హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): షాద్నగర్ దళిత మహిళ ఘటనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా దాడికి తెగబడతారా? ఇంత కర్కశత్వమా? సిగ్గు.. సిగ్గు.. అని మండిపడ్డారు. కన్న కొడుకు ముందే నికరు తొడిగి, బూట్లతో తంతూ చిత్రహింసలకు గురి చేయటమంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన అంశం వేరే ఏముంది? అని ధ్వజమెత్తారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని, రక్షించాల్సిన పోలీసుల నుంచి ఇలా రక్షణ లేని పరిస్థితి ఏమిటి? అని వాపోయారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు తామేమైనా తక్కువా? అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపు? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదని, దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
విద్యార్థులకు నాసిరకం భోజనమా?
ప్రభుత్వ బడుల్లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించటంలో కాంగ్రెస్ సరారు విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని, పిల్లలు తినేందుకు ఇష్టపడకపోవటంతో వాళ్లకు గొడ్డు కారం, నూనె పోసి భోజనం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.