KTR : అమెరికా పర్యటనలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (KTR ) జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యుడు మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్‌లోని ఏఐజి (AIG) ఆసుపత్రి వైద్య బృందంతో ఆయన ఫోన్లో మాట్లాడారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారి కుటుంబానికి అండగా ఉండేందుకు కేటీఆర్.. తన అమెరికా పర్యటనను కుదించుకుని ఈరోజు రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి.. ఆయనకు అందిస్తున్న చికిత్స వివరాలను ఫోన్ ద్వారా ఆసుపత్రి సీనియర్ వైద్యులను అడిగి తెసుకున్నారు కేటీఆర్. ఐసీయూలో మాగంటికి చేస్తున్న వైద్యంపై పూర్తి సమాచారం తీసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
గోపీనాథ్‌కు అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని ఏఐజి వైద్య బృందం కేటీఆర్‌కు వివరించింది. ఈ సందర్భంగా మాగంటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.