జగిత్యాల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జననేతగా జీవన్‌రెడ్డికి పేరుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఆయన బీఆర్ఎస్తో కలిసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని, సాదరంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గురువారం జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇంటికి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నేతలతో కలిసి కేటీఆర్ చేరుకున్నారు. ఆయనతో గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌తో జీవన్‌రెడ్డికి మంచి అనుబంధం, స్నేహం ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రజల మోముల్లో చిరునవ్వులు తిరిగి రావాలంటే కేసీఆర్ పాలన రావాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి సైతం కోరుకుంటున్నారని, అందులో భాగంగానే బీఆర్ఎస్తో కలిసి ప్రయాణం సాగించేందుకు ఆయన సిద్ధపడ్డారని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జీవన్‌రెడ్డి లాంటి అనుభవం, ప్రజా సంబంధాలు కలిగిన రాజకీయ నేత ఉండాలని కేసీఆర్ గతంలోనే అభిలాషించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ ద్వారా జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. అయితే నిబద్ధత కలిగిన నాయకుడిగా జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిపారు. అయినా నాటి నుంచి నేటివరకు కేసీఆర్, జీవన్‌రెడ్డి మధ్య వ్యక్తిగత అభిమానం, గౌరవం అలాగే కొనసాగాయని చెప్పారు.
జీవన్‌రెడ్డి 2014లో బీఆర్ఎస్ హవాను తట్టుకొని సైతం ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి విజయం సాధించారని చెప్పారు. 2014 జూన్ 2న సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాల పర్యటనను ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోనే ప్రారంభించారని గుర్తు చేశారు. కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తామంతా ఆసక్తిగా సమావేశాన్ని గమనించామన్నారు. సీఎం హోదాలో కేసీఆర్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన జీవన్‌రెడ్డికే తొలిసారిగా మాట్లా డే అవకాశం ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆనాటి ప్రసంగంలో జగిత్యాల జిల్లాలో గోదావరినదిపై బోర్నపెల్లి-చిన్నబెల్లాల గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేయాలని జీవన్‌రెడ్డి కోరారని గుర్తు చేశారు.
ప్రతిపక్ష నాయకుడు చేసిన విజ్ఞప్తిపై కేసీఆర్ నిమిషాల వ్యవధిలోనే రూ. 75 కోట్లను మంజూరు చేశార ని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి జీవన్‌రెడ్డి ప్రస్తావించిన సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ, షుగర్ ఫ్యాక్టరీలను సహకార రంగంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినట్టుగా తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.300కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, సంఘానికి జీవన్‌రెడ్డే అధ్యక్షుడిగా కొనసాగాలని కోరారని గుర్తుచేశారు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఎంత కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లో పిల్లలు పుట్టించగలడా..? అని వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలపై నిలదీస్తే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అసభ్యకరమైన, అహంకారపూరితమైన ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి అధికార మత్తులో పెద్దలు కేసీఆర్‌ను, తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పెద్దలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఆయన పనితీరుపై నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సైతం విసిగిపోయారని విమర్శించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి తాను హాజరైన సందర్భంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఈ విషయాన్ని తనతో పంచుకున్నారని తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారే చెబుతున్నారని వివరించారు.
మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్లోకి సా దరంగా ఆహ్వానిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సూచనల మేరకు జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ అవుతారని, తర్వాత పార్టీలో చేరే తేదీతో పాటు ఇతర అంశాలన్నీ ఖరారు అవుతాయని తెలిపారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం, గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జగిత్యాలలో ఉంటుందా..? అని పాత్రికేయులు ప్రశ్నించగా, తినబోతూ రుచి అడగడం ఎందుకు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
జీవన్‌రెడ్డిని ఆహ్వానించాలనుకున్న సమయంలో బీఆర్ఎస్ జిల్లా శాఖ చూపిన ఐక్యత, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. జీవన్‌రెడ్డిని పార్టీలోకి విషయాన్ని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మె ల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంతాసురేశ్కు తెలుపగా వారు సంతోషించారని పేర్కొన్నారు. గురువారం వారంతా తరలివచ్చి మద్దతు పలుకడం సంతోషంగా ఉందని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలనపై ప్రజల్లో ఆక్రోశం వెల్లువెత్తుతున్నదని కేటీఆర్ స్పష్టంచేశారు.ప్రజా సమస్యల దృష్టి మళ్లింపు రాజకీయాలు తప్పా సీఎం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏవీ లేవని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల కాలంలో మూడుసార్లు రైతుబంధును విజయవంతంగా ఎగ్గొట్టారని పేర్కొన్నారు. పంటకు రూ.9వేల కోట్ల చొప్పున లెక్కించినా 27 వేల కోట్ల రూపాయలు రైతబంధు పేరిట 70 లక్షల మంది రైతులకు రేవంత్ సర్కార్ బాకీ పడిందని తెలిపారు.