కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తమంటున్నరు.. మీరు చెరిపేయలేని, దాచలేని, తుడిపేయలేని ఆనవాళ్లు కేసీఆర్‌వి. కాళేశ్వరం జల సవ్వడిలో కేసీఆర్.. మిషన్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్.. మిషన్ భగీరథ నీళ్లలో కేసీఆర్.. పాలమూరు జలధారల్లో కేసీఆర్.. సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్.. గురుకుల బడుల్లో కేసీఆర్.. యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్.. విరజిమ్మే విద్యుత్తు వెలుగుల్లో కేసీఆర్.. మెడికల్ వైద్య విప్లవంలో కేసీఆర్.. కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్.. కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్‌లో కేసీఆర్.. మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్.. ఎక్కడ చెరిపేస్తారు? ఎలా చెరిపేస్తారు?
– కేటీఆర్
KTR | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు సవాల్ చేశారు. నిరూపించలేకపోతే కాంగ్రెస్ మంత్రివర్గం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మైనస్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ల లెక్కలు చెప్పాలని సవాలు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘35వేల ఉద్యోగాలు ఇచ్చామని బడ్జెట్ స్పీచ్‌లో చెప్పారు. ఇవి ఎక్కడిచ్చారు? ఎలా ఇచ్చారు?’ అని ప్రశ్నించారు. స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 20.12.2022న ఇస్తే 23.8.2023న పరీక్ష పెట్టారని తెలిపారు. సింగరేణి ఉద్యోగాలకు 22.6.2022లో నోటిఫికేషన్ ఇస్తే, తుది పరీక్ష సెప్టెంబర్ 2022లో పెట్టారని చెప్పారు. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏప్రిల్ 2022న ఇచ్చారని, ప్రిలిమ్స్ ఆగస్ట్ 2022లో జనవరి 2023లో, ఏప్రిల్ 2023న మెయిన్స్ నిర్వహించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో పోటీ పరీక్షలన్నీ పూర్తయితే.. ఇప్పడు మీరు ఉద్యోగాల ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు మీపై రికవరీ చార్జిషీట్ వేయాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంట్లో ఉన్న క్యాలెండర్ మరో నాలుగు నెలలైతే మారిపోతుందని, కానీ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌కే దిక్కులేదని చురకలేశారు.
పదేండ్ల వృద్ధికి నిదర్శనం ఆర్థిక సర్వే
రాష్ట్రంలో పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అసత్యాలను ప్రచారం చేస్తున్నదని, ఇది వారి గౌరవానికి, ప్రభుత్వానికి మంచిది కాదని కేటీఆర్ హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సామాజిక ఆర్థిక సర్వే’ (సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్) కూడా పదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధికి అద్దం పడుతున్నదని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క 15.3.2022న ప్రతిపక్ష నేతగా మాట్లాడుతూ.. ‘ఏటా సంపద సృష్టిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కరోనా దేశాన్ని అతలాకుతలం చేసినా, ఉత్పత్తిలో వెనుకడుగు వేయకుండా అభివృద్ధిని కొనసాగించారు’ అంటూ కొనియాడారని, ఇప్పుడు అధికారపక్షంలో కూర్చోగానే ఆయన స్వరం మారిందని అన్నారు. భట్టి విక్రమార్క మరింత ఉన్నతిని సాధించాలని, ప్రస్తుతం కూర్చున్న కుర్చీ నుంచి భవిష్యత్‌లో పక్కనే ఉన్న కుర్చీ (సీఎం కుర్చీ) లోకి వెళ్లేలా దేవుడు శక్తిని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధిలో తెలంగాణ నిలబడింది.. పెట్టుబడులను ఆకర్షించింది.. ఎంప్లాయ్‌మెంట్‌ను కొనసాగింది.. వేగంగా ఆవిష్కరణలు చేసింది అని సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ స్పష్టం చేసింది’ అని పేర్కొన్నారు.
సంక్షేమాలకు నిధులు ఏవి? ఎక్కడ?
‘ఎకరానికి రూ.15 వేల భరోసాకు, నెలకు రూ.2,500 సాయానికి నిధులు ఏవి? వృద్ధులు, పెద్దలు దివ్యాంగులకు నిధులు ఎక్కడ? ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు? అవి ఎక్కడ? ఇప్పుడు ఉద్యోగులకు రైతు రుణమాఫీలో కటింగ్ పెట్టారు. రైతుభరోసాలో కూడా పెడతారంట? విద్యార్థుల విద్యాభరోసాకు రూ.5 లక్షల కార్డుకు, తులం బంగారం, స్కూటీలకు నిధులేవి? కోతలు, ఎగవేతలతో బడ్జెట్‌కు మసిపూపి మారేడుకాయ చేశారు’ అంటూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బడ్జెట్‌ను వెంటనే సవరించాలని కోరారు. ‘ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా.. రెండుసార్లు పత్రికల్లో యాడ్స్ ఇచ్చాకున్నారని, అనవసర ఖర్చులు తక్కువ చేసుకోండి’ అని హితవు పలికారు. ‘వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి, ఖమ్మం జిల్లాల్లో లక్ష్మమ్మ అనే మహిళ ఆసరా పెన్షన్ రికవరీ పెట్టారు. కొత్తగా ఫింఛన్ల రికవరీ, రైతుబంధు రికవరీ, కల్యాణలక్ష్మి రికవరీ వంటివి చేస్తున్నారు. గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్‌గా ఉండాలె కానీ.. రికవరీ ఏజెంట్‌గా ఉండొద్దు’ అని హితవు చెప్పారు. స్కాంల మకిలి అంటించి.. స్కీంలు ఎత్తేస్తామంటే చూస్తు ఊరుకోం, వదిలిపెట్టబోం అని హెచ్చరించారు.
రికవరీ చేయాల్సి వస్తే.. ప్రజలు మీ నుంచి రికవరీ చేయాలని, మీపై రివకరీ చార్జిషీటు వేయాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు స్వర్ణయుగం నడిచిందని, పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకురావద్దని హితవు చెప్పారు. కాంగ్రెస్ 8 నెలల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 388 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం మళ్లీ రైతుకు జరుగుతున్నదని, వ్యవసాయం సంక్షోభంలో పడే పరిస్థితి వచ్చిందని, రైతుల వెన్ను విరుగుతున్నదని, పల్లె కన్నీరు పెడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కల్లాల్లో ధాన్యం లేదు.. కండ్లల్లో ధైర్యం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పదేండ్లు ఈ కష్టాలు ఎందుకులేవో ప్రజలు ఆలోచించాలని కోరారు. పరిశ్రమలకు ఇచ్చినట్టే రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.15 వేలు ఇచ్చేందుకు బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. 26 లక్షల మంది కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు.. వారిని గుర్తించారా? అని ప్రశ్నించారు.. ఫసల్ బీమా జోలికి వెళ్లొద్దని, దానిని ప్రవేశపెట్టిన గుజరాత్ వారే అదొక బక్వాజ్ పథకమని చెప్తున్నారని అన్నారు.
ఒక్కో మహిళకు 20 వేలు బాకీ
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎంఎస్ఎంఈలో 40% మహిళల ఓనర్షిప్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. భారతదేశ సగటు 20% ఉంటే.. ఒక్క తెలంగాణలోనే 40% ఉన్నదని వివరించారు. కోటిన్నర లక్షల మంది మహిళలకు నెలకు రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి ఒక్కొక్కరికి రూ.20 బాకీ పడ్డారని, అవి కూడా చెల్లించాలని, ఆడబిడ్డల ఉసురు మంచిదికాదని హితవు చెప్పారు. దళితబంధు స్థానంలో తీసుకొచ్చిన అంబేద్కర్ అభయహస్తానికి ఇస్తామన్న రూ.12 లక్షలకు మీరు కనీసం రూ.2 వేల కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అనవసర ప్రకటనలు ఆపితే పది దళిత కుటుంబాలు బాగుపడతాయని హితోపదేశం చేశారు.
చేనేతలను, బీసీలను ఆదుకోండి
‘బీసీ వెల్ఫేర్ డిక్లరేషన్‌లో ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు పెడతామన్నారు. అందులో కనీసం 50% కూడా పెట్టలేదు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో 15 మంది చేనేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, మంచి పనులకు మంగళం పాడొద్దని కోరారు. బతుకమ్మ చీరెలు, నేతన్నకు చేయూత, చేనేతమిత్ర పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు లేవని,. థ్రిఫ్ట్ పథకం ఎత్తివేశారని మండిపడ్డారు. మేము తెచ్చిన మంచి పథకాల్లో వివక్ష చూపకుండా పేర్లు మార్చుకొని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ రాసిన ‘బతుకు దారాలు, దారులు తెలిగిపోయినయ్.. ముగ్గులు, మగ్గాలు మూగబోయిన్.. ఇల్లిల్లు దాటి, సిరిసిల్ల దాటి తొందరగా వెళ్లిపోవే తల్లి దసరా’ అనే కవితను కేటీఆర్ చదివి వినిపించారు. ‘బతుకమ్మ’ అనే పేరు ఇష్టం లేకపోతే మార్చుకోవాలని, పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకొని చేనేతలకు బకాయిలు విడుదల చేశామని చెప్పారు. అవసరమైతే వారికొక ప్రత్యేక టెక్స్టైల్ పరిశ్రమ తీసుకురావాల్సి ఉన్నదని తెలిపారు. కేంద్రం కూడా సహకరించాలని కోరారు.
దావోస్‌లో బోగస్ పెట్టుబడులు
ప్రభుత్వాన్ని వారి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దావోస్‌లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు చెప్పారని, ఇందులో గోడి ఇండియా కంపెనీ రూ.8 వేల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నదని చెప్తున్నారని, అయితే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహేశ్ గోడి అనే వ్యక్తికి సంబంధించిన ఈ కంపెనీ క్యాపిటలే రూ.1.71 కోట్లు అని, ఆ కంపెనీ రూ.27 లక్షల నష్టంలో ఉన్నదని కేటీఆర్ వివరించారు. రూ.27 లక్షల నష్టాల్లో ఉన్న కంపెనీ రూ.8 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఊదరగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. 2022 ఏప్రిల్ 22న కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ 1500 మెగావాట్ల కెపాసిటీతో రూ.9,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించిందని చెప్పారు. ఈ మేరకు ఆ సంస్థ చేసిన ట్వీట్‌ను చూపించారు. ఈ ఒప్పందాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారి హయాంలో దావోస్‌లో చేసుకున్న ఒప్పందంగా చూపడం దారుణమని పేర్కొన్నారు. రూ.40 వేల కోట్లలో గోడి ఇండియా రూ.8 వేల కోట్లు, జేఎస్‌డబ్ల్యూ రూ.9,500 కోట్లు మొత్తం రూ.17,500 కోట్లు ఇక్కడే బోగస్ అని తేలిందని, ఇక మిగిలింది ఆదానీ పెట్టుబడులేనని ఎద్దేవా చేశారు.
రైతులు, నేతన్నల కుటుంబాలను ఆదుకోండి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 383 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, 15 మంది నేతన్నలు, 59 మంది ఆటో కార్మికులు మరణించారని, వీరి కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ.5 లక్షలు ఇస్తారో, 10 లక్షలు ఇస్తారో ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రీబస్ను పూర్తిగా స్వాగతిస్తున్నామని, ఇంకా బస్సులు పెంచాలని కోరారు. కొత్త సర్పంచ్‌లు వచ్చేలోపు పాత సర్పంచ్‌లకు బకాయిలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రూ.800 కోట్ల నిధులు వచ్చాయని, వాటిని సర్పంచ్‌లకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మూసీ సుందరీకరణపై స్పష్టతివ్వాలి
మూసీని సుందరీకరణ చేయాల్సిందేనని, ప్రభుత్వ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, కరోనా కారణంగా ముందుకు వెళ్లలేదని చెప్పారు. నాడు తమ ప్రభుత్వం అన్నీ కలిపి రూ.16వేల కోట్లు అంచనాలు వేసిందని, ఇప్పుడు ఆ బడ్జెట్ రూ.1.5 లక్షలకు ఏ విధంగా పెరిగిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంశం ఇంకా అంచనాల దశలోనే ఉన్నదని, ఇంకా డీపీఆర్‌ను రూపొందించలేదని తెలిపారు. దీనిపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. భట్టి విక్రమార్క మూసీ సుందరీకరణపై డీపీఆర్ తయారు చేసినట్టు చెప్తే.. శ్రీధర్‌బాబు మాత్రం ఇంకా రూపొందించలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇద్దరిలో ఎవరు సభను తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయ దురద ఉన్నవాళ్లు చెప్తే నమ్మొద్దు
బతుకమ్మ చీరెలను సూరత్ నుంచి కొనుగోలు చేశారని, ఇందులో స్కాం జరిగిందని సీఎం వ్యాఖ్యానించగా.. అప్పుడు ఐఏఎస్ అధికారిని శైలజారామయ్యర్ దానికి బాధ్యులుగా ఉన్నారని, కావాలంటే సమాచారం తెప్పించుకొని పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. తమపై రాజకీయ దురద ఉన్నవారు ఏదో చెప్తే నమ్మి మోసపోవద్దని సూచించారు. అక్టోబర్‌లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేయాల్సి ఉన్నదని, తమ నిర్ణయం ఆలస్యం తీసుకోవడంతో తక్కువ సమయంలో సిరిసిల్ల చేనేత కార్మికులతో కోటి చీరలు తయారీ సాధ్యం కాదని, కాబట్టి కొంతమేర టెండర్ ద్వారా కొనుగోలు చేసినట్టు వివరించారు. పదేండ్ల పాలనపై ఎలాంటి అనుమానాలున్నా పూర్తి విచారణ చేయాలని, పూర్తిగా స్వాగతిస్తామని స్పష్టంచేశారు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇది నాలుగైదు దశాబ్ధాల కింద ఏర్పాటు చేశారని, దాని పర్పస్ పూర్తైన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టంచేశారు. కానీ ఏ పర్పస్‌తో ఇండస్ట్రీ ఏర్పాటు చేశారో.. అది నెరవేరకుండా చేస్తానంటే చట్టం అడ్డం వస్తుందని చెప్పారు.
ప్రాంతం వాడే మోసం చేస్తే పాతరపెడుతాం
ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు రాజకీయాలు చేద్దామని, మిగిలిన నాలుగున్నరేండ్లు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పని తాము చేస్తామని కేటీఆర్ చెప్పారు. ‘మాపై కోపం ఉంటే మమ్మల్ని ట్టండి. కానీ తెలంగాణ కోసం కలిసిమెలసి, కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి. ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి. కొట్లాటనే మా డీఎన్ఏలో ఉన్నది, ప్రజల పక్షాన తప్పకుండా కొట్లాడుతం. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎక్కడ ఒక్క మోసం జరిగినా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున మౌనం వహించం, భరించం. ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతరపెడుతామని గుర్తుచేస్తున్నాం’ అని చెప్పారు.
మిమ్మల్ని అభినందించాలా? అభిశంసించాలా?
ఎందుకు మిమ్మల్ని అభినందించాలి? ఆరు నూరైనా ఆరు గ్యారెంటీలను నూరు రోజుల్లో అమలు చేస్తామని మాట తప్పినందుకా? డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసిందుకా? శ్రీధర్‌బాబు చైర్మన్‌గా రాసిన 420 హామీలను తుంగలో తొక్కినందుకా? మిమ్మల్ని అభినందించడం కాదు.. అభిశంసించాలి చేశారు. మన దగ్గర రీకాల్ వ్యవస్థలేదు కాబట్టి.. మిమ్మల్ని నాలుగేండ్లు భరించాలి.
-కేటీఆర్
సభ వాయిదా పడగానే నేను, మీరు కలిసి అశోక్‌నగర్ పోదాం. అక్కడ ఉండే ఒక్క యువకుడైనా, ఏ ఒక్క చెల్లి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తే.. నేను అక్కడే రాజీనామా చేస్తా. రాజకీయ సన్యాసం తీసుకుంటా. సిటీ సెంట్రల్ లైబ్రరీలో సీఎంకు, డిప్యూటీ సీఎంకు లక్షమందితో పౌర సన్మానం చేస్తాం.
-కేటీఆర్
పాలమూరు ప్రాజెక్టుల్ని పూర్తి చేయండి
పాలమూరులో అన్ని రిజర్వాయర్లను తమ ప్రభుత్వమే నిర్మించిందని, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ వరకు అన్ని రిజర్వాయర్లను నిర్మించామని కేటీఆర్ తెలిపారు. మొత్తం 31 పంపుల్లో ఒక పంపు ఆన్చేసినట్టు తెలిపారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలో పెట్టొద్దని, పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయొద్దని కోరారు. మానేరును కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మాఫీలో భారీగా కోతలా?
రుణమాఫీ వ్యవహారం ‘పంచపాండవులు మంచంకోళ్ల’ కథలా ఉన్నది. రైతులను మోసం చేయడం ఆపండి. ఏకకాలంలో రుణమాఫీ చేయండి. కేసీఆర్ మొదటిసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తేనే అయిన ఖర్చు రూ.16 వేల కోట్లు. మీరు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ చేశామంటున్నారు దానికి అయిన ఖర్చు కేవలం రూ.11 వేల కోట్లే. ఎన్ని దిక్కుమాలిన నిబంధనలు పెట్టి, ఎందరి రైతుల పొట్ట కొట్టారు. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం రుణమాఫీ అమలు చేస్తామంటే ఎలా?
-కేటీఆర్
దమ్ముంటే ఆస్తులు విలువ చెప్పాలి
‘ఎప్పుడూ అప్పుల గురించే కాకుండా.. దమ్ముంటే కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా చెప్పండి. జీఎస్డీపీలో అప్పుల శాతం 2014-15లో 14.4% ఉండగా, ఇప్పుడు 27.8% ఉన్నది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. జీఎస్డీపీతో పోల్చితే అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కంటేముందు 15 రాష్ర్టాలు ఉన్నాయని తెలిపారు. రాష్ర్టాన్ని బద్నాం చేయొద్దని, మిగులు బడ్జెట్‌తోనే కాంగ్రెస్‌కు అప్పగించామని స్పష్టంచేశారు.
తెలంగాణ ఆస్తుల విలువ కూడా అదే స్థాయిలో పెంచామని వివరించారు. జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.14.64 లక్షల కోట్ల వరకు పెరిగిందని, ఇదెందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. దేశ జీడీపీ, రుణ నిష్పత్తి 59% ఉన్నదని, అమెరికా 129%, సింగపూర్ 168, జపాన్ 264%తో ఉన్నదని తెలిపారు. ద్రవ్యలోటు 2014లో 1.9% ఉంటే.. 2022-23లో 2.5% ఉన్నదని తెలిపారు. 0.6% మాత్రమే ద్రవ్యలోటు పెరిగిందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వమే ద్రవ్యలోటును పూడ్చడానికి నానా తంటాలు పడుతున్నదని చెప్పారు. ‘పింక్ ఆఫ్ హెల్త్‌ను క్రియేట్ చేశాం. దానిని బద్నాం చేయొద్దు. పింక్ ఆఫ్ హెల్త్ అంటే మేమంతా పింక్ ఆఫ్ హెల్తే.. మీకు పింక్ అంటే ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితి’ అంటూ రాష్ట్ర పరిస్థితిని వివరించారు.
ఫార్మాసిటీ రద్దు తిరోగమన నిర్ణయం
ప్రభుత్వం కొన్ని తిరోగమన నిర్ణయాలతో అభాసుపాలయ్యే అవకాశం ఉన్నదని కేటీఆర్ హెచ్చరించారు. ఎయిర్‌పోర్టుకు మూడు రకాల కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతోనే నాడు మెట్రోను విస్తరించినట్టు చెప్పారు. మైండ్‌స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోను తీసుకెళ్లడానికి కారణం ఐటీ ఉద్యోగులని తెలిపారు. సుమారు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు నిత్యం ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ వరకు, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టుకు, హయత్‌నగర్ నుంచి ఎయిర్‌పోర్టుకు రావడానికి వీలుగా రూట్ రూపొందించినట్టు వివరించారు. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, ఒకసారి పునరాలోచన చేయాలని కోరారు. ఫార్మా సిటీ రద్దు విషయంలో కూడా మరోసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తిచేశారు. ఫార్మాసిటీ కోసమే భూములు తీసుకుంటున్నామని భూసేకరణ చట్టం ద్వారా సేకరించినట్టు తెలిపారు. ఈ విషయంపై లీగల్ అడ్వైజ్ తీసుకోవాలని సూచించారు. ‘ఫార్మాసిటీ భూములు తిరిగి వెనక్కి ఇస్తామన్నారు. చట్టప్రకారం తీసుకున్నాం కాబట్టి.. ప్రభుత్వపరంగా ఏమైనా ఇబ్బందులొస్తాయేమోనని లీగల్‌గా వెళ్లమని చెప్తున్నాం’ అని స్పష్టంచేశారు