హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడం..ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భౌతిక దాడికి దిగడం దుర్మార్గమని బుధవారం ఎక్స్‌వేదికగా ఖండించారు. దుర్భాషలాడుతూ చేయిచేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని అభివర్ణించారు. ఎంపీ దుశ్చర్య ముమ్మాటికీ ప్రజాతీర్పును అపహాస్యం చేయడమేనని నిప్పులు చెరిగారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతునొక్కేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించడం దురదృష్టకరమని వాపోయారు.
హస్తంపార్టీ నేతల దిగజారుడు రాజకీయాలు, బరితెగింపు విధానాలకు ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలంపూర్ ఎమ్మెల్యేపై జరిగిన దాడితో చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదనే విషయం మరోమారు రుజువైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇలాంటి దుర్మార్గపు, దుందుడుకు విధానాలను సహించబోదని హెచ్చరించారు. వెంటనే ఎంపీ మల్లు రవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులు, దాడులతో కాదు ప్రజాతీర్పుతోనే ఎదుర్కోవాలని స్పష్టంచేశారు.
దాడులు చేస్తే ఊరుకోం : హరీశ్
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు హెచ్చరించారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భౌతికదాడికి దిగడాన్ని బుధవారం ఎక్స్ వేదికగా ఖండించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షం గొంతునొక్కేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ దౌర్జాన్యాలను ప్రజాస్వామిక పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. బాధ్యాతయుతంగా వ్యవహరించాల్సిన ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై దుర్భాషలాడుతూ చేయిచేసుకోవడం దారు ణం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రజాప్రతినిధిపై దాడి ముమ్మాటికీ ప్రజాతీర్పుపై దాడి అని అభివర్ణించారు. మల్లు రవి తక్షణమే క్షమాపణలు చెప్పాలని, దాడి చేసిన కాంగ్రెస్ ఎంపీపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.