హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)/ మాచారెడ్డి : వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నాడని, ఓవైపు వరద బీభత్సంతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతుంటే మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ నిర్వహణపై సీఎం సమీక్షించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరుకు లక్ష క్యూసెకుల వరద వస్తుంటే ప్రజలను అప్రమత్తం చేయకుండా వారి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మన రాష్ర్టానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తిరగుతుండటం వల్లే సహాయక చర్యల్లో ఆలస్యమైందని విమర్శించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు, సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మానేరువాగులో చిక్కుకొని అధికారుల సాయంతో సురక్షితంగా బయటికి వచ్చిన రైతు పిట్ల నర్సింహులును, గల్లంతైన రైతు నాగయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. వానకాలం సందర్భంగా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ విపత్తును ముందే ఊహించడంలో ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరిగారు. నాలుగు రోజులపాటు వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినా సర్కారు కండ్లు తెరవకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, నష్టపోయిన పంట ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన ప్రజలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లేదని, వాగులో రైతులు చిక్కుకుపోవడం బాధాకరమని వాపోయారు. గతంలో ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు కూడా ముగ్గురు మంత్రులు ఆ జిల్లా నుంచి ఉండి కూడా అకడికి హెలికాప్టర్ పంపలేక పోవడం వల్లే ప్రాణనష్టం సంభవించిందని గుర్తుచేశారు. ఇవ్వాళ నర్మాలలో నేవీ హెలీకాప్టర్లు వచ్చి వరదలో చికుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాయని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో వరదల్లో చికుకున్న ప్రజలను రక్షించేందుకు సత్వరంగా హెలీకాప్టర్లను పంపి వారి ప్రాణాలను కాపాడిన సందర్భాన్ని గుర్తుచేశారు.
ప్రభుత్వ పెద్దలు మొద్దు నిద్రలో ఉన్నా అధికారులు మాత్రం 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించారని కేటీఆర్ తెలిపారు. వాగులో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నాలు చేసిన అధికారులను అభినందించారు. మీడియా కూడా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందని ప్రశంసించారు. మరో నాలుగు రోజులపాటు వర్షాలు విస్తృతంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం మేలొని ప్రజలను ఆదుకోవాలని హితవుపలికారు. కేంద్రం కూడా స్పందించి రాష్ర్టానికి సాయం చేయాలని విజ్ఞప్తిచేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు తాగునీరు, ఆహారాన్ని అందిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో పార్టీ తరఫున వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అతి భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, పాల్వంచ వాగు ఉప్పొంగి కామారెడ్డికి రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కూడెల్లి, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగులతో పాటు మానేరు ఉధృతంగా రావడంతో కామారెడ్డికి రోడ్డు మార్గాన చేరుకోలేకపోతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని, ఇండ్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లేముందు కేటీఆర్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి ప్రభావిత ప్రాంతాల ముఖ్యనేతలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ హయాంలో వాతావరణ సూచనల ఆధారంగా అనేక సూక్ష్మ అంశాలపై దృష్టిపెట్టేవారమని గుర్తుచేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకొనేవాళ్లమని చెప్పారు. దురదృష్టవశాత్తు రేవంత్రెడ్డి సర్కారు వరదల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో తాత్సారం చేసిందని దుయ్యబట్టారు. అందువల్లే పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చేదాకా యంత్రాంగం కదలలేదని విమర్శించారు.
వరద బాధితులకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అండగా నిలువాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వారికి ఆహారం, తాగునీరు, నిత్యావసర సరుకులు అందజేయాలని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో ప్రజలతో కలిసి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా చూడాలని, అసరమున్నచోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఎక్కడ సమస్యలున్నా సర్కారుకు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కామారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో కామారెడ్డి – కరీంనగర్ ప్రధాన మార్గంపై మాచారెడ్డి మండలంలోని పాల్వంచ సమీపంలో పాల్వంచ వాగు ఉధృతిని పరిశీలించారు. రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతంగా బ్రిడ్జి పైనుంచి ప్రవహించడంతో కామారెడ్డికి వెళ్లడం సాధ్యం కాక అకడి నుంచి తిరిగి సిరిసిల్లకు వెళ్లారు. ఆయన వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులున్నారు.
ఎగువమానేరు ఉధృతిని పరిశీలించేందుకు నర్మాలకు వెళ్లిన కేటీఆర్కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఒకరికొకరు అభివాదం చేసుకొని పలకరించుకున్నారు. అక్కడే ఇరు పార్టీల శ్రేణులు ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. బండి సంజయ్ చెవిలో కేటీఆర్ ఏదో చెప్తుండగా అక్కడ ఉన్నవారు ఆసక్తిగా చూడటం కనిపించింది.