హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి ముఖం చూసి రాష్ట్ర ఓటర్లు ఎవరూ ఓట్లు వేయలేదని, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎవరూ కోరుకోలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేమెంట్, మేనేజ్మెంట్ కోటాలో రేవంత్‌రెడ్డి సీఎం సీటు కొనుక్కున్నారని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు శక్తిమంతుడివి అనుకుంటే మహబూబ్‌నగర్ ఎంపీ సీటును ఎందుకు గెలిపించుకోలేదు? నువ్వు ప్రజానాయకుడివైతే ఎంపీగా ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యేనైనా ఎందుకు గెలిపించుకోలే?, ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ అయినా, కార్పొరేటర్‌ను అయినా ఎందుకు దక్కించుకోలేకపోయినవ్? అని నిలదీశారు.
‘2034 కాదు.. 2054 దాకా సీఎంగా ఉండు.. నీ పార్టీకి నువ్వు అడ్డగోలు పైసలు ఇస్తున్నవ్. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారింది. బీజేపీ నిన్ను పట్టుకోదు. దానికి మీకు మంచి ఫెవికాల్ బంధం నడుస్తున్నది. రేవంత్‌రెడ్డి అయినా, ఇంకొరైనా ఎవరైనా కలలు కనవచ్చు. కలలు కనండి.. కానీ, కథలు చెప్పకండి. పిట్టకథలు, లొట్టకథలు చెప్పే అధికారంలోకి వచ్చిండ్రు. పెట్రోల్ మీద కేసీఆర్ రూ.36 తీసుకుంటున్నారు అన్నారుగా? ఇప్పుడు తగ్గిస్తే ఎవరు వద్దంటున్నారు’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అని అందరూ అనుకుంటున్నారేమో. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం కావడం వల్లే ఆ పార్టీ కంటే కాక్రోచ్ బెటర్ అని అనుకుంటున్నారేమో.
-కేటీఆర్
నిజంగా రేవంత్‌రెడ్డికి 2034 వరకు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉంటాననే ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామా? అని కేటీఆర్ సవాల్ చేశారు. ‘రాష్ట్రంలో అద్భుతమైన పాలన ఉన్నట్టు ప్రజలు అనుకుంటున్నారని మీరు భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం.. ప్రజలు తీర్పు ఇస్తారు. మేము రాజీనామా చేస్తాం. మీరూ రాజీనామా చేయండి. బీజేపీవాళ్లు రాజీనామా చేయకపోయినా అసెంబ్లీ డిజాల్వ్ అయిపోద్ది. సీఎం రెడీగా ఉంటే మా పార్టీకి చెందిన 27 మంది సభ్యులం రాజీనామా చేస్తాం. మీ కాంగ్రెస్ సభ్యులతోపాటు మా పార్టీ నుంచి మీ పార్టీలో చేరినవారితో కూడా రాజీనామా చేయించు. ఎన్నికలకు పోదాం. అంతధైర్యం లేకపోతే, కనీసం మా పార్టీ నుంచి గుంజుకున్న తొమ్మిది మందితో అయినా రాజీనామా చేయించు ఎన్నికలకు వెళ్దాం. ప్రజానాయకుడివని భావిస్తే కనీసం ఈ పని అయినా చెయ్’ అని సవాల్ విసిరారు
కలలు కను.. కథలు చెప్పకు. నీకు 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాననే ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామా? నీకు నిజంగా నమ్మకం ఉంటే, రాష్ట్రంలో అద్భుత పాలన ఉన్నట్టు ప్రజలు అనుకుంటున్నారని నువ్వు భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదాం. ప్రజలే తీర్పు ఇస్తరు. మేము రాజీనామా చేస్తం. మీరు రాజీనామా చేయండి.
-కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వే (కులగణన) బాగా జరిగినట్టు ఒక్కరితో, ఒక్క ఎన్యుమరేటర్‌తో అనిపించినా దేనికైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరా రు. ‘రేర్ మాడల్ అన్నరు.. రూ.160 కోట్లు ఖర్చు పెట్టారు. చివరికి 51 శాతం ఉన్న బీసీలను 46 శాతానికి తగ్గించారు. ఇదేనా రేర్ మాడల్?’ అని ప్రశ్నించారు. బీసీల గొంతు కోసి ఉన్నది లేనట్టుగా చేయడమేనా సీపెక్ సర్వే అని నిలదీశారు. 42 శాతం రిజర్వేషన్లు ఫెయిలయ్యాయని, సామాజిక న్యా యం కొరవడిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 24 శాతం ఉన్న రిజర్వేషన్లు 17 శాతానికి ఈ రేర్ మోడల్ వల్ల తగ్గిందని విమర్శించారు. అట్టర్ ఫ్లాప్ మోడల్ దేశానికి ఆదర్శమైతే మన దేశాన్ని ఇక ఆ దేవుడే కాపాడాలి! అని వాపోయారు.
ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసమనే నిబంధనలతో భూమిని సేకరించినట్టు గుర్తుచేశారు. నాచురల్ గ్యాస్ వాడుతామని, కర్బన ఉద్గారాలు, కాలుష్యానికి అవకాశం ఉండబోదని నిబంధన ప్రకారం 14,000 ఎకరాలకు కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతి తీసుకున్నట్టు తెలిపారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిలో ఇప్పుడు రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని విమర్శించారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి అయినందున దాన్ని వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదనే విషయాన్నే హరీశ్‌రావు చెప్పారని పేర్కొన్నారు.