హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లో విత్తనాల కోసం బారులుతీరిన రైతులపై లాఠీచార్జి అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతన్నలపై ప్రభుత్వ దాడి అని మండిపడ్డారు. రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని, లాఠీచార్జి చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతన్నలపై ప్రభుత్వ దాడులను బీఆర్ఎస్ పార్టీ సహించబోదని మంగళవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రాజకీయాలను పకన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని, వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే రాష్ట్రంలో వ్యవసాయరంగం ముఖ్యంగా రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంచేశారు.
సాగునీరు, రైతుబంధు పెట్టుబడి సహాయం, చివరకు కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. రైతన్నలపై లాఠీచార్జి పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పా? అని ప్రశ్నించారు. గత పదేండ్లుగా రాష్ట్ర రైతాంగం ఎలాంటి ఆందోళన పడకుండానే విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు, పెట్టుబడి సా యం.. ఇలా తమకు కావాల్సినవన్నీ సాఫీ గా అందుకున్నదని గుర్తుచేశారు.
ఐదు నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమారు అయిందని, ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలన వైఫల్యమని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నదని విమర్శించారు. రైతులపై ప్రభుత్వ దాడులను సహించేది లేదని, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున విసృ్తతమైన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని ప్రకటించారు.