హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ, నిరాధార ఆరోపణలతో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జగదీశ్‌రెడ్డి చెప్పని మాటలను చెప్పినట్టు ఆరోపిస్తూ ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే కాంట్రాక్టులు, కమీషన్లు, ఢిల్లీకి పంపుతున్న మూటల విషయాలు చర్చకి వస్తాయనే భయంతోనే తమ గొంతు నొకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా అంబేదర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిరసన తెలిపిన కేటీఆర్.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంలోని అసత్యాలు, అర్ధసత్యాలను ఎత్తిచూపుతున్న జగదీశ్‌రెడ్డిని ప్రభు త్వం కుట్రపూరితంగానే సస్పెండ్ చేసిందని ఆరోపించారు.
మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేస్తూ ప్రసంగానికి అంతరాయం కలిగించినా జగదీశ్‌రెడ్డి ఏమాత్రం సంయమనం కోల్పోలేదని స్పష్టం చేశారు. ఎండిపోతున్న పంటలు, అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతుబంధు, అమలుకాని ఆరు గ్యారెంటీలు, 420 హామీల వాగ్దాన భంగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం నీతి బాహ్యంగా జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. జగదీశ్‌రెడ్డి అన్‌పార్లమెంటరీ పదాలు వాడలేదని స్పష్టం చేశారు. సభలో తండ్రిగా ప్రతిపక్షం హకులు కాపాడాలని కోరారే తప్ప, అగౌరవపరచలేదని తెలిపారు. 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఆదేశాల మేరకు జగదీశ్‌ను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. వివరణ అడగకుండా, ఏం తప్పు చేశారో చెప్పకుండానే సస్పెండ్ చేయడం కాంగ్రెస్ సర్కారు దురహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సంకెళ్లతో బంధించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని కేటీఆర్ విమర్శించారు. ఒకగొంతు నొకినంత మా త్రాన ఏదో సాధించామని భ్రమపడతున్న కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ.. సీఎం రేవంత్ అహంకార, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చినట్టు తెలిపారు.