రాజన్న సిరిసిల్ల, మే 8 (నమస్తే తెలంగాణ) : దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే.. తెలంగాణలో మాత్రం మనోళ్లు దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన రుద్దుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలతో కాంగ్రెస్ సర్కార్ ఆగమవుతున్నదని చెప్పారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, రైతు డిక్లరేషన్ సంగతేందని అడుగుతున్నామని, అందుకే రేవంత్‌రెడ్డి ఆగమైతున్నాడని చెప్పారు. కాంగ్రెస్ దరిద్రం మరో రెండేండ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని తెలిపారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఏడాదిన్నర ఓపిక పట్టాలని, కేసీఆర్ సీఎం అవుతారని, రైతులకు మేలు జరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ముత్యాల పోచమ్మ తల్లి కల్యాణోత్సవం, ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లె, నారాయణపూర్, పెద్దమ్మతల్లి ఆలయం, మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం, శ్రీదేవి, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్థిర ప్రతిష్ఠా మహోత్సవం, వీర్నపల్లి మండలం భూక్యా తండా, బావుసింగ్ నాయక్ తండాల్లో జగదాంబదేవి, సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీర్నపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్లలో కేవలం 12 వేల ఉద్యోగాలే ఇచ్చి చేతులు దులుపుకొన్నాడని విమర్శించారు. ‘అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇగో అరెస్ట్.. అగో అరెస్ట్ అంటరు.. కేటీఆర్‌ను జైల్లో పెడుతారని ప్రచారం చేసుకుంటరు. నన్ను అరెస్ట్ చేస్తామంటే చేసుకోండ్రి అని సవాల్ చేసిన. మేమేం తప్పుచేశామని అరెస్ట్ చేస్తరు?’ అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన కొనసాగుతున్నది. కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నరు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నరేండ్లలో కేవలం 12 వేల ఉద్యోగాలే ఇచ్చి చేతులు దులుపుకొన్నరు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇగో అరెస్ట్.. అగో అరెస్ట్ అంటరు.
-కేటీఆర్

జూన్, జూలైలో బీఆర్ఎస్ సభ్యత్వాలు స్వీకరిస్తామని, కొత్త కమిటీలు కూడా పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. చాకుల్లాంటి యువతను తీసుకుంటామని, సీరియస్‌గా యుద్ధానికి సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాడాలని, ‘ఢీ అంటే ఢీ’ అని కొట్లాడిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సందట్లో సడేమియాలా మారారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఎంత సేపూ ఇయ్యాల ఏ వారమన్నా.. రేపు ఏం వారమన్నా’ అంటూ మతం పేరిట జనాల నెత్తి కరాబు చేస్తున్నడు’ అని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలియని, రైతుల గురించి, కరెంట్ గురించి, ధాన్యం కొనుగోలు గురించి ఆయనకు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవాచేశారు. రైతులను ఏమాత్రం పట్టించుకోడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఏనాడూ ప్రశ్నించలేదని, ఎంత సేపు మతం పేరు చెప్పి ఓట్లు డబ్బాలో వేయించుకోవడం తప్ప చేసిందేం లేదని మండిపడ్డారు. ‘కేంద్రమంత్రి అయిన రెండున్నరేండ్లలో దత్తత గ్రామమైన వీర్నపల్లిలో బండి సంజయ్ ఒక్క బడి కట్టలే.. ఒక్క గుడి కూడా కట్టలే. చదువు రాదు.. శాస్త్రం రాదు’ అని ఎద్దేవా చేశారు. ‘దేవుడి గుడి ముందు బిచ్చగాళ్లలా భగవాన్ కా నామ్‌పే దేవో బాబా అన్న చందంగా బండి వైఖరి ఉంటుంది’ అని దెప్పిపొడిచారు. కేసీఆర్ హయాంలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేశారని, బీజేపీ వాళ్లు చేసిందేమిటని నిలదీశారు. కేసీఆర్ పాలనలో గుడులు కట్టామని, బడులు కట్టామని, కరెంట్ తెచ్చామని, తండాలను పంచాయతీలుగా మార్చామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం కాదని, దండుపాళ్యం ముఠా పాలన కొనసాగుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మాట సురేఖమ్మ బిడ్డనే చెప్పిందని గుర్తుచేశారు. సమ్మక్క, సారక్క జాతరలో రూ.70 కోట్ల పనుల్లో వాటా కోసం మంత్రులు సీతక, సురేఖక, పొంగులేటి కొట్లాడుకున్నారని చెప్పారు. ఇట్లాంటి ప్రభుత్వం ఏ పనీచేయదని, వడ్లు కొనదని, బోనస్ ఇయ్యదని, పింఛన్లు ఇయ్యదని విమర్శించారు. ‘నేను చెప్పింది తప్పనిపిస్తే నాలుగు రోజులు పోతే మీకే అర్థమవుతది. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది. చీకటిని చూస్తేనే వెలుతురు విలువ తెలుస్తది’ అని తెలిపారు. గతంలో మాదిరిగా వీర్నపల్లి మండల వ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ టీ హబ్‌లో ఉద్భవించి భారతదేశపు తొలి స్పేస్-టెక్ యూనికార్న్‌గా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్ రాష్ర్టానికి గర్వకారణమని కేటీఆర్ కొనియాడారు. ఈ ఘనత సాధించిన స్టార్టప్ బృందాన్ని శుక్రవారం ఎక్స్ వేదికగా అభినందించారు. దేశ స్పేస్ టెక్ రంగం నుంచి వన్ బిలియన్ డాలర్ల (సుమారు రూ.8 వేల కోట్లు) కంటే ఎక్కువ విలువను సాధించిన మొట్టమొదటి స్టార్టప్‌గా చరిత్ర సృష్టించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ కేంద్రంగా టీ హబ్‌లో రూపుదిద్దుకొని, ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మన తెలంగాణ ఎకోసిస్టమ్‌కు గర్వకారణమని, భారతీయుల ప్రతిభ, ఆశయాలకు ఉన్న అపారమైన శక్తికి నిదర్శనమని అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మున్ముందు తెలంగాణ, భారతదేశాన్ని ఇలాగే గర్వపడేలా చేయాలని అభిలషించారు. ఈ సందర్భంగా పవన్‌కుమార్ చందన, భరత్ దకా, స్కైరూట్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.