KTR | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనీసం లక్షాధికారులనైనా చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో ఆడబిడ్డకు బాకీ పడ్డ రూ.లక్షన్నర ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు.
‘వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.4వేల పింఛన్, అత్తకు 4వేలు, కోడలికి రూ.2,500 ఇస్తానని ధోఖా చేశారు. కోటి మంది ఆడబిడ్డలకు రెండున్నరేండ్ల కాలానికి బాకీ పడ్డ రూ.75వేలు, మిగిలిన రెండున్నరేండ్లలో రూ.75 వేలు మొత్తం రూ.1.50లక్షలు ఇవ్వు.. నిరుద్యోగ భృతి కింద 40లక్షల మంది యువతకు రూ.4వేల చొప్పున ఇవ్వు.. నువ్వు కోరుకున్నట్టు రాజీనామాకు రెడీగా ఉన్నా’ అని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి మోచేతికి బెల్లంపెట్టి ఆరు గ్యారెంటీలంటూ అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
30నెలల్లో హైదరాబాద్‌లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు, ఇల్లు కట్టలేదు, కానీ వేల ఇండ్లు హైడ్రా పేరిట నేలమట్టం చేశారని విరుచుకుపడ్డారు. అన్నం ఉడికిందా లేదో చెప్పేందుకు ఒక్క మెతుకు చూస్తే చాలు.. ఆ ఒక్క ఉదాహరణతో రేవంత్‌రెడ్డి ఎవరి మనిషో చెప్పొచ్చని దెప్పిపొడిచారు. ఓట్ల కోసం తనకు ఓటేసిన తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి.. చివరకు సొంత పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీనటరాజన్కు కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ మొదటిసారి గెలిచిన తర్వాత 24గంటల కరెంట్ ఇచ్చామని.. మళ్లీ గెలువగానే 24గంటలు నీళ్లిస్తాం అని ప్రకటించారు. 3.23 లక్షలున్న ఐటీ ఉద్యోగాలను 10లక్షలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐటీ రంగం ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు.
‘రేవంత్ ఇచ్చిన హామీలను హైదరాబాద్వాళ్లు నమ్మలేదు. కానీ పల్లెటూరివాళ్లు ఆశలకు పోయి అరిగోసపడుతున్నారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఖైరతాబాద్ వాళ్లు దానంకు ఓటేస్తే నాకేస్తడని తెలిసే కేసీఆర్‌ను చూసి ఓటేసి గెలిపించారు తప్పితే ఆయనకు ఓటేయలేదు.. అనుకున్నట్టే ఓట్లేసినోళ్లను మోసం చేసిండు..’ అంటూ విమర్శలు గుప్పించారు. ఏదేమైనా ఖైరతాబాద్‌లో 2014, 2018లో గులాబీ పార్టీ గెలిచిందని, 2028లో మళ్లీ గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక వచ్చే అవకాశమున్నదని చెప్పారు. ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పి అభివృద్ధి పనులు చేసిన బీఆర్ఎస్కు పట్టం కడుతారనే విశ్వాసమున్నదని స్పష్టంచేశారు.
తనకు ఓటేసిన ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి.. చివరకు సొంత పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఎంపీ పదవికి ఎసరుపెట్టారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్‌రెడ్డి తెలంగాణలో భూములు, కాంట్రాక్టుల పేరిట తెలంగాణను కొల్లగొడుతున్నడని అధిష్ఠానానికి చెప్పినందుకే ఆమెపై పగ సాధించిండు.. నిజాయితీ కలిగిన నేతగా, రాహుల్ దూతగా పేరున్న మీనాక్షిపై కేసు ఉన్నదని బీజేపీకి ఉప్పందించిండు.. చివరకు వెన్నుపోటు పొడిచి కక్ష తీర్చుకున్నడు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
‘పాలకులెవరైనా గాంధీజీనో, అంబేద్కర్నో, ఇంతకుముందు సీఎంలుగా వ్యవహరించిన ఎన్టీఆర్‌నో, కేసీఆర్‌నో స్ఫూర్తిగా తీసుకుంటరు.. మన బట్లర్ ఇంగ్లిష్ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నరు.. ఆయన మాట్లాడిన మాటలు సిగ్గుచేటు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో మాదిరిగా డిమాలిష్ చేస్తాననడం దుర్మార్గమని మండిపడ్డారు. పాలకులెవరైనా ఇది కడుతా.. అది కడుతా అంటరు.. రేవంత్ మాత్రం కూలగొడ్తా.. పడగొడ్తాననడం దురదృష్టకరమని నిప్పులుచెరిగారు.
కాంగ్రెస్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ పదేండ్ల పాలనలో అమలైన పథకాలను కనుమరుగుచేయడం అసాధ్యమని కేటీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత హైదరాబాద్‌లోని కరెంట్, నీళ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించారని గుర్తుచేశారు. 24గంటల నాణ్యమైన కరెంట్‌తో పాటు ప్రతి ఇంటికీ 20వేల లీటర్ల సురక్షిత మంచినీరు అందించిన ఘనత ఆయనకే దక్కిందని స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రారంభించిన బస్తీ దవాఖానలకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సుస్తీ పట్టిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాదిరిగా మళ్లీ కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు పాల్పడే అవకాశం ఉన్నదని చెప్పారు. ఏమాత్రం అలసత్వం చేసినా తెలంగాణలోనూ ఇలాంటి కుట్రలు జరిగే ప్రమాదమున్నదని హెచ్చరించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును చురుగ్గా చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, పార్టీ సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్, ప్రసన్న, శ్రీనివాస్ నాయుడు, గోసుల శ్రీనివాస్‌యాదవ్, హేమలత, విప్లవ, రాంచందర్, విజయ్, అహ్మద్, నర్సింహ, జలాల్, సారంగపాణి, ఆంజనేయులు, వెంకటేశ్‌యాదవ్, ఆనంద్, మారమ్మ, ఉమ, జ్యోతి, మేఘన, గజ్జెల ఆనంద్, మధూకర్, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలిసోతెలియకో గవర్నమెంట్ జాగల ఇండ్లు కట్టుకున్న 2.50లక్షల మంది పేదలకు కేసీఆర్ పట్టాలిచ్చిండు. లక్ష మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. పప్పంతా ఉడికిన తర్వాత ఉప్పేసిన చందంగా అక్కడక్కడా ఇవ్వకుండా మిగిలిపోయిన ఇండ్లకు కాంగ్రెస్సోళ్లు సున్నమేసి గొప్పలు చెప్పుకొంటున్నరు. పాలకులెవరైనా ఇది కడుతా.. అది కడుతా అంటరు.. ఈ సీఎం మాత్రం ఇది కూలగొడ్తా.. అది పడగొడ్తా అనడం దురదృష్టకరం. – కేటీఆర్