KTR | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ సమయానికి రైతుబంధు వేయలేదని విమర్శించారు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చిటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కొనకుండా గోస పుచ్చుకుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులకు సమయానికి రైతుబంధు వేసిన చరిత్ర కేసీఆర్‌ది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కొనకుండా అన్నదాతలను వేధిస్తోందని అన్నారు. ఆంక్షలు లేకుండా పంటలు కొన్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరి, జొన్నలు, శనగ పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదని తెలిపారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ కదం తొక్కుతుందని పేర్కొన్నారు. రాబోయే వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాలను పరిశీలిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన తెలియజేయాలన్నారు. తహశీల్దార్, ఆర్డీవోలకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీద్దామని అన్నారు.