KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పక్కన పెట్టారు, పరిపాలన వదిలేశారని మండిపడ్డారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇలా హామీలిచ్చి అందర్నీ మోసం చేస్తుందని ఆనాడే చెప్పామని.. అన్నట్లుగానే రెండేళ్లలో రేవంత్ రెడ్డి ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అందర్నీ మోసం చేశాడని తెలిపారు. వృద్ధుల నుంచి మొదలు ఆడబిడ్డల వరకు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా అందర్నీ రేవంత్ రెడ్డి మోసం చేస్తూనే ఉన్నాడని అన్నారు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న అన్ని వర్గాలు ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
శాసనసభ స్పీకర్ ధృతరాష్ట్రుని లెక్క మారాడని.. కళ్ళకు గంతలు కట్టుకొని నిజాలు చూడలేకపోతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో ,చేరి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే స్పీకర్ మాత్రం గుర్తించడం లేదని విమర్శించారు. యాదయ్య ఇంకా భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నాడని చెబుతున్నాడని పేర్కొన్నారు. కాలె యాదయ్య గెలిపించిన పార్టీని వదిలిపెట్టి పదవుల కోసం, పైసల కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని యాదయ్య చెబుతున్నారు.. కానీ స్పీకరే ఒప్పుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే తమ పార్టీలో చేరిన కాలె యాదయ్యపై చర్యలు తీసుకొని.. ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన చేవెళ్ల బీజేపీ మాజీ ఎంపీపీ విజయ భాస్కర్ రెడ్డి pic.twitter.com/oZ6Dg2UsRW
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2026
అందర్నీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ అదే మోసం కొనసాగుతుందని హెచ్చరించారు. కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని.. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అందరూ కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.