KTR | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ, రైతుభరోసాతోపాటు అన్నదాతల ఆత్మహత్యలపైనా తప్పుడు లెక్కలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధును ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ సర్కార్‌కు ఉంటే, కోతలు పెట్టే ఉద్దేశమే లేకుంటే అసెంబ్లీలో చర్చ ఎందుకు? అని ప్రశ్నించారు. రైతు భరోసాపై అసెంబ్లీలో శనివారం చేపట్టిన స్వల్పకాలిక చర్చ, అనంతరం మీడియా పాయింట్లో కేటీఆర్ మాట్లాడారు. రైతుబంధుపై రైతుల్లో ఆందోళన ఉన్నదని, మూడు పంటలకు ఇస్తారో? ఇవ్వరో? స్పష్టంచేయాలని, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతులకు ఎన్ని పంటలకు రైతుబంధు ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘భూ భారతిలో అనుభవదారు..కౌలుదారు కాలం పెట్టారు. మొదటి వంద రోజుల్లోనే కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో రైతుభరోసాపై మంత్రి తుమ్మల నిర్ణయం తీసుకోలేదంటున్నరు. కౌలు రైతులు కండ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నరు. నాడు రేవంత్‌రెడ్డి చెప్పినట్టు కౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వాలి.. కౌలు రైతులకు ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. భూ యాజమానితో సమానంగా 22 లక్షల కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే’ అని కేటీఆర్ తెగేసిచెప్పారు.
అవే 5 వేలిచ్చారు
‘ఎన్నికల ముందు ముష్టి పదివేలు ఎందుకు? ఎకరానికి 15 వేల రైతుభరోసా ఇస్తం అన్నరు. ఇప్పుడు తీసుకుంటే 5 వేలు, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7500 అని చెప్పిండ్రు. ఇప్పటిదాకా రైతుభరోసా వేయలేదు. ఇదే కాంగ్రెస్ నేతలు రైతుబంధు అపాలని ఎన్నికల సంఘానికి లేఖలు రాసిండ్రు. ఎన్నికల కోడ్‌తో మేం ఇవ్వలేకపోయినం. అవే డబ్బులను ఒకసారి రైతులకిచ్చి, రెండుసార్లు ఎగవేసిండ్రు. మార్పు మార్పు అని రైతుబంధు పేరుమార్చి అవే 5 వేలు ఇచ్చిండ్రు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
పాన్ కార్డు ఉన్న రైతులకు ఎగవేస్తరా?
అందరికీ అన్నీ చేస్తామని హామీలిచ్చి ఇప్పుడు కొందరికి కొన్నే అని చెప్తున్నారని సర్కార్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ‘రైతు బంధు పథకం ఉసురుతీయబోతున్నరు. ఊరివేయబోతున్నరు. ఈ రోజుల్లో రుణ వ్యవస్థ అర్హతల ప్రకారం గ్రామాల్లోనూ ఐటీ చెల్లింపులు, పాన్ కార్డులు కలిగిన వ్యక్తులు, రైతన్నలున్నరు. వారందరికీ రైతుబంధు ఎగబెడుతారా?’ అంటూ నిలదీశారు.
‘ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వబోమని చెప్తున్నరు. రైతు బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి అయితే తరతరాలుగా వాళ్లకు భూమితో ఉన్న బంధాన్ని తెపేస్తరా?’ అని ప్రశ్నించారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదికను వెంటనే రాష్ట్రం ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానా మొత్తం అంతా కర్షకుడే మింగేసినట్టు ప్రాపగండా చేస్తున్నారని, గుట్టలకు, పుట్టలకు రైతుబంధు అని చెప్పి అనేక కట్టు కథనాలు రాయించారని విమర్శించారు.
స్థానిక ఎన్నికల్లో బురిడీ కోసమే..
స్థానిక ఎన్నికల్లో రైతులను బురిడీ కొట్టించేందుకే సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తానని ముఖ్యమంత్రి నమ్మబలుకుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే వానకాలం పంటకు ఎగ్గొట్టిన ఆయన ఇప్పుడు ఓట్ల కోసం కొత్త నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి అడగాలని రైతులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో దేనిగురించి అడిగినా రేవంత్‌రెడ్డి ఉక్రోశం వెళ్లగక్కుతున్నారని ఆక్షేపించారు.
రైతుబంధుపై కాంగ్రెస్ దుష్ప్రచారం
రైతుబంధుపై కాంగ్రెస్ భారీగా దుష్ప్రచారం చేసిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో నూటికి 98 శాతం చిన్న రైతులే ఉండగా, చిన్నాపెద్దా తేడాలేకుండా వ్యవసాయ రంగం గాడిన పడేదాకా అందరికీ రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. వ్యవసాయ రంగం స్థిరీకరణ జరిగేదాకా రైతుబంధుపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని గుర్తుచేశారు. ‘మట్టిని నమ్ముకొని బతికే రైతుకు ఎంత చేసినా.. ఏమిచ్చినా తకువే అన్నది మా విధానం. రైతుబంధు లబ్ధిదారుల్లో 91.33 శాతం 5 ఎకరాల కంటే తకువ భూములున్న ఉన్నవారే ఉన్నరు. 5-10 ఎకరాల్లోపున్న మధ్య తరగతి రైతులు కేవలం7.28 శాతమే. 10 ఎకరాలు పైబడిన వాళ్లు 1.39 శాతమే. 25 ఎకరాల పైనున్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమే. 72 వేల కోట్ల రైతుబంధులో పెద్ద రైతులకు పోయింది కేవలం 1.39 శాతమే’ అని కేటీఆర్ వివరించారు. రైతుబంధు పథకంలో రూ.21,283 కోట్లు దుర్వినియోగమైనట్టు బద్నాం చేశారని, ఇది సరికాదని హితవుపలికారు. 11 సీజన్లకు గాను రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమయ్యాయని చెప్పారు.
కల్లాల నిండా ధాన్యం.. కండ్ల నిండా ధైర్యం
‘2014 -15లో ఆర్బీఐ లెకల ప్రకారం తెలంగాణలో సాగు విస్తీర్ణం 34.35 లక్షల ఎకరాలు. 106.86 లక్షల టన్నుల పంట ఉత్పత్తి వచ్చేది. మేము దిగిపోయేనాటికి సాగు విస్తీర్ణాన్ని 34 లక్షల నుంచి 59.8 లక్షలకు చేర్చినం. ఆహార పంటల ఉత్పత్తి 71 లక్షల టన్నుల నుంచి 2 కోట్ల టన్నులకు పెంచినం. 185 శాతం వృద్ధి. రెండు పంటలు కలిపి 1.30 కోట్ల టన్నుల నుంచి 2.2 కోట్ల టన్నులకు పెరిగింది. రైతుబంధు వల్లే ఇది సాధ్యమైంది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, భక్తరామదాసు, సీతారామ ఎత్తిపోతల పథకాలతో మా పదేండ్ల పాలనలో పాడిపంటల తెలంగాణగా, సుభిక్ష తెలంగాణ మార్చినం. సాగునీటి పారకం 2014లో 62 లక్షల 50 వేల ఎకరాలు ఉంటే 2023 నాటికి కోటీ 60 లక్షల ఎకరాలకు చేరింది. 155 శాతం పెరుగుదలతో తెలంగాణలో అదనంగా సూమారు కోటి ఎకరాలను సాగులోకి తెచ్చినం.
సాగు చేయని రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్లే సాగు భారీగా పెరిగింది. వరిలో ఎకడో పది, పదకొండో స్థానం నుంచి ప్రథమస్థానానికి ఎగబాకినం. 2013-14 బియ్యం ఉత్పత్తి 57 లక్షల టన్నులు ఉంటే 2023-24 నాటికి కోటీ 68 లక్షల టన్నులకు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ తెలంగాణ కలిపి కూడా ఎఫ్‌సీఐకి ఇచ్చిన ధాన్యం 90 లక్షల టన్నులు దాటలేదు. కానీ 2021లో ఒక తెలంగాణ నుంచే కోటీ 41 లక్షల టన్నుల వడ్లను ఎఫ్‌సీఐకి ఇచ్చినం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనలేక ఎఫ్‌సీఐ చేతులెత్తేసింది. పదేండ్లలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ అక్షరాల లక్షా 34 వేల కోట్లు. 2014-15లో కోనుగోలు చేసింది 24 లక్షల టన్నులుంటే.. 2022-23లో కోటీ 30 లక్షల టన్నలకు చేరింది. కల్లాల నిండా ధాన్యం, రైతుల కండ్ల నిండా ధైర్యం వచ్చింది’ అని బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగ విజయాలను కేటీఆర్ ప్రస్తావించారు.
రైతు బతుక్కు, భూమికి భరోసా లేదు
‘ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇవ్వాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 700 కోట్ల బోనస్ ఇచ్చి 7,600 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని విమర్శించారు. ‘అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నరు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైంది? 12 నెలలైనా తొలి క్యాబినెట్ జరగలేదా? లేక రాహుల్ అనుమతి రాలేదా?’ అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసా లేదని, రైతు భూమికి భరోసా అంతకన్నాలేదని పొలంలో ఉండాల్సిన రైతు జైలులో ఉండే పరిస్థితి నెలకొన్నదని లగచర్ల రైతులను ఉదహరిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు.
వీటికి ఇస్తరా? ఇవ్వరా?
సాగు భూములకే రైతుబంధు ఇస్తామని చెప్పడం వల్ల అనేక మంది రైతులు రైతుభరోసా కోల్పోతారని కేటీఆర్ చెప్పారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల కింద ఉన్న భూముల్లో ఒక్క పంట సాగుకే అవకాశం ఉంటుందని, గిరిజనులకు రెండో విడత రైతుబంధు ఇస్తరా? లేదా? చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి 45 లక్షల ఎకరాల్లో పండుతున్నదని, పంట కాలం 8 నెలలని, కంది పంట కాలం కూడా 8 నెలలు కాబట్టి పత్తి, కంది రైతులకు ఒక్కసారే ఇస్తరా? రెండు సార్లు ఇస్తరా? చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధుకు కోతలు పెట్టే ఆలోచన లేకుంటే పీఎం కిసాన్ గురించి మంత్రి తుమ్మల ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. ‘పీఎం కిసాన్ మార్గదర్శకాలే మీకు మార్గదర్శకమైతే 25 శాతం మంది రైతులకే రైతు భరోసా వర్తిస్తది. పీఎం కిసాన్ మార్గదర్శకాలు పాటించబోమని మంత్రి తుమ్మల చెప్తున్నారు. ఉన్నది ఉన్నట్టు ఇచ్చేదుంటే చర్చ ఎందుకు? రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మూడు పంటలు సాగు చేసేవారున్నారు. మరి మూడు పంటలకు రైతు భరోసా ఇస్తరా? ఇదే శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మూడో పంటకు ఎందుకు ఇవ్వరని మమ్మల్ని ప్రశ్నించారు. మీరు మూడో పంటకు రైతుబంధు ఇస్తరా? ఇవ్వరా? అనేదానిపై స్పష్టత ఇవ్వాలి’ అంటూ నిలదీశారు.
రైతు ఆత్మహత్యలు తగ్గించినం
‘2014కు ముందు వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దేశంలో తెలంగాణ, విదర్భలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ. రైతు ఆత్మహత్యల్లో మన వాటా 11.1శాతం. అదే 2023కు వచ్చేసరికి 1.05 శాతానికి తగ్గించినం. 2014లో 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 2020లో 466కు తగ్గించినం. ఇదే అత్యల్పమని కేంద్రం కూడా చెప్పింది. వలసలు వాపస్ అయినయి. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ నుంచి కూలీలు మన దగ్గరికి వలసవస్తున్నరు. బొడ్రాయి పండుగకు ఒక్కో ఊర్లో లక్షలు ఖర్చుపెడుతున్నరు. సాగు బాగయ్యింది. వ్యవసాయం బాగయ్యింది కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది’ అని కేటీఆర్ వివరించారు. ‘ఇంత పంట ఎట్ల పండించిండ్రు.. ఏం చమత్కారం చేసిండ్రని కేంద్ర మంత్రి మమ్మల్ని అడిగిండు. చమత్కారం కాదు బృహత్కార్యం చేసినం కాబట్టే రైతు ఆత్మహత్యలు తగ్గినయి. పంటల సాగు పెరిగింది’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
రైతుబంధుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. ఒడిశాలో కాలియా పథకం, బెంగాల్ కృషిబంధు పథకం సహా అనేక రాష్ర్టాలు రైతుబంధును ఆదర్శంగా తీసుకొని నగదు బదిలీ పథకాలు ప్రవేశపెట్టాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ కూడా రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకంలో కేంద్రం అనేక కోతలు పెట్టిందని చెప్పారు. రైతుబంధు పథకం అశోక్ గులాటీ, అరవింద్ సుబ్రహ్మణ్యం, రఘురాం రాజన్, అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థికవేత్తలు, ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) దాకా అందరి ప్రశంసలు అందుకున్నదని, రైతు రందిని మార్చిన గేమ్ చేంజర్ రైతుబంధు అని స్పష్టంచేశారు.
పోయిన యాసంగి 2500, నిన్న వానకాలం 7500, ఇప్పుడు యాసంగి 7500 ఇలా మొత్తం ఒకో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.17,500 బాకీ పడ్డది. రెండు విడతల రైతు భరోసా, ఒక విడత 5 వేలే ఇచ్చి ఎగ్గొట్టిన 2500 కలిపితే రూ.17,500 మేర సుమారు రూ.26,775 కోట్లు రైతన్నలకు సర్కారు బాకీ ఉన్నది. ఈ మొత్తాన్ని రైతులకు ఇచ్చేదాకా వదిలిపెట్టం.
-కేటీఆర్
సాగు భూములకే రైతుబంధు ఇస్తామని చెప్పడం వల్ల అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నరు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల కింద ఉన్న భూముల్లో ఒక్క పంట సాగుకే అవకాశం ఉంటుంది. గిరిజన బిడ్డలకు రెండో విడత రైతుబంధు ఇస్తారా? లేదా? పత్తి పంట కాలం 8 నెలలు. మరి పత్తి రైతుకు ఒకటే పంటకు ఇస్తారా? రెండు పంటలకు ఇస్తరా? కంది పంట కాలం కూడా 8 నెలలు. ఒక్కసారే ఇస్తరా? రెండు సార్లు ఇస్తరా?
-కేటీఆర్
తెలంగాణలో 70 లక్షల మంది రైతులకు.. ఎకరాకు రూ.15 వేల చొప్పున 1.53 కోట్ల ఎకరాలకు గాను రూ.23 వేల కోట్లు కావాలి. కానీ, రైతు భరోసా కోసం కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో కేవలం రూ.15 వేల కోట్లే కేటాయించింది. ఇదే మీ చిత్తశుద్ధికి నిదర్శనం. రైతుభరోసాలో కోతలకు సిద్ధపడిన తర్వాతనే ప్రభుత్వం ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందనేది సుస్పష్టం.
-కేటీఆర్