ్యునల్ బచావత్ కేటాయింపుల జోలికి వెళ్లకుండా అంతకు మించి ఉన్న 448 టీఎంసీలను మాత్రమే మూడు రాష్ర్టాల మధ్య (మహారాష్ట్ర-81, కర్ణాటక-173, ఉమ్మడి ఏపీ-194 టీఎంసీలుగా) పంపిణీ చేసింది. అయితే ఈ ట్రిబ్యునల్ నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని అప్పట్లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. దీంతో ఇప్పటివరకు 448 టీఎంసీల పంపకం అనేది అమల్లోకి రాలేదు.
గతంలో నలుగురు.. ఇప్పుడు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించిది. కానీ గతంలో పైసా రాలేదు. ఇప్పుడూ నయాపైసా రావడం లేదు. కానీ కర్ణాటక బీజేపీ ఎంపీలు మాత్రం.. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెండింగులో ఉన్న బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవార్డును అమల్లోకి తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బ్రిజేశ్ అవార్డును వ్యతిరేకించినా.. ఇప్పటి ఏపీ సర్కారు మాత్రం వ్యతిరేకించడంలేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఈ విషయంలో కర్ణాటకకు ఏపీ సహకరిస్తే ప్రతిఫలంగా తుంగభద్రలో ఏపీకి కర్ణాటక సహకరించే అవగాహనే అని సాగునీటిరంగ నిపుణులు చెప్తున్నారు.
అంటే బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవార్డు అమలైతే కర్ణాటక, ఏపీ ప్రయోజనం పొందనుండగా తెలంగాణకు మాత్రం అనేక రూపాల్లో తీవ్ర నష్టం వాటిల్లనున్నది. వాస్తవానికి కర్ణాటక, ఏపీ ఒత్తిడితో కేంద్రం ఇప్పటికే బ్రిజేశ్ అవార్డును అమలుచేసే దిశగా పావులు కదుపుతున్నది. విషయం తెలిసినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం కిమ్మనడం లేదు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు సమర్థ వాదనలు వినిపిస్తున్నామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నది. అసలు నదిలో కిందకు వరద వచ్చే దారులే మూసుకుపోతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వం వాటా కోసం కొట్లాడుతున్నానంటూనే పట్టింపులేనట్టుగా ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.
1. బ్రిజేశ్‌కుమార్ (కేడబ్ల్యూడీటీ-2) ట్రిబ్యునల్ అవార్డు అమలైతే మొదటగా తెలంగాణ మీద పిడుగులా పడేది ఆల్మట్టి ఎత్తు పెంచడం. కృష్ణా బేసిన్లో మొదటి జలాశయం ఆల్మట్టి. దాని ఎత్తు 519.6 మీటర్లు ఉండగా, నీటి నిల్వ 123.08 టీఎంసీలు. బ్రిజేశ్-2 ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. 519.6 నుంచి 524.256 మీటర్ల వరకు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవచ్చని చెప్పింది. పెరిగే ఎత్తు 4.65 మీటర్లు మాత్రమే. కానీ నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 100 టీఎంసీలు పెరుగుతుంది. అంటే ఇప్పటివరకు 123.08 టీఎంసీలు నిల్వ చేసుకోగలిగిన కర్ణాటక.. ఎత్తు పెంపుతో 223.08 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చు. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా మలుపుకొని ఆపై వచ్చే వరదను ఆల్మట్టిలోనే నిల్వ చేసుకుంటుంది. కిందికి చుక్క నీళ్లు రావు.
2. బ్రిజేశ్-2 అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలు కేటాయించారు. అందులో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాల్వకు 4, తెలుగుగంగకు 25, జూరాల 9, కోయిల్‌సాగర్ 3.9 టీఎంసీలు, ఇతరత్రా కేటాయింపులున్నాయి. ఇప్పుడు రెండు రాష్ర్టాలైనందున 194 టీఎంసీలను ఏపీ, తెలంగాణ పంచుకోవాలి. ముఖ్యంగా క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీలు ఉండటం ఆంధ్రప్రదేశ్‌కు కలిసొచ్చే అంశం. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ గడ్డపై పట్టుమని పది టీఎంసీల కృష్ణాజలాలు నిల్వ చేసుకునే ప్రాజెక్టులు కట్టలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ అనేవి ఉమ్మడి ప్రాజెక్టులు. ఉన్న జూరాలలో పట్టుమని పది టీఎంసీలు కూడా ఉండవు. కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కేవలం పెన్నా బేసిన్లోనే 351 టీఎంసీల నిల్వకు రిజర్వాయర్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు బ్రిజేశ్-2 అవార్డు అమల్లోకి వస్తే వరద వచ్చినప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నాకు కృష్ణాజలాలను తరలించుకుపోయి నిల్వ చేసుకునే ఏపీ, వరదలేని సమయాల్లో శ్రీశైలం, సాగర్‌లోని నిల్వల వైపు చూస్తుంది. దీంతోపాటు ఆర్డీఎస్ కుడి కాల్వ ద్వారా ఉన్న నీటినీ పట్టుకుపోతుంది. దీంతో తెలంగాణ పరిస్థితి దయనీయంగా తయారవుతుంది.
3. బ్రిజేశ్-2 అవార్డు అమలుతో ఏపీ-కర్ణాటక పరస్పర సహకారంలో భాగంగా తుంగభద్ర నీటిని శ్రీశైలంకు రాకుండా వాడుకోవడం! ఇప్పటివరకు తుంగభద్ర కింద కర్ణాటకలో 9.3 లక్షల ఎకరాలు, ఏపీ లో 6.25 లక్షల ఎకరాలు సాగవుతుంటే తెలంగాణలో కేవలం 87 వేల ఎకరాలే సాగవుతున్నది. అంటే తుంగభద్ర నీటి వినియోగానికి తెలంగాణలో పెద్దగా అవకాశంలేదు. అందుకే కర్ణాటక-ఏపీ పరస్పర సహకారంతో ముందుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే కర్ణాటక తుంగభద్ర డ్యాంలో పూడిక పేరుకుపోయి నిల్వ తగ్గిందనే సాకుతో ప్రస్తుతం ఉన్న లోలెవల్ కెనాల్‌కు సమాంతరంగా మరో కాల్వను తవ్వనున్నది. దీంతోపాటు తుంగభద్ర జలాల నిల్వకు 31 టీఎంసీల నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలకు పెంచుకోనున్నది. ఏపీ కూడా ప్రస్తుతముఉన్న హైలెవల్ కాల్వకు సమాంతరంగా మరో కాల్వను తవ్వనున్నది. అంటే నీటి వినియోగం రెట్టింపు కంటే ఎక్కువ కానున్నదని నిపుణులు చెప్తున్నారు.
కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ర్టాలకు సంబంధించి శ్రీశైలం జలాశయానికి వరద మూడు మార్గాలనుంచి ప్రధానంగా వస్తుంది. ఇందులో ఎక్కువ ఇన్‌ఫ్లోలు వచ్చే కీలకమైన మార్గాలు తుంగభద్ర, ఆల్మట్టి. భీమా నుంచి మోస్తరు ఇన్‌ఫ్లో మాత్రమే ఉంటుంది. బ్రిజేశ్-2 ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకొస్తే ఆల్మట్టి ఎత్తు పెరిగి అక్కడి నుంచి వరద దిగువన ఉన్న నారాయణపూర్‌కు, అటునుంచి జూరాల, తద్వారా శ్రీశైలం జలాశయానికి రావడమనేది కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. ఇంకోవైపు తుంగభద్ర జలాల వాడకాన్ని పెంచుకునేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. బ్రిజేశ్-2 అవార్డు అమల్లోకి వస్తే ఆ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కి తుంగభద్ర ద్వారా శ్రీశైలానికి వచ్చే వరద భారీగా తగ్గుతుంది. ఎలాగోలా వచ్చే వరదను పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఎప్పటికప్పుడు మళ్లిస్తుంది. అంటే బ్రిజేశ్-2 అవార్డు అమల్లోకొస్తే ఇన్ని గండాలు తెరపైకొస్తాయి. వీటిని దాటుకొని కృష్ణా జలాలు సాగర్‌కు వచ్చేదెన్ని? అందులో ఏపీ వాటాను తట్టుకొని తెలంగాణ వాడుకునేదెన్ని?
ఇప్పుడు కృష్ణాజలాల పంపకంపై కొనసాగుతున్న ట్రిబ్యునల్ జరిగేది తెలంగాణ-ఏపీ మధ్యనే. అందునా బచావత్ కేటాయించిన 811 టీఎంసీలపై మాత్రమే! అందులోనే ఏపీకెన్ని? తెలంగాణకు ఎన్ని? అనేది తేలుతుంది. అంటే ఇందులో వాటాను సాధించడం ఒక్కటే తెలంగాణకు పరిష్కారం కాదు. రాష్ర్టాన్ని ఎడారిగా మార్చే బ్రిజేశ్-2 అవార్డు అమలుపై పోరాటం సాగించాల్సిందే. లేదంటే శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద వచ్చే దారులు మూసుకుపోయి భవిష్యత్తులో సాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. అంతటి ముప్పును ముందుగానే గుర్తించి అడ్డుకోవాల్సిన రేవంత్ సర్కార్.. దానిపై కనీసంగా దృష్టిసారించడం లేదంటే ముఖ్యమంత్రి మాటల్లోనూ, చేతల్లోనూ చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతున్నది. అందుకు ఆల్మట్టి ఎత్తు పెంపు పరిణామమే చక్కటి ఉదాహరణ.
ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకొని అదనంగా వంద టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు కర్ణాటక దాదాపు 1.33 లక్షల ఎకరాల భూమిని సేకరిస్తున్నది. ఇందుకు రూ.70 వేల కోట్లు ఖర్చు చేసేందుకు అంచనాలు రూపొందించింది. ఈ మేరకు ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రాజెక్టుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది. స్పందించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ బ్రిజేశ్-2 అవార్డు అమలుతో తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై సుప్రీంకోర్టు తలుపు తడతామని ప్రకటించారు. కానీ మహారాష్ట్ర కంటే అనేక రెట్లు ఎక్కువ నష్టపోయే తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేకపోవడం దేనికి సంకేతం?
ఆల్మట్టి ఎత్తు పెంచి అదనంగా వంద టీఎంసీల నిల్వ పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం 1.33 లక్షల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఏకంగా రూ.70 వేల కోట్ల అంచనాను రూపొందించారు. భవిష్యత్తులో మరింత పెరగవచ్చు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టు సామర్థ్యాన్ని వంద టీఎంసీలు పెంచేందుకే కర్ణాటక రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే 240 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపుతో దాదా పు 500 టీఎంసీల నీటి వినియోగం కోసం వేల కిలోమీటర్ల కాల్వలు, వందల కిలోమీటర్ల టన్నెళ్లు, పంపుహౌస్‌లు, బాహుబలి మోటర్లు, 3 బరాజ్‌లు.. ఇలా కండ్లు చెదిరే భారీ నిర్మాణాలు చేపట్టింది. ఇందుకు రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. అంటే ఆల్మట్టి ఎత్తు పెంపు అంచనా వ్యయంతో పోలిస్తే కాళేశ్వరానికి అయిన ఖర్చు ఏపాటిదో స్పష్టమవుతున్నది.
6 రాష్ర్టాన్ని సర్వనాశనం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనబడుతున్నది. అధికారం చేపట్టిన రెండేండ్లలోనే ఆర్థిక విధ్వంసం, అస్తిత్వ విధ్వంసంతోపాటు తరతరాల తెలంగాణ ప్రయోజనాలపై గొడ్డలిపెట్టులాంటి నిర్ణయాలను అమలు జరుపుతున్నది. దశాబ్దాల పోరాటంతో, ఎన్నో గండాలు దాటి సాధించుకున్న తెలంగాణ చివరికి ఈనగాచి నక్కల పాలైందన్న వాస్తవం ప్రజల అనుభవంలోకి వస్తున్నది. ఇంకా.. ఇంకా.. అదృశ్యశక్తుల కనిపించని కుట్రలేవో రాష్ర్టాన్ని కమ్ముతున్నట్టు అనిపిస్తున్నది.
ఏ పాలకుడైనా తన రాజ్యం బాగుండాలనుకుంటాడు. ప్రజలు బాగుండాలని, సంపద పెరగాలని కోరుకుంటాడు. కానీ, దానికి భిన్నమైన దృశ్యం ఇప్పుడు తెలంగాణలో కనబడుతున్నది. బనకచర్ల పేరుతో సగం గోదావరిని ధారపోశారు. ఇచ్చంపల్లికి తలూపి మిగిలిన సగం వదలేసుకున్నారు. ఇప్పుడిక కృష్ణాపై పడ్డారు. కన్నడనాట కాంగ్రెస్ సర్కారు ఆల్మట్టి ఎత్తు పెంచినా ఇక్కడి ప్రభుత్వం కిమ్మనడం లేదు. పైగా రంగారెడ్డికి తమ్మిడిహట్టి నీళ్లిస్తామని నిస్సిగ్గు ప్రకటనలు! కృష్ణా బేసిన్‌కు గోదావరి బేసిన్ నుంచి నీళ్లు తెస్తామని బేసిక్ అవగాహన ఉన్న ఎవడైనా అంటడా? ఇది మిడిమిడి జ్ఞానమా?
లేక తెలంగాణ హక్కులకు నీళ్లొదిలే కుట్రనా?
తుంగభద్ర నీటిని వరద జలాల పేరుతో ఏపీ స్వాహా చేస్తున్నది. పోతిరెడ్డిపాడుతో కృష్ణా నది మొత్తం సీమకు తరలిపోతున్నది. ఆల్మట్టి పెంపుతో వంద టీఎంసీల నీటికి కర్ణాటక ఎసరుపెడుతున్నది. నావలి అదనం. అయినా ప్రభుత్వం నోరెత్తడం లేదు. అంటే గోదావరే కాదు, కృష్ణానది కూడా చేయిదాటినట్టే. ఈ అన్యాయాన్ని నిలదీయాల్సిన సర్కారు కొడంగల్ లిఫ్ట్ పనులు, కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు, కమీషన్లు , ఢిల్లీ కప్పాల వ్యవహారాల్లో తలమునకలై ఉన్నది. తన నిష్క్రియాపరత్వంతో తెలంగాణకు చరిత్ర కూడా సరిదిద్దలేని శాశ్వత అన్యాయానికి కాంగ్రెస్ ఒడిగడుతున్నది. ఉన్న రెండు నదులను ఇటో రాష్ట్రం, అటో రాష్ట్రం చెరపడితే.. రేపు రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి? రైతాంగం భవిష్యత్తేమిటి? కర్ణాటక, ఏపీ ప్రతిపాదించిన ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ నోట్లే మట్టే! చేతులు కాలాక.. ట్రిబ్యునళ్ల ముందు పొర్లు దండాలు పెట్టినా, గుండెలు బాదుకున్నా ప్రయోజనం ఉండదు.
కట్టిన ప్రాజెక్టులకు నీటిని తిరస్కరించే హక్కు ఏ ట్రిబ్యునల్‌కూ ఉండదు. ఇదే కాంగ్రెస్ 1956లో సమైక్య రాష్ట్రం పేరుతో ఒక ద్రోహం చేసి అరవై ఏండ్లు తెలంగాణను అరిగోస పెట్టింది. మన నేల మీద మనదికాని బతుకు బతకాల్సి వచ్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అంతకు మించిన చారిత్రక ద్రోహానికి ఒడిగడుతున్నది. పార్టీలు అధికారంలోకి వస్తాయ్.. పోతయ్. కానీ రాష్ట్రం శాశ్వతం. ప్రజల హక్కులు శాశ్వతం. వనరులు శాశ్వతం. విజన్ లేని.. విజ్ఞత లేని.. వికృత ప్రభుత్వం అధికారం చేపడితే ఆ రాష్ర్టానికి ఏ గతి పడుతుందో చెప్పడానికి తెలంగాణ ఒక ఉదాహరణగా మారుతుండటమే విషాదం!!