Nandu | యూకే వీసా మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ నందన మరోసారి వార్తల్లో నిలిచారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం. తాజాగా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట నందన విచారణకు హాజరయ్యారు.న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుటకు వచ్చిన నందనను అధికారులు సుమారు మూడు గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. ఈ విచారణ అనంతరం ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
విదేశాల్లో వీసా, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నందన దంపతులు తన నుంచి సుమారు రూ.13 లక్షలు వసూలు చేశారని క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఈ క్రమంలో సోమవారం యూకే నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న నందనకు పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆమె న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుట హాజరై తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది.
విచారణలో పోలీసులు వీసా ప్రాసెస్, ఉద్యోగాల పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలు, బాధితుల ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే నందనపై ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్లోనూ మరో కేసు నమోదైనట్లు సమాచారం. వీసా రెన్యూవల్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని, ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నందన అకస్మాత్తుగా విదేశాల నుంచి భారత్‌కు రావడానికి మరో కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే బిగ్‌బాస్ తెలుగు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ. బిగ్‌బాస్ హౌస్‌లోకి త్వరలో మరికొందరు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు రానున్నారనే ప్రచారం నేపథ్యంలో నందన పేరు కూడా వినిపించినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కోసమే ఆమె భారత్‌కు వచ్చారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే నందన బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డ్‌గా వస్తారనే విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ ప్రచారం నిజమా కాదా అన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది.