న్యూఢిల్లీ: భారత హాకీ జట్ల జెర్సీ రంగుపై హాకీ ఇండియా (హెచ్ఐ)యూ టర్న్ తీసుకుంది. వివాదం రేపిన కాషాయ రంగుకు స్వస్తి పలికి తిరిగి సంప్రదాయ నీలి రంగు జెర్సీలనే వాడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాబోయే ఆసియా గేమ్స్‌లో భారత జట్లకు తొలి ప్రాధాన్యతగా బ్లూ కలర్ జెర్సీలనే ఎంచుకుంది. గత నెలలో జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో భారత పురుషుల, మహిళలు జట్లు ఆరెంజ్ జెర్సీలతో బరిలోకి దిగడంపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్న నీలంను కాదని కాషాయ రంగును ఎంచుకోవడాన్ని మాజీ కెప్టెన్ వీరెన్ రాస్కిన్హా తదితరులు ప్రశ్నించారు. భారత నీలి రంగు కిట్స్.. బ్లూ సింథటిక్ ఫీల్డ్ కలర్లో కలిసిపోతున్నాయనే కాషాయానికి మొగ్గు చూపినట్టు తర్వాత హాకీ ఇండియా వివరణ ఇచ్చినా.. విమర్శలు ఆగలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి జపాన్ ఆతిథ్యం ఇచ్చే ఆసియా గేమ్స్‌లో హాకీ టీమ్స్ ఫస్ట్ చాయిస్‌గా బ్లూ కలర్ కిట్స్‌నే ఎంపిక చేసినట్టు భారత ఒలింపిక్ సంఘానికి హెచ్ఐ తెలిపింది. రెండో ప్రాధాన్యతగా కాషాయ రంగును ఎంచుకున్నట్టు హెచ్ఐ కోశాధికారి శేఖర్ మనోహరన్ తెలిపారు.