KTR | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తేతెలంగాణ): ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగిన ఆశ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్శాసన పర్వానికి దిగడం దుర్మార్గమని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న ఆశ కార్యకర్తలను మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, సీనియర్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేవీప్రసాద్ తదితరులతో కలిసి మంగళవారం పరామర్శించారు. తీవ్రంగా గాయపడ్డ రహీమాబీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం వేరే దవాఖానలో చేర్పిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం ఆదేశాలతోనే పోలీసులు మహిళలపై ఇష్టారీతిన దాడులు చేశారని విమర్శించారు. ఈ ఘటనను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నా, హోమంత్రిత్వ శాఖను దగ్గరపెట్టుకున్న ముఖ్యమంత్రి మాత్రం స్పందించకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఆశ కార్యకర్తలపై దాష్టీకానికి దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వేతనం పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం కాంగ్రెస్‌కే చెల్లిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లులపై దాడులకు దిగడం హేయనీయమని, వారి అధినేత్రి సోనియా పుట్టినరోజు నాడే పోలీసులతో దాడులు చేయించడం బాధాకరమని పేర్కొన్నారు. ఏసీపీ, సీఐలు ఆశ కార్యకర్త చీరను లాగేయడం, వ్యాన్లలో ఎక్కించి హింసించడం చూసి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కలతచెందారని చెప్పారు. ఈ ఘటనపై అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్‌ను నిలదీస్తామని స్పష్టంచేశారు. త్వరలోనే సీసీ ఫుటేజీలు, వీడియో ఆధారాలతో ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.