KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని కేటీఆర్ నిలదీశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపుల్లో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు. హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కేసీఆర్ మార్చారని, అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లు వేశారని అన్నారు.
శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒక రోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని ఆయన ప్రశంసించారు.