KTR | శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే.. అనిల్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని అరికెపూడి గాంధీకి సవాలు విసిరారు. ఎమ్మెల్యే పేరులో గాంధీ మాత్రమే ఉందని.. కానీ చేసేది భూకబ్జాలు అని విమర్శించారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు దోసల అనిల్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అల్విన్ కాలనీలో సమావేశం పెడతామంటే ఫంక్షన్ హాలు యజమాని బెదిరించాడని తెలిపారు.
హైదరాబాద్ చరిత్రలో ఎవరితో సంబంధం లేకుండా బీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ కార్పొరేషన్‌ను అప్పజెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని 23 ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు. హైదరాబాద్ వాసులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పి బీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు. 40శాతం సర్పంచ్‌లను బీఆర్ఎస్కు ఇచ్చారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సరైన నాయకులకు అవకాశమిస్తామని కేటీఆర్ తెలిపారు. స్థానిక నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో కొట్లాడి పనులు చేయిస్తామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు గెలిస్తే కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
హైదరాబాద్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేస్తారంటా అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను ఎన్ని ముక్కలు చేసినా ఓట్లు వేసేది ప్రజలే అని అన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు భూకబ్జాలు చేస్తున్నాడని కేటీఆర్ అన్నారు. మంత్రి కొడుకుపై కేసు పెట్టిన అబీబుల్లాఖాన్ను బదిలీ చేశారని తెలిపారు. గన్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురే స్వయంగా చెప్పిందని గుర్తుచేశారు.