Vijay Devarakonda | ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి కలిసి నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ సినిమాను తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రష్మికను తీసుకొచ్చిన ఆనంద్.. ప్రీ రిలీజ్ వేడుకకు తన అన్న విజయ్ను తీసుకురావడంతో దేవరకొండ అభిమానుల్లోనూ సందడి నెలకొంది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన కుటుంబం, స్నేహితుల సినిమాలు వరుసగా విడుదల కానున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల సందీప్ వంగా సినిమా ఫంక్షన్లో అభిమానులను కలిసినట్లు చెప్పిన ఆయన.. ఇక రాబోయే మూడు నెలల్లోనూ తరచూ అభిమానులను కలుస్తూనే ఉంటానని అన్నారు. సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’, అక్టోబర్ 16న తన సినిమా, నవంబర్‌లో విజయ్-రష్మిక కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రానున్నాయని తెలిపారు. వీటితో పాటు ‘రణబాలి’, ‘మైసా’, ‘ఈనగరానికి ఏమైంది 2’, ‘ఫౌజీ’, బాలకృష్ణ సినిమా వంటి పలు చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయని చెప్పారు.
‘ఎపిక్’ ఈవెంట్‌కు తాను సెట్ నుంచి నేరుగా వచ్చానని విజయ్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ షూటింగ్లో బిజీగా ఉన్నానని, సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందన్నారు.
సినిమాలు ఆలస్యమవుతున్నాయని అభిమానులు తనను గట్టిగా తిడుతున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించిన విజయ్.. అదే భయంతో విగ్గు కూడా తీయకుండా ఈవెంట్‌కు వచ్చేశానని నవ్వుతూ చెప్పారు. తాను వేసుకున్న దుస్తులతోనే వస్తే ‘రణబాలి’ ప్రమోషన్ అనుకుంటారని భావించి త్వరగా బట్టలు మార్చుకుని వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు ఇది అద్భుతమైన సమయమని విజయ్ దేవరకొండ అన్నారు. వరుసగా మంచి సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాదిని ‘కంబ్యాక్స్ ఇయర్’గా పిలుస్తున్నారని, రాబోయే సినిమాలు కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వాలని ఆకాంక్షించారు.
తనకు రాబోయే కొన్ని సినిమాల కంటెంట్ తెలుసని, వాటి గ్లింప్స్ కూడా చూశానని చెప్పిన విజయ్.. ఈ చిత్రాల విషయంలో 100 శాతం స్ట్రైక్ రేట్ వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. అంతేకాదు.. సరదాగా దీనికి ‘ఆపరేషన్ TFI’ అని పేరు పెట్టుకుందామని చెప్పారు. సినిమాలు కేవలం బ్లాక్‌బస్టర్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేసి, మంచి జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకోవాలని కోరుకున్నారు.