బాధితులకు తాగునీరు, భోజనం, మందులు, దుస్తులు పంపిణీ చేయండి మెడికల్ క్యాంపులు పెట్టండి.. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది ప్రతిపక్షంగా మన బాధ్యత ఎకువ.. పార్టీ నేతలు, శ్రేణులకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విపతర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని సూచించారు.
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పార్టీ నేతలతో బుధవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, తీసుకోలేకపోయినా ప్రతిపక్షంగా మన బాధ్యత ఎకువని గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి తాగునీరు, పాలు, ఆహారం, మందులు, దుస్తులు వంటి కనీస అవసరమైన సహాయాన్ని ప్రజలకు అందించాలని దిశానిర్దేశం చేశారు. అత్యవసర వైద్య అవసరాల కోసం అవసరమైనచోట మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణశాఖ హెచ్చరికల మేరకు రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరద నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే వరద వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న ప్రజలు ప్రభుత్వ వైఫల్యంతో ఇబ్బందులు పడుతుండటంపై ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఆయా జిల్లాలకు చెందిన పార్టీ లీడర్లు శ్రేణులు సహాయక చర్యల్లో మరింత చొరవ చూపాలని సూచించారు. కష్టకాలంలో బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రజలు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.
సదా మీకోసం.. గులాబీ సైన్యం
వర్షానికి వరంగల్‌లోని పలు ప్రాంతాలు నీట మునగగా నయీంనగర్ నాలా వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్