ఏడాదిగా నవ్వడమే మరిచిపోయిన లగచర్ల మురిసింది! తమ భూమి కోసం సర్కారుతో, రాజకీయ దళారులతో, పోలీసులతో లడాయి చేస్తున్న జనంలో.. చాలారోజుల తర్వాత ఆనందం వెల్లివిరిసింది. వారి నవ్వుల్లో ఒక ‘గులాబీ రంగు’ ధైర్యం కనిపించింది. లగచర్ల గిరిజన పోరాటానికి భుజం కలిపినట్టుగానే.. బాధిత, పీడితుల పక్షాన నిలిచి ఎందాకైనా కొట్లాడుతామని రైతుదీక్ష ద్వారా బీఆర్ఎస్ భరోసా కలిగించింది.
ముఖ్యమంత్రి రేవంత్ సొంతగడ్డపై బీఆర్ఎస్ తొడగొట్టింది. కొడంగల్ నియోజకవర్గంలో నిలబడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణగర్జన చేశారు. ఆయనకు అడుగడుగునా జనం నుంచి అపూర్వ ఆదరణ, ఘనస్వాగతం లభించాయి. నిరసన దీక్షకు వచ్చిన ఫార్మా బాధితులు.. ముందున్న లగచర్ల గిరిజనులు.. వేదిక మీదున్న పట్నం వంటి నేతలు.. అందరూ కాంగ్రెస్ సర్కారు కర్కశానికి బాధితులే. కేసులు, జైళ్ల మధ్య రోజులతరబడి నలిగినవాళ్లే. సర్కారుపై మర్లవడ్డ జనం ఇంకా చల్లబడలేదనడానికి, మళ్లీ మరుగుతున్నారనడానికి కోస్గి సభ ఓ సంకేతం! ఓ హెచ్చరిక!!
KTR | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కౌరవుల రాజు దుర్యోధనుడు ఏట్లయితే దుర్మార్గాలు, అరాచకాలు చేసిండో అట్లాగే సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలిస్తున్నడు.. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయన అరాచకాలపై జరుగుతున్న భూ పోరాటం కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తున్నది.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. కొడంగల్ ఆడబిడ్డలు అన్యాయానికి ఎదురొడ్డి నిలిచారని కొనియాడారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో సోమవారం నిర్వహించిన రైతు నిరసన దీక్షలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు.
కొడంగల్‌లో 14 నెలల నుంచి కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నదని చెప్పారు. ‘మీరంతా నాడు ఎంతో ఆశతో మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం బాగుపడ్తదని ఓట్లేసి గెలిపించిండ్రు.. మరి ఈ 14 నెలల్లో రేవంత్‌రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నడో ఒక్కసారి ఆలోచించాలె’ అని సూచించారు. కోస్గికి వస్తుంటే దారిలో లగచర్ల పరిధి ప్రారంభమని పెద్ద బోర్డు కనిపించిందని, అక్కడ ఆగి చూస్తే పచ్చని వరి పంటలు.. బ్రహ్మాండంగా విస్తరించి ఉన్నాయని చెప్పారు.
కొడంగల్ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టయని రేవంత్‌రెడ్డి అన్నారని, ముఖ్యమంత్రి ఎవరైనా ఇలా అబద్ధం చెప్తరా అని నిలదీశారు. ‘రైతుబంధు రానోళ్లు, రుణమాఫీ కానోళ్లు చేతులెత్తండి అనడంతో పెద్దఎత్తున రైతులు చేతులెత్తారు. ‘మీ కొడంగల్‌కు కూడా స్పెషల్‌గా ఏం ఇస్తలేడా? ఎవరికేం ఇయ్యకున్నా కొడంగల్ మాత్రం ఇస్తున్నడేమో అనుకున్న.. అది కూడా లేదా? మరి ఎవరికేం ఇచ్చిండు? 14 నెలల్లో ఒక్కటి మాత్రం బాగిచ్చిండు.. అల్లుడికి మాత్రం కట్నం కింద లగచర్ల భూములిచ్చిండు.. వాటికి సూటి పెట్టిండు’ అంటూ దెప్పిపొడిచారు. ‘అదానీ కంపెనీ.. అల్లుడి కంపెనీ కోసం భూములు గుంజుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి కుతంత్రాలు చేస్తున్నది’ అంటూ మండిపడ్డారు. భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డవారిపై కలెక్టర్ మీద హత్యాప్రయత్నం చేశారని ఆరోపిస్తూ సుమారు 70 మందిపై కేసులు పెట్టారని, కాంగ్రెస్ వాళ్లను, బీజేపీ వాళ్లను కట్ చేసి ఒక్క బీఆర్ఎస్ వాళ్లు 40 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారని, పట్నం నరేందర్‌రెడ్డితో సహా తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మా కొడంగల్ భూములల్ల తొండలు కూడా గుడ్లు పెట్టవని రేవంత్‌రెడ్డి అన్నడు కదా.. నిజమే అయుండొచ్చని కోస్గికి వస్తుంటే నేను మా సబితక్క, నరేందర్‌రెడ్డి, అందరం దిగి చూసినం. లగచర్ల పరిధి ప్రారంభమని బోర్డు ఉన్నది.. ఎక్కడ చూసినా పచ్చని వరి పంటలు.. బ్రహ్మాండంగా ఇక్కడ్నుంచి అక్కడి దాక విస్తరించి ఉన్నయి.. ముఖ్యమంత్రి అన్నోడు అబద్ధం చెప్తడా? కొడంగల్ భూములల్ల తొండలు గుడ్లుపెడ్తున్నయా? పంటలు పండుతున్నయా?
– కేటీఆర్
‘ఇయ్యాల ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియెజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తదా? ఎప్పుడు కాంగ్రెను బొందపెడుదామా? అని చూస్తున్నరు. రేవంత్‌రెడ్డికి బంపర్ ఆఫర్ ఇస్తున్న.. నువు అంటున్నవ్ గదా.. కులగణన చేసిన బీసీలంతా సంతోషంగా ఉన్నరు.. రైతుబంధు ఏసిన రైతులంతా సంతోషంగా ఉన్నరు.. రైతు కూలీలకు పైసల్ ఏసినా వాళ్లంతా సంతోషంగా ఉన్నరు.. ఇండ్లకు కాయితాలు ఇచ్చిన.. పేదోళ్లు సంతోషంగా ఉన్నరు అంటున్నవ్ గదా? దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక్కడికి రా.. ఎవరు గెలుస్తరో చూద్దాం’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘పట్నం నరేందర్‌రెడ్డి నామినేషన్ వేసి ఇంట్ల కుసుంటడు.. మేము, జిల్లా నాయకులం కొంతమందిమి తిరుగుతం.. 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువైనా నేను రాజకీయ సన్యాసం తీసుకుంట.
ఇక రాజకీయంలోనే ఉండ’ అంటూ సవాల్ విసిరారు. ఒక్క కొడంగలే కాదని, రాష్ట్రం మొత్తంలో వాస్తవ ముఖచిత్రమిదని చెప్పారు. ‘నువ్వేదో అడ్డిమార్ గుడ్డిదెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయి.. ఇగ ఇంతకంటే పెద్దోడు ఎవడూ ప్రపంచంలో లేడన్నట్టు ఏడబడితే ఆడ భూమి గుంజుకుంట.. ఏది పడితే అది అబద్ధం చెప్తా.. ఇదివరకే చెప్పినట్టు 420 హామీలిచ్చి మళ్ల మోసం చేస్తనంటే కుదరదు’ అని హెచ్చరించారు. ఏ ఒక్క ఊరిలో వందశాతం రుణమాఫీ అయినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని మళ్లీ కనబడకుండా వెళ్లిపోతానని చెప్పా రు. ‘కోస్గికి వస్తుంటే ఎక్కడ చూసినా జనమే జనం.. మేం వెళ్తున్నది నిరసన దీక్షకా? లేక ఉప ఎన్నిక జరిగి రేవంత్‌రెడ్డి ఓడిపోయి నరేందర్‌రెడ్డి గెలిచిపోయి జులూస్ తీస్తున్నమా? అర్థం కాలేదు.. ఆడికెల్లి ఈడికి రానీకే గంట పట్టింది. నా చేతులు అటు గుంజి ఇటు గుంజి గోరు విరిగిపోయి రక్తం వస్తున్నది’ అని చూపించారు.
రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిఇక్కడికి రా.. ఎవరు గెలుస్తరో చూద్దాం.. నీకు మాటిస్తున్నం. మేము ఇంత మందిమి ప్రచారానికి కూడా రాము. మా పట్నం నరేందర్‌రెడ్డి నామినేషన్ వేసి ఇంట్ల కూసుంటడు.. బయటికిగుడ రాడు. మేమో జిల్లా నాయకులమో కొంతమందిమి తిరుగుతం. గెలుసుడు కాదు నేనే చెప్పేది.. 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం చేసి మళ్లా రాజకీయంలోనే ఉండకుంట పోతా
– కేటీఆర్
‘రేవంత్‌రెడ్డిని నేను దుర్యోధనుడు అని ఉత్తగ అనలే.. పాండవులను ఊళ్లల్లో ఉండనీయకుండా అడవికి పంపిండు.. అట్లనే రేవంత్ కూడా మా ఆడబిడ్డలను తండాల్లో ఉండనీయకుండా అర్ధరాత్రి తండాల మీద పడి.. వాళ్ల తలుపులు ఇరగ్గొట్టి.. ఆ డోళ్లను అవమానించి పుట్టకొకలు.. చెట్టుకొకలు అన్నట్టు జంగల్పొంట ఉరికిచ్చిం డు. అందుకే రేవంత్‌రెడ్డి దుర్యోధనుడు అంటున్న’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
‘భూములు కోల్పోతున్న గిరిజనులకు అండగా నిలబడ్డం.. వాళ్లను ఢిల్లీ దాకా తీసుకెళ్లి జరిగిన ఘోరాన్ని జాతీయ కమిషన్ ముందు చెప్పినం.. 40 రోజుల తర్వాత న్యాయం గెలిచి రైతులకు బెయిల్ వచ్చింది.. వాళ్లందర్నీ బయటకు తీసుకొచ్చినం’ అని గుర్తుచేశారు. హకీంపేటలో టెంట్ వేసుకున్న గిరిజన మహిళల దగ్గరికి వెళ్లగా ‘అన్నా.. మా భుములు పోకుండ జర సూడండ్రి’ అని కేటీఆర్‌ను వేడుకున్నారు.
‘సోషల్ మీడియా, వాట్సాప్‌లో వస్తున్న వీడియోలు ప్రజలు మాట్లేడేవి చూస్తుంటే ఏం తిట్లయా అవి.. మనిషన్నోడైతే బకెట్ల రెండు మగ్గుల నీళ్లు పోస్కొని దుంకి సచ్చిపోతుండె.. రేవంత్‌రెడ్డి కాబట్టి నడుస్తాంది.. రోషం లేని బతుకు కాబట్టి నడుస్తాంది’ అంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ‘తెలుగు భాషలో అన్ని తిట్లుంటవని కూడా తెల్వదు.. గొట్టం పెడితేచాలు అటు ఏడుతరాలు.. ఇటు ఏడుతరాలు తిడ్తుండ్రు.. దయచేసి తిట్టకండి.. ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం ఇవ్వండి’ అని సూచించారు. ‘ఎన్నికల్లో మాత్రం ఈ మోసగాడికి గట్టిగా బుద్ధి చెప్పండి.. కాంగ్రెస్ పార్టీకి కూడా గట్టిగా బుద్ధి చెప్పండి’ అని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు ఎకరం వరకు రైతుబంధు వేసిండని, ఎలక్షన్లు కాగానే రైతుబంధుకు రాంరాం అంటాడని వివరించారు. రేవంత్ రాష్ట్రంలోని ప్రతిరైతుకు రూ.17,500 బాకీ ఉన్నాడని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డి రైతుబంధు వేస్తడా? అని మా సబితక్క నవాబ్‌పేట ధర్నాలో అడిగితే ఒక రైతు లేచి అక్కా అక్కా పక్కా రేవంత్‌రెడ్డి రైతుబంధు వేస్తడు.. ఫిబ్రవరి 31లోపు అన్నడు.. ఇట్లుంటది ఆయన తీరు’ అని ఎద్దేవాచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోస్గికి వచ్చిండు.. వచ్చి ఏం చెప్పిండు? టకీటకీమని రైతు భరోసా డబ్బులు పడ్తయన్నడు. మేము నిజమే అనుకుంటిమి. ఓట్లేసి గెలిపించినోళ్లకు ఎందుకు అబద్ధం చెప్తడులే అనుకున్నం. ఇప్పుడు టకీ లేదు.. గికీ లేదు.. ఇప్పటి దాకా ఏదీ దిక్కులేదు.
– కేటీఆర్
‘పేదోళ్ల భూములను అదానీ కోసం.. అల్లుడి కోసం దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నవ్.. నీ సొంత భూములు ఉన్నయ్ కదా? అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టు’ అని కేటీఆర్ సూచించారు. ఎకరాకు దాదాపు రూ.80 లక్షలు పలికే భూములకు రూ.20 లక్షలు ఇచ్చి కొంటామంటున్నవ్. వెల్దండ దగ్గర నీ భూములకు రూ.25 లక్షలు ఇచ్చెయ్.. కావాలంటే బీఆర్ఎస్ తరఫున నీకు ఆపై రూ.5 లక్షలు ఇస్తం’ అని ఆఫర్ ఇచ్చారు. ‘నీ భూములు అట్లే ఉండాలె.. పేదోళ్ల భూములు కావాల్నా?’ అని ప్రశ్నించారు. రైతు నిరసన దీక్ష అనంతరం కేటీఆర్‌కు గిరిజనులు నాగలిని బహూకరించారు. కోస్గి రైతు దీక్షకు హాజరయ్యేందుకు వెళ్తుండగా హకీంపేట వద్ద వేచి చూస్తున్న గిరిజన రైతులకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఫైనాన్స్ కమిషన్ మాజీ సభ్యుడు సలీం, రామకృష్ణ, వెంకటనర్సింహులు పాల్గొన్నారు.
14 నెలల నుంచి రేవంత్‌రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నడో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలె. రైతులు, మహిళలు, పేదల కోసం సీఎం ఒక్క పని చేసింది లేదు. యువత కోసం చేసిందేం లేదు. ఎవల కోసం పనిచేస్తున్నడంటే ఎనుముల అన్నదమ్ముల కోసం.. ఆయన అల్లుడి కోసం.. అదానీ కోసం.. బావమర్దుల కోసం.. ఆయన కుటుంబ సభ్యులకు వందల, వేల కోట్లు దోచిపెట్టేందుకు.. ఇక్కడి భూములు గుంజుకొనేందుకు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నడు.
– కేటీఆర్
మొన్నటి వరకు తమ భూములు తమకు కావాలంటూ లడాయి చేసిన లగచర్ల.. కేటీఆర్ రాకతో ఉప్పొంగిపోయింది. లగచర్ల రైతులకు మొదటి నుంచీ అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిసి ఉదయం నుంచే లగచర్లలో పండుగ వాతావరణం నెలకొన్నది. గిరిజనుల ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలు, హారతులతో కేటీఆర్‌కు లగచర్ల, హాకీంపేట, రోటిబండతండా, పోలేపల్లి రైతులు హాకీంపేట వద్ద ఘన స్వాగతం పలికారు. సోమవారం కోస్గిలో రైతు దీక్షకు వెళ్తూ తుంకిమెట్ల వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్, అనంతరం హాకీంపేట వద్ద లగచర్ల రైతులను కలుసుకున్నారు.