హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం లీకుల మీద లీకులిస్తూ లీకుల సర్కార్‌గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దెప్పిపొడిచారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని, బురదజల్లుతూనే ఉన్నదని మండిపడ్డారు. అసమర్థత, వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు రోజుకో డ్రామా ఆడుతున్నదని మండిపడ్డారు. ‘మీరెన్ని రకాల డైవర్షన్ గేమ్స్ ఆడినా మేం మాత్రం అర్జునుడికి చేప కన్ను మీద ఎట్లయితే ఆనాడు గురి ఉన్నదో, అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత, అవినీతి మీద, ప్రజలకు ఇచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద ఉంటది’ అని స్పష్టంచేశారు. ‘అనుముల రేవంత్‌రెడ్డి, ఎగవేతల రేవంత్‌రెడ్డిగా ఎట్లా మారాడనేదానిపై. 420 హామీలు నెరవేర్చకుండా చేస్తున్న పిచ్చి పనులపై నిలదీస్తూనే ఉంటామని, ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. వందశాతం వదిలిపెట్టకుండా పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. నికార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ సైనికులుగా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేదాకా అంతా కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం సిట్ విచారణకు వెళ్లేముందు, విచారణ ముగిసిన అనంతరం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో భావోద్వేగంతో మాట్లాడారు.
15 ఏండ్లుగా రాష్ట్ర సాధన ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలూ పనిచేశానని కేటీఆర్ చెప్పారు. ‘మా నాయకులు మాకు ఏ బాధ్యత అప్పగించినా మేం శక్తివంచన లేకుండా నిబద్ధతతో పనిచేశాం. మేమెప్పుడూ టైం పాస్ రాజకీయాలు చేయలే. ప్రత్యర్థుల కుటుంబాలు, పిల్లలను రాజకీయాల్లోకి లాగలే. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలే. మా నాయకుడు కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టని హామీలు కూడా నెరవేర్చారు. రైతు బంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు ప్రజల కోసం అమలు చేసినం’ అని గుర్తుచేశారు. రెండేండ్లుగా రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వాపోయారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేక రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత పెద్దది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ఏదైతే పూర్తి స్థాయిలో డైవర్షన్ గేమ్ ఆడుతున్నదో దాన్ని ఎత్తిచూపే ప్రయత్నాన్ని కచ్చితంగా చేస్తూనే ఉంటం. ముమ్మాటికీ ఒకటి మాత్రం పకా.. ఈ కేసును ఇంతటితో మేం వదిలిపెట్టబోం. నా క్యారెక్టర్ అస్సాసినేషన్‌కు బాధ్యులైన రేవంత్‌రెడ్డిని, ఆయన అడుగులకు మడుగులొత్తుతూ తొత్తులుగా పనిచేస్తున్న కొందరు పోలీసులను నేను వదిలిపెట్టను.
-కేటీఆర్ హెచ్చరిక
‘నా మీద ఏడెనిమిదేండ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వ హననం) జరుగుతున్నది. దికుమాలిన వార్తలు రాసి నన్ను, నా కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురిచేశారు. రెండేండ్లుగా అసమర్థ పాలన, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. ఆ విచారణకు హాజరై పూర్తిగా సహకరించా. దాదాపు ఏడు, ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పా. ఈ విచారణ సందర్భంగా సిట్ అధికారులను నేనూ కొన్ని ప్రశ్నలు అడిగా. రెండేండ్లుగా ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసేలా లీకుల మీద లీకులిస్తున్నారు. దీనికి బాధ్యులెవరు? రెండేండ్లుగా ప్రతిసారీ విచారణ పేరిట ఏదో ఒక లీక్ ఇవ్వడం, లేకపోతే విచారణకు పిలువకపోయినా ఏదో జరిగిందంటూ లీకివ్వడం, తెల్లారి హెడ్ లైన్ కావడం పరిపాటిగా మారింది. దానివల్ల ప్రజలు నిజమేననుకొని భ్రమపడే పరిస్థితులు వచ్చాయి. ఇది మంచిది కాదని చెప్పా. కానీ పేపర్లు రాస్తూనే ఉన్నయి. కొన్ని యూట్యూబ్ చానళ్లలో మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు. కొందరు హీరోయిన్లను బెదిరించినట్టు ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు రాశారు. ఇది వాస్తవమా? వాస్తవమైతే మా ముందు వివరాలు పెట్టండి. చెప్పండి. ఎవరికి ఎవరు సమాచారమిచ్చారని అడిగా.
కానీ అకడున్న అధికారి ‘లేదండీ.. అది కరెక్ట్ కాదు, మేం ఆల్రెడీ మీడియాకు చెప్పాం కదా?’ అన్నారు. మరిన్ని రోజులు లీకుల పేరుతో నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? నా పరువు, ప్రతిష్ఠకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? రేవంత్‌రెడ్డి బాధ్యుడా? లీకులిచ్చిన పోలీసోళ్లు బాధ్యులా? రాసిన మీడియా వాళ్లు బాధ్యులా? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులను మీరు నిరోధించలేరా? అని అడిగా. మీడియాకు నేనొక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం లీకువీరుల ప్రభుత్వం. కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా ఇష్టానుసారంగా ప్రచురించవద్దు. వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? ఒకసారి దయచేసి పరిశీలించాలి. హరీశ్‌రావు విచారణ సందర్భంగా కూడా అనేక అడ్డగోలు లీకులిచ్చారు. ఈ రోజు కూడా ఇట్లా చేశారు. ఉకిరి బికిరి, ఇన్ని ప్రశ్నలు.. అన్ని ప్రశ్నలు అని లీకులిస్తారు. రెండేండ్లు అయిపోయింది. కాలక్షేపం జరగాల్సింది జరిగింది. ప్రజలకు అందించాల్సిన వినోదం అందించారు. కానీ ఇకనైనా మీడియా సంస్థలు దయచేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఎందుకంటే మాకు కూడా కుటుంబాలున్నయి. మాకూ అభిమానులున్నరు. మాకూ కార్యకర్తలున్నారు. మా నియోజకవర్గాల్లో మాపై ఆశలు పెట్టుకున్న ప్రజలున్నరు. వాళ్లు బాధపడుతరు. ఇష్టమొచ్చినట్టుగా అల్లి వార్తలు రాయవద్దు’ అని భావోద్వేగంతో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా. నేను ఏనాడూ అక్రమాలు, అన్యాయాలకు పాల్పడలే. ఏడెనిమిదేండ్లుగా నా మీద తీవ్ర క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్నది. ఏదో డ్రగ్స్ కేసులోనో.. హీరోయిన్లతో సంబంధాల్లోనో ఇరికించాలని చూసిండ్రు. దికుమాలిన వార్తలు రాసి నన్ను, నా కుటుంబాన్ని, పిల్లలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిండ్రు. అయినా నేను ఎవరికీ భయపడలే.
-కేటీఆర్
రెండేండ్లుగా ఈ ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, అవినీతిని బీఆర్ఎస్ నాయకత్వం ప్రతిరోజూ ఎండగడుతున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నదని వివరించారు. ‘ఓవైపు రాష్ట్ర రెవెన్యూ పడిపోతున్నది. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పోలీసు వ్యవస్థను రేవంత్‌రెడ్డి వాడుకుంటున్నడు. ఏదో ఒక కథను సృష్టించి, ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నడు’ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులుగా తాము ప్రభుత్వ వైఫల్యాలు, స్కామ్‌లను బయటపెట్టగానే సిట్ పేరిట నోటీసులిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. మూడు రోజుల కింద హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి సింగరేణి కాలరీస్‌లో వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని, దానిలో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి అని ఆధారాలతో హరీశ్ బయటపెడితే ఆయనకు నోటీసులిచ్చారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49 శాతం వాటా ఉన్నందున కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి ఈ దొంగలను పట్టుకుంటాడేమోనని భావించామని చెప్పారు. రేవంత్‌రెడ్డి డబ్బులతో అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ‘ఇంకా విచిత్రం ఏంటంటే, ఇవ్వాళ ఒక దొంగనే లేడు.. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా లెక క్యాబినెట్ తయారైంది. క్యాబినెట్లో ఎవరైతే ఉన్నారో అందరూ అందినకాడికి దోచుకుంటున్నారు’ అని ఫైర్ అయ్యారు.
ఆ దోపిడీని తాము బయట పెడుతుంటే వాళ్లకు ఎకడలేని మంట పుడుతున్నదని విమర్శించారు. తప్పు చేసినవాడు భయపడతాడు కానీ తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరని స్పష్టంచేశారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదు కాబట్టే రేవంత్‌రెడ్డికే కాదు ఆయన జేజమ్మకు కూడా భయపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.
తాము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ వెల్లడించారు. ఎన్ని కేసులు పెట్టినా, సిట్లు వేసినా, ఎన్ని సార్లు పిలిచినా చట్టాన్ని గౌరవించే పౌరులుగా తప్పక వస్తామని, తప్పు చేయలేదన్న మాటనే చెప్తామని కూడా చెప్పామని వివరించారు. ఈ కేసును ఇంతటితో తాము వదిలిపెట్టబోమని చెప్పారు. ‘నా క్యారెక్టర్ అసాసినేషన్‌కు బాధ్యులైన రేవంత్‌రెడ్డిని, ఆయన అడుగులకు మడుగులొత్తుతూ తొత్తులుగా పనిచేస్తున్న కొందరు పోలీసులను నేను వదిలిపెట్టను’ అని తీవ్రంగా హెచ్చరించారు. విచారణ నేపథ్యంలో తనకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
రెండేండ్లుగా రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నది. అందులో భాగంగానే కాళేశ్వరం, గొర్రెల సామ్, ఫార్ములా ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు! ఏదైతే కొన్ని కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారో అందులో భాగమే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.
-కేటీఆర్
ఇవ్వాళ రాష్ట్రంలో న్యాయం, ధర్మం, ఖాకీ బుకు అందరికీ ఒకటే తీరుగా ఉండాలి కదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధ పరిస్థితులున్నాయని మండిపడ్డారు. ‘ఇవ్వాళ సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంచాయతీలో దొంగలు దొరికారు. హరీశ్ ప్రెస్‌మీట్ పెట్టి ఆధారాలు ఇస్తానని చెప్పారు. ఇప్పటివరకు ఉలుకు లేదు పలుకు లేదు. ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తికి, మరో మంత్రి ఓఎస్డీకి మధ్య పంచాయతీ జరిగింది. రూ.300 కోట్ల కోసం ఓ పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టారని చెప్పి కేసు నమోదైనా దానిపై సిట్ ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూశాఖ మంత్రి కొడుకే ఇవ్వాళ భూ కబ్జాలు చేస్తూ గూండాలను పెట్టుకొని స్వైరవిహారం చేస్తున్నా దానిపై కూడా సిట్ లేదు. హిల్ట్ పాలసీ అని చెప్పి పారిశ్రామిక భూములను చెరబట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నా సిట్ ఉండదు. ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్‌గా మారి కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా దూరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినా సిట్ ఉండదు. ఒక ఏఐసీసీ సెక్రటరీ తమను డైరెక్ట్‌గా బెదిరిస్తూ 8 కోట్లు అడుగుతున్నాడని, లేదంటే పని చేయనివ్వడం లేదని ఓ కాంట్రాక్ట్ సంస్థ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్య ఉండదు?’ అని ధ్వజమెత్తారు.
‘ఇవాళ వాస్తవం ఏంది? 2015లో రాష్ట్రం మొత్తం చూస్తుండగా 50 లక్షల రూపాయలతో ఏ దొంగ అయితే అడ్డంగా దొరికిండో.. ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నడు. మిగతా రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తరు. మిగతా వాళ్లకు కూడా తన లాగానే బురద అంటించాలి.. బద్నామ్ చేయాలని విచారణకు వెంటనే ఆదేశాలు ఇస్తున్నరు’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒక ధారావాహిక సీరియల్ లాగా అడిగిన ప్రశ్నలే మళ్లీమళ్లీ అడిగారు తప్ప విచారణలో కొత్తగా ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ఓ 300 మంది పేర్లు చదువుతూ ఆయన తెలుసా, ఈయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా అని 8 గంటలు టైంపాస్ చేయడం తప్ప అకడ విషయం ఏమీ లేదని కొట్టిపడేశారు. తాము భయపడే వాళ్లమైతే సమయం అడిగేవాళ్లమని, కోర్టుకు వెళ్లేవాళ్లమని వివరించారు. నోటీసులు ఇచ్చే సమయంలో సిరిసిల్లలో ఉన్నానని, 4:30కు రమ్మంటే రాత్రే బయల్దేరి వచ్చేశానని వివరించారు. హరీశ్‌రావు సిద్దిపేటలో ఉండి కూడా పిలువగానే వచ్చారని గుర్తుచేశారు. తమకు భయముంటే ఎందుకు వస్తామని ప్రశ్నించారు. ‘ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్తాం. బాధ్యతగల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం. ఇవ్వాళ వాళ్లు అడిగిన దాంట్లో ఏమీ లేదు. సాక్షిగా పిలిచారా? లేక మరేదైనా కారణంతోనా అన్నది స్పష్టంగా తెలియదు. వాళ్ల దగ్గర కేస్ కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి తిప్పి అడగడం తప్ప ఏమీ లేదు’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. తన పకన ఎవరినో కూర్చోబెట్టి విచారించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ కల్పిత కథలని, అకడ తాను, పోలీసులు తప్ప మరెవరూ లేరని స్పష్టం చేశారు.