ప్రతి ఓటు ఎంతో విలువైనది. ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన ఓటరు పోవద్దు. దొంగ ఓట్లు ఉండొద్దు. మొన్న జూబ్లీహిల్ ఎలక్షన్ అప్పుడు 13వేలు ఉన్నట్టు గుర్తించి ఈసీకి చెప్పాం. కానీ అప్పటికే ఎన్నికల ప్రాసెస్ మొదలుకావడంతో ఏమీ చేయలేదని ఎన్నికల సంఘం చెప్పింది. అందుకే ‘సర్’ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్, బీజేపీ మాదిరిగా దొంగ ఓట్లతో గెలువాలనే భావనలో బీఆర్ఎస్ లేదు. ప్రజలు నిజాయితీగా ఓట్లు వేస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తం.
– కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జూన్ 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పాలన విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనలో మొదటి అంకం(ఫస్ట్ హాఫ్) పూర్తిగా ఫెయిల్ అయ్యిందని, సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయినప్పుడు సెకండ్ హాఫ్‌పై ఎలాంటి ఆశలు ఉండవో, ఈ ప్రభుత్వ పనితీరూ అలాగే ఉందని స్పష్టంచేశారు. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని, ఇప్పుడు ప్రజలు అలాంటి పరిస్థితినే ఎదురొంటున్నారని పేరొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు.. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆరేనని, మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి అవసరమని పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ సిన్సియర్ లీడర్ అని, ఆమె నామినేషన్ రద్దయ్యేలా చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతేనని విమర్శించారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘సర్’ అమలు, ఎలక్షన్ కమిషన్ తీసుకొనే చర్యలు, ఈ సమయంలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టిపెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
మీనాక్షీ నటరాజన్ సిన్సియర్ లీడర్ అని కేటీఆర్ తెలిపారు. ‘మూసీ, హైడ్రా అని అంతా నాశనం చేస్తున్నావు. పార్టీకి చెడ్డ పేరొస్తుందని ఆమె చెప్పిందట. అది మనసులో పెట్టుకొని రేవంత్‌రెడ్డి ఆమెపై పగబట్టినట్టున్నడు.. ఇప్పుడు అవకాశం రాగానే మీనాక్షీనటరాజన్ కేసు వివరాలను బీజేపీ వాళ్లకు ఉప్పందించి చివరకు నామినేషన్ ఎగురగొట్టేలా రేవంత్‌రెడ్డే చేసిండు’ అని ఘాటుగా విమర్శించారు. సొంత పార్టీ వాళ్లకే న్యాయం చేయని వ్యక్తి.. రాష్ర్టానికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హిట్లర్ ఆదర్శం అని చెప్పిన ఆయన నుంచి ఆశించడానికి ఏమీ ఉండదని పేర్కొన్నారు.
సినిమా ట్రైలర్ చూసే అది సక్సెసా? కాదా? అని ముందుగానే చెప్తున్నరు. రేవంత్‌రెడ్డిది 50 శాతం పూర్తయింది, ఫస్టాఫ్ అంతా డిజాస్టార్. ఇక సెకండాఫ్‌లో ఏమీ ఉండదు. పరిపాలన చేతకాదు.. కేవలం కేసీఆర్ మీద పడి ఏడువడం తప్ప. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పుచేసి కనీసం నాలుగు పనులైనా చేశారా?
– కేటీఆర్
సర్ కార్యక్రమం ఇప్పుడు కొత్తగా జరుగడం లేదని, ఇప్పటివరకు దేశంలో 13సార్లు జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇటీవల బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయారని, అక్కడ 95లక్షల ఓట్లను ‘సర్’లో భాగంగా తొలగించారని, బిహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ పార్టీ గెలుస్తుందని చాలామంది భావించినా, ఆ పార్టీ ఓడిపోయిందని, ఆ రాష్ట్రంలోనూ 65లక్షల ఓట్లు తీసివేశారని, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారని, ఆయన సొంత నియోజకర్గంలో 80వేల ఓట్లు తీసివేశారని, అక్కడ ఆయన పది నుంచి 15వేల ఓట్లతో ఓడిపోయారని వివరించారు.
ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ అధికారంలో లేదని, ఇతర పార్టీలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసేందుకు ప్రయత్నిస్తాయని, అందుకే సర్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని దొంగ ఓట్లు ఉండకుండా.. అర్హులవి పోకుండా బాధ్యత వహించాలని సూచించారు. బీఆర్ఎస్ ఎంత శ్రద్ధ పెడితే అంత మేలు జరుగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్లా విజయం సాధిస్తామని, అందులో డౌట్ లేదని, కానీ.. సర్ కార్యక్రమంలో ఎంత గట్టిగా, నిక్కచ్చిగా, నిజాయితీగా పనిచేస్తే అంత మెజారిటీ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ తెచ్చింది కేసీఆరేనని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు.. కానీ, 2001నాటి పరిస్థితులను ఒకసారి నెమరువేసుకుంటే వాస్తవాలు అర్థమవుతాయి. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించే సమయంలో ఎవరూ నమ్మలేని పరిస్థితి. పదవుల కోసమే తప్ప నిజంగా తెలంగాణ కావాలని రాజకీయ నాయకులు కొట్లాడరు అనే భావన ఆనాడు ప్రజల్లో బలంగా ఉండేది. ఆనాడు తెలంగాణ సాధిస్తారంటే విశ్వాసం ఎవరికీ లేదు. ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు, అవాంతరాల నడుమ కేసీఆర్ తన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలైన ప్రయాణం నేడు ఎక్కడివరకు వచ్చిందో ఒక్కసారి అందరం ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. ‘ఆనాడు ఉద్యమ సమయంలో తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్‌రెడ్డి కూడా ఇయ్యాళ మాట్లాడుతున్నడు. తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయనే పుట్టించినట్టు మస్తు మాట్లాడుతున్నడు. కష్టపడ్డది, తెలంగాణ తెచ్చింది మీరైతే.. ఇవ్వాళ తెలంగాణ ఎవరి పాలైందిరో అనే పాట పాడుకొనే దుస్థితి వచ్చింది.’ అని చెప్పారు.
కేసీఆర్ అప్పులు పలు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి చెప్పినట్టు చూసినా.. రూ.200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ రూ.2 వేలకు పెంచారని, 70లక్షల మంది రైతులకు ఖాతాల్లో రూ.73వేల కోట్లు వేశారని, రాజన్న సిరిసిల్ల లాంటి కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలు పెట్టారని, 15లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లికి కల్యాణలక్ష్మి కింద రూ.లక్షా నూట పదహార్లు ఇచ్చారని, వెయ్యి గురుకులాలు ఇచ్చారని, కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టులు కట్టారని వివరించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే నాలుగు లక్షల కోట్ల అప్పులు జేసిన రేవంత్‌రెడ్డి.. ఏం పనులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రూ.4వేల పింఛన్ ఇచ్చారా?, మహిళలకు రూ.2,500 ఇచ్చారా?, తులం బంగారం ఇచ్చారా?, రూ.5లక్షల విద్యాభరోసా కార్డు ఇచ్చారా? విద్యార్థులకు ఏమైనా డబ్బులిచ్చారా? చెప్పాలని నిలదీశారు.
రాష్టంలో రైతుబంధు ఆగిపోయింది కానీ ‘రాహుల్‌బంధు’ మాత్రం జోరుగా నడుస్తున్నదని విమర్శించారు. ‘కాంగ్రెస్లోపైసలు తీసుకొని పోస్టులు అమ్ముకుంటున్నారని నిన్న షబ్బీర్ అలీ చెప్పిండు, రూ.50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ పోస్టును అమ్ముకున్నారని గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నడు, రాహుల్‌గాంధీ కూడా ముఖ్యమంత్రి పదవిని అమ్ముకున్నారు కాబట్టే.. ఎన్ని అక్రమాలు చేసినా రేవంత్‌రెడ్డిని ఏమీ చేయలేని అశక్తతలో ఉన్నారు’ అని కేటీఆర్ విమర్శించారు.
‘నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే’ అని కేటీఆర్ భావోద్వేగంతో చెప్పారు. ఒక రూపాయి పంచకుండా, ఒక చుక మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల అభివృద్ధే లక్ష్యమని చెప్పారు. అధికారం పోయిన తర్వాత కూడా కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని, వారే పార్టీకి అసలైన బలం అని చెప్పారు.
సమావేశాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి తుల ఉమ, గూడూరి ప్రవీణ్, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, ఏనుగు మనోహర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వేములవాడ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి పాల్గొన్నారు.