KTR | హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : గ్రూప్-1పై తాము నిరుద్యోగులపక్షాన లెవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు ఎక్కడా వ్యతిరేకరించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జీవో 29పై తుది తీర్పు వచ్చేదాకా ఫలితాలు విడుదల చేయవద్దని, పిటిషన్‌పై వేగంగా విచారణ చేయాలని హైకోర్టుకు సూచించిందని చెప్పారు. కోర్టుల్లో కేసులు తేలేదాకా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు జీవో-29 తూట్లు పొడుస్తున్నదని మండిపడ్డారు. కాబట్టి దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదిని నియమించి, హైకోర్టులో వాదనలు వినిపిస్తామని చెప్పారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాలేరు వెంకటేశ్, కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బాల్కసుమన్, గాదరి కిషోర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రూప్-1పై సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్ అని చెప్పారు. ‘ఇటీవల అభ్యర్థుల కోరిక మేరకు నేను అశోక్‌నగర్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వందల సంఖ్యలో పోలీసులు ఇక్కడ మోహరించారు. మేమే మీ దగ్గరికి వస్తాం అని అభ్యర్థులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. సాయం చేయాలని మమ్మల్ని కోరారు. అప్పటికే ఆలస్యమైనా ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ నేతృత్వంలో 10 మంది అభ్యర్థులను ఢిల్లీకి పంపిం చాం. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌తో మాట్లా డి పిటిషన్ వేశాం. అర్జంట్ మెన్షన్ కోరితే శుక్రవారం కేసు విచారిస్తారని భావించాం. కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పరీక్ష ప్రారంభమైన నేపథ్యంలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించినా, ఇదే సమయంలో రెండు మంచి మాటలు చెప్పింది. హైకోర్టులో రిట్ పిటిషన్‌పై తుది తీర్పు వెలువరించేదాకా ఫలితాలు ప్రకటించొద్దని టీజీపీఎస్సీని ఆదేశించింది’ అని కేటీఆర్ వివరించారు. రిట్ పిటిషన్‌పై తొందరగా నిర్ణం తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో జీవో-29పై కేసులో బీఆర్ఎస్ కూడా ఇంప్లీడ్ అవుతుందని స్పష్టంచేశారు.
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ వచ్చి ఓట్ల కోసం రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ప్రగల్భాలు పలికిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అటు ఇటు ఏడాదవుతున్నది. మరి ఈ ఉద్యోగాలు ఎక్కడపోయినయ్. ఢిల్లీలో ఉన్న రాహుల్‌గాంధీ రెండు లక్షల ఉద్యోగాల లెక్కలతో అశోక్‌నగర్ వస్తే సన్మానించేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నరు.
-కేటీఆర్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా 95 శాతం పోస్టు లు లోకల్ అభ్యర్థులకు దక్కేలా కేసీఆర్ ప్రభుత్వం జీవో-55 తీసుకొచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు న్యాయం కల్పించామన్నారు. కానీ ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ప్రభు త్వం జీవో 29ని తెచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలకు అన్యాయం చేస్తూ, తెలంగాణేతరులకు ప్రయోజనం కల్పించిందని విమర్శించారు. ఓపెన్ కోటా అనేది ఎవరికీ రిజర్వ్డ్ కాదని, కానీ జీవో 29 రిజర్వ్డ్గా మారిందన్నారు. ఈ జీవోతో అన్యాయం జరుగుతుందని జూన్, జూలై నుంచే చెప్తున్నామన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ పలుమార్లు ప్రెస్‌మీట్ పెట్టి, వినతుల రూపంలో ప్రభుత్వానికి వివరించారన్నారు. అయి నా ప్రభుత్వం మూర్ఖపు వైఖరి అవలంబించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మెయిన్స్ రాస్తున్నారని, ప్రభుత్వం వారిని ప్రశాంతంగా ఉండనీయలేదని, బలహీన వర్గాల పట్ల తన వ్యతిరేకతను నిరూపించుకున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, ఇవ్వలేదని విష ప్రచారం చేశారని, అశోక్‌నగర్‌కు పోయి.. చాయ్ తాగి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఇప్పుడు అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. గ్రూప్-1తోపాటు జీవో 46 బాధితులకు అండగా సుప్రీంకోర్టులో పోరాడుతామని, గ్రూప్-4లో పోస్టులు బ్యాక్లాగ్ పోకుండా కొట్లాడుతామని స్పష్టంచేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో నందినగర్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ వెళ్లి నిరుద్యోగులకు ఏడాదిలో ఇస్తామని హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏవని కేటీఆర్ నిలదీశారు. రాహుల్ వచ్చినప్పుడు తాము సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తే, ఇప్పుడు ప్రజాపాలన అని గొప్పలు చెప్తున్న సర్కారు తమను ఎందుకు అడ్డుకుంటున్నదని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్తున్న ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పైన దామగుండంలో రాడార్ స్టేషన్ తెచ్చి మూసీని చంపేసి, ఇటు చివర రామన్నపేటలో అదానీకి చెందిన కాలుష్యకారక పరిశ్రమకు అనుమతులిచ్చి మధ్యలో సుందరీకరణ పేరిట రంగులేసి లక్షన్నర కోట్లు లూటీ చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తున్నది. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నా మాట్లాడవద్దంటే ఎలా? మూసీ విషయంలో పోరాడాల్సిన బాధ్యత మాకంటే మీడియాపైనే ఎక్కువ ఉన్నది.
-కేటీఆర్
రైతుబంధుకు నిధుల్లేవంటున్న ప్రభుత్వానికి మూసీలో పోసేందుకు లక్షన్నర కోట్లు ఎక్కడివి అని కేటీఆర్ నిలదీశారు. ఈ ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణానికి పాల్పడుతున్నదని విరుచుకుపడ్డారు. మూసీ లూటీని కవర్ చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నదని విమర్శించారు. ‘జర్నలిస్టులంటే మాకు ఎంతో గౌరవం.. వారిని అవమానించానని కొందరు చెప్పడం పూర్తిగా అబద్ధం. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఉద్యమకాలంలో అనేక మంది జర్నలిస్టులతో కలిసి పనిచేసినం. బీఆర్ఎస్ హయాంలో చాలమంది మీడియా మిత్రులకు ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశమిచ్చినం’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
జీవో 29 రాజ్యాంగ విరుద్ధమని, లోకల్ కోటాలో నాన్ లోకల్ వారికి అవకాశాలిస్తున్నారని గ్రూప్-1 అభ్యర్థులు ఆధారాలు చూపుతూ రీషెడ్యూల్ చేయాలని కోరితే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఎగ్జామ్స్ వాయిదా విషయంలో మూర్ఖంగా, మొండిగా వ్యవహరించింది. ప్రభుత్వం భేషజాలకు పోయి గ్రూప్-1 అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. వాళ్లు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయకుండా చేసింది.
జీవో 29ని రద్దు చేయాలని సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన గిరిజిన విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు – బంజారాహిల్స్
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడు.. రేవం త్ ప్రభుత్వాన్ని మంత్రులు కూల్చేస్తామంటే బండి తెగ బాధపడిపోతున్నడు’ అంటూ కేటీఆర్ ఎద్దేవాచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఒకలా తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘అక్కడ సీఎం సిద్ధరామయ్య మా ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కుట్ర లు చేస్తున్నదని చెబుతుంటే..ఇక్కడ మాత్రం రేవంత్ కేంద్రంతో సఖ్యతను కొనసాగిస్తున్నారు’ అంటూ ఉదహరించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నదని ఆరోపణలు వస్తున్నా, పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరిగి 20 రోజులు దాటినా కేంద్రం పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శమని చెప్పారు. ముత్యాలమ్మ గుడిపై దాడిని ఖండిస్తూ ట్వీట్ చేసిన తనపై సైబర్ క్రైం పోలీసులతో ట్విట్టర్‌కు ఫిర్యాదు చేయించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని గుర్తుచేశారు.