KTR | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో అందరికీ రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ చెప్తున్న రుణమాఫీ ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లోని ఏ గ్రామానికైనా వెళ్దామని, వందశాతం రుణమాఫీ అయిందని ఒక్క రైతు చెప్పినా తాను అక్కడే రాజీనామా చేసి స్పీకర్‌కు లేఖ పంపిస్తానని చెప్పారు. సీఎంకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. స్వతంత్ర భారతదేశంలో రైతులకు చేసిన అతిపెద్ద ద్రోహం ఇదేనని మండిపడ్డారు. రుణమాఫీకి తొలుత రూ. 40 వేల కోట్లు, ఆ తర్వాత రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారని, బడ్జెట్లో మాత్రం 26 వేల కోట్లు చూపించి.. 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి అంకెల గారడీ చేశారని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ మాట్లాడారు. సెక్యూరిటీ లేకుండా రేవంత్‌రెడ్డి జనంలోకి వెళ్తే ఫుట్‌బాల్ ఆడుకుంటారని పేర్కొన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసినందుకు ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని పేర్కొన్నారు. అర్హులైన వారిలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని తెలిపారు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రిని ఎక్క డా చూడలేదని పేర్కొన్నారు.
నిబంధనల పేరుతో కటింగ్‌లు
ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం కొందరికే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో రుణమాఫీలో కటింగ్‌లు పెట్టి సీఎం కాస్తా కటింగ్ మాస్టర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. 60 శాతం మందికి ఎగ్గొట్టి, 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మోసం చేశారని దుయ్యబట్టారు. మార్పుమార్పు అంటూ రైతన్నలను మోసం చేశారని దుయ్యబట్టారు. 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ. 2500, జాబ్ క్యాలెండర్, ఆటో అన్నలకు సాయం, వృద్ధులకు రూ. 4వేలు అన్నీ మోసమేనని మండిపడ్డారు.
ఫ్రస్ట్రేషన్‌తో రంకెలు
రైతుల గొంతును రేవంత్‌రెడ్డి తడిగుడ్డతో కోస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వానకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసాను ఎగ్గొట్టారని, ఆగస్ట్ సగం నెల గడిచినా ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. యాసంగిలోనూ రైతు భరోసా ఇవ్వలేదని పేర్కొన్నారు. తాము రైతులకు లక్షకోట్లు ఇస్తే ఈ ప్రభు త్వం 17 వేల కోట్లే ఇచ్చిందని చెప్పారు. రేవంత్ ఫుల్ప్రస్ట్రేషన్తోనే తమపై రంకెలేశారని పేర్కొన్నా రు. తనకంటే కుటుంబసభ్యులు దూసుకెళ్తున్నారని, భట్టి విక్రమార్క ఎక్కువ తిరుగుతున్నాడని, అధిష్ఠానం పట్టించుకోవడం లేదని బాధవల్లే అలా ఫ్రస్ట్రేషన్‌కు గురైనట్టు తెలుస్తున్నదని ఎద్దేవా చేశారు.
రేవంత్ మానసిక స్థితిపై అనుమానం
రేవంత్‌రెడ్డి మానసిక స్థితిపై కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. గౌడన్నలు కల్లులో నీళ్లు ఎన్ని కలుపుతారో అంటాడని, ప్రైవేటు టీచర్లు ఫెయిలయ్యే వా ళ్లంటాడని, మహిళలను కించపరుస్తాడని, భాక్రానంగల్, విప్రో, ఇన్ఫోసిస్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని, ఆయన కుటుంబసభ్యులు ఈ విషయాన్ని పరిశీలించాలని సూచించారు. తమకు రాజీనామాలు కొత్తకాదని, రేవంత్‌రెడ్డికి మోసం కొత్తకాదని పేర్కొన్నారు.
19 సార్లు ఢిల్లీకి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో రేవంత్‌రెడ్డి 19 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఇంకెన్నిసార్లు వెళ్తారోనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ప్రతి నియోజకవర్గంలోని కొన్ని ప్రాం తాలను పరిశీలించి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ను సంస్థాగంతా బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల పనితీరును అధ్యయనం చేయబోతున్నట్టు కేటీఆర్ తెలిపారు. తమిళనాడులోని డీఎంకే సహా పలు పార్టీలను అధ్యయనం చేసేందుకు సెప్టెంబర్‌లో తనతోపాటు సీనియర్ నేతలు వెళ్లనున్నట్టు చెప్పారు. అనంతరం పార్టీలో అవసరమైన మార్పు లు చేస్తామని తెలిపారు. కమ్యూనిస్టులు ధృతరాష్ర్టుడి కౌగిలిలో ఉన్నారని, రైతు సమస్యలపై కలిసి వస్తానంటే వారిని కలుపుకొని వెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యే వివేకానంద, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నేత లక్మీనర్సింహరావు పాల్గొన్నారు.
యథాలాపంగానే అన్నా
మహిళలపై యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రేవంత్‌రెడ్డికి కూడా సంస్కారం ఉంటే మహిళా శాసనసభ్యులను విమర్శించినందుకు విచారం వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నదంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని తాను కూడా అంటానని పేర్కొన్నారు.