హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ): వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి మోగించనున్నది. సబ్బండవర్గాలను దగా చేస్తున్న సర్కార్‌ను ఎండగట్టేందుకు సిద్ధమైంది. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. వంద రోజుల్లో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి.. 13 డిక్లరేషన్ల పేరిట 420 హామీలు అమలు చేస్తామని ఊదరగొట్టి.. అన్ని వర్గాలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్దఎత్తున కార్యాచరణ సిద్ధం చేసింది బీఆర్ఎస్.
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, వినూత్న నిరసన కార్యక్రమాలతో సర్కార్ మోసాలు, వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకొనేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు సూచనలు, సలహాలతో నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో చేసిన మోసాలు, హామీల అమల్లో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికీ చేరేలా వారంపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
శ్రేణులన్నీ ఏకతాటిపైకి రావాలి..
రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా చేపట్టిన కార్యాచరణను విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీల్లో వెయ్యి రోజులైనా ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చకుండా అన్ని వర్గాలను ధోకా చేసిందని ధ్వజమెత్తారు. పాలనా వైఫల్యం, ప్రభుత్వ పెద్దల అవినీతి, పార్టీ నేతల అరాచకాలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. సబ్బండ వర్గాలను పట్టిపీడిస్తున్న కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు, అవినీతి, అరాచకాలు, భూదందాలు, దౌర్జన్యాలు, వనరుల దోపిడీకి పాల్పడుతున్న తీరును నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ముందుంచాలని ఉద్బోధించారు. రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో అన్నీ వర్గాలకు అర్థమయ్యేలా వివరించేందుకు సెప్టెంబర్ 2 నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రజాసమస్యలను ప్రస్తావించాలి..
వారం రోజులపాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు కేవలం హామీల చుట్టూ కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చోటుచేసుకున్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించాలని కేటీఆర్ కోరారు. ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల తాలూకూ బకాయిలను మరోసారి బాకీ కార్డుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, రైతుకూలీలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, మహిళలకు ప్రతినెలా ఇస్తామన్నా ఆర్థిక సాయం ఎంతమేరకు పేరుకుపోయిందో బాకీ కార్డుల ద్వారా విడమరిచి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఆడబిడ్డల నుంచి అన్నదాతల వరకు దగా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతి ఒకరినీ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రతి వర్గానికీ ఇచ్చిన హామీలు, వాటి అమల్లో వైఫల్యాలు, ఆయా వర్గాలకు దక్కాల్సిన ప్రయోజనాలు, బకాయిల వివరాలను ప్రజల ముందు ఉంచాలని సూచించారు. విద్యార్థులకు రూ.12 వేల కోట్లకుపైగా ఫీజులు చెల్లించకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెకించిన కాంగ్రెస్ తీరును అన్ని కాలేజీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను ప్రజల్లో విసృ్తతంగా చర్చకు తీసుకురావాలని సూచించారు. యువతకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వకుండా, హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందో ఇప్పటికే సరూర్‌నగర్‌లో నిర్వహించిన సభ, యువ సంగ్రామ సదస్సు ద్వారా ఎండగట్టామని గుర్తుచేశారు. ఇప్పుడు వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించిన కార్యాచరణలో భాగంగా మరోసారి యువతకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.
ఒకే తరహా కార్యక్రమాలకు పరిమితం కావొద్దు..
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఆటో డ్రైవర్లు, ఆడబిడ్డలు, అన్నదాతలు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక వర్గాన్నీ ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని వారికి అర్థమయ్యేలా వివరించాలని కేటీఆర్ సూచించారు. ఆయా వర్గాల సమస్యలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. ఏడు రోజులు నియోజకవర్గాల్లో మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, దళితులు, బీసీలు, గిరిజనులు తదితర వర్గాలను ప్రత్యేకంగా కలుస్తూ, వారి సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. హామీలతోపాటు వెయ్యి రోజుల వైఫల్యాలనూ ఎండగట్టాలని అన్నారు. వెయ్యి రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రంగాల్లో వైఫల్యం చెందిందో, ఎన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ పరిపాలన సాగించిందో ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలను గుర్తించి వాటిపై ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, వాస్తవంగా జరిగిన పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
సోషల్ మీడియాతో కొత్తతరానికి చేరువ కావాలి..
కొత్తతరం పిల్లలకు చేరువయ్యేలా ఈ కార్యక్రమాలు ఉండాలని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని అన్నారు. సోషల్ మీడియాను ఒక పదునైన అస్త్రంగా ఉపయోగించుకుని వినూత్నమైన కార్యక్రమాలు, ప్రచార రూపాలతో కాంగ్రెస్ వైఫల్యాలను కొత్త తరానికి చేరేలా చూడాలని కోరారు. వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు సహా అన్ని స్థాయిల నాయకులు పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రం, గ్రామం, వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులన్నీ కదిలి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలను ఎంతమేరకు వీలైతే అంత వినూత్న తరహాలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివిధ రూపాల్లో, వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు తమ నైపుణ్యాన్ని చూపాలని, చతురతను ప్రదర్శించాలని కోరారు.