హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు రైతు వ్యతిరేక విధానాలు, చేతగానితనంతో రాష్ట్రంలో సాగు సంక్షోభం నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఒకే రోజు ముగ్గురు యువ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని బుధవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. వారి బలవన్మరణాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న సాగు వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీలు విస్మరించడంతోనే సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపేటకు చెందిన మొగిలి లక్ష్మణ్(45), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం పీక్లాతండాకు చెందిన గుగులోతు భాస్కర్(40), హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన నాలికి అనిల్(29) బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి చేతగానితనానికి ఉజ్వల భవిష్యత్తు కలిగిన ముగ్గురు రైతులు బలయ్యారని తూర్పారబట్టారు. వారి భార్యాబిడ్డలు, తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణం కాంగ్రెస్సేనని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ముందుచూపులేని చర్యలతో సృష్టించిన సాగునీటి సంక్షోభంతో బోర్లు వేసి, తీవ్రంగా నష్టపోయి మొగిలి లక్ష్మణ్, రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందక అప్పుల పాలై గుగులోతు భాస్కర్, భారీ వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం అందక నాలికి అనిల్ మనోవేదనతో తనువు చాలించారని పేర్కొన్నారు. యువ రైతుల ఆత్మహత్యలతో వారి కుటుంబాలు దిక్కుతోచనిస్థితిలో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అసమర్థ సర్కారు వైఖరితోనే అన్నదాతలు ఊపిరి వదిలారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో మరణమృదంగం
కేసీఆర్ తన పదేండ్ల పాలనాకాలంలో అనుసరించిన రైతు అనుకూల విధానాలతో సాగురంగం సంక్షోభం నుంచి గట్టెక్కిందని కేటీఆర్ తెలిపారు. అన్నదాతల ఆత్మహత్యలు 96 శాతం తగ్గాయని ఇటీవలే నేషనల్ క్రైం బ్యూరో రికార్డు (ఎన్సీఆర్బీ) నివేదిక తేల్చిచెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. మళ్లీ కాంగ్రెస్ గద్దెనెక్కగానే రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం మోగుతున్నదని దుయ్యబట్టారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెట్టుబడి సాయం అందక, పంటలకు గిట్టుబాటు ధర దక్కక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతాంగం మరణమృదంగం రాష్ట్రంలోని సాగు తీరుతెన్నులకు అద్దం పడుతున్నదని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగా మరోసారి రైతులు ప్రాణాలు తీసుకోవడం కలిచివేస్తుంద ని ఆవేదన వ్యక్తంచేశారు. మృత్యు ఘంటికలు విషాదమే కాదని, ముంచుకొస్తున్న పెను ముప్పునకు సంకేతాలని అభిప్రాయపడ్డారు.
అన్నదాతల్లారా.. అధైర్యపడకండి
‘అన్నదాతలు అధైర్యపడవద్దు, ప్రాణా లు తీసుకొని భార్యాపిల్లలకు కన్నీళ్లు మిగల్చవద్దు’ అని కేటీఆర్ కోరారు. తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ కేసీఆర్ రాగానే సాగును గాడిలో పెట్టుకుందామని స్పష్టం చేశారు. అప్పటివరకు సంఘటితంగా సాగు వ్యతిరేక సర్కారుపై పోరాడదామని సూచించారు. అవసరమైతే బీఆర్ఎస్ తరఫున అన్నదాతకు అండగా సమరశంఖం పూరిస్తామని ప్రకటించారు. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఏకమై తిరగబడి రైతు వ్యతిరేకి అయిన రేవంత్ సర్కారు బుద్ధిచెబుదాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.