హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ) : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జనగామలో ఇటీవల జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు అద్దంపడుతున్నదని శనివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఖండించారు. ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి అధికార మత్తులో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే, ఇక్కడ అధికార పార్టీ గూండాలు సాక్షాత్తు మంత్రి సీతక్క సమక్షంలో మద్యం మత్తులో వీధిరౌడీల్లా విధ్వంసం సృష్టించడం శోచనీయమని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరుతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వద్ద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు పెట్టాల్సిన దుస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు.
అరాచకాలకు గుణపాఠం తప్పదు..
సీఎం రేవంత్ స్వయంగా నేరాలను పెంచి పోషించేలా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలోనూ ఆయన పార్టీ కార్యకర్తలు శాంతిభద్రతలకు భం గం కలిగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించా రు. బీఆర్ఎస్తో పాటు తెలంగాణ సమా జం కూడా ఈ గడ్డపై ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని హెచ్చరించారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టారని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పి అధికార పార్టీ అరాచకపర్వానికి ముగింపు పలుకుతారని స్పష్టం చేశారు.